హోమ్ /వార్తలు /తెలంగాణ /

Motkupalli Narasimhulu: బీజేపీకి షాక్.. మోత్కుపల్లి నర్సింహులు రాజీనామా.. ఈటలపై తీవ్ర ఆరోపణలు

Motkupalli Narasimhulu: బీజేపీకి షాక్.. మోత్కుపల్లి నర్సింహులు రాజీనామా.. ఈటలపై తీవ్ర ఆరోపణలు

మోత్కుపల్లి నర్సింహులు (ఫైల్ ఫోటో)

మోత్కుపల్లి నర్సింహులు (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ నిర్వహించిన దళిత సాధికారత అఖిల పార్టీ సమావేశానికి పార్టీలో చెప్పి వెళ్లినప్పటికీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం, ఈటల రాజేందర్ పార్టీలో చేర్చుకున్న విధానం కూడా తనను బాధించాయని అన్నారు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆయన లేఖ రాశారు.

ఇంకా చదవండి ...

  హుజూరాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓవైపు హుజూరాబాద్‌లో బీజేపీ ముమ్మర ప్రచారం చేస్తుంటే.. ఆ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు మాత్రం షాక్ ఇచ్చారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సీఎం కేసీఆర్ నిర్వహించిన దళిత సాధికారత అఖిల పార్టీ సమావేశానికి పార్టీలో చెప్పి వెళ్లినప్పటికీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం, ఈటల రాజేందర్ పార్టీలో చేర్చుకున్న విధానం కూడా తనను బాధించాయని అన్నారు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆయన లేఖ రాశారు. బీజేపీలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని.. తన అనుభవాన్ని పార్టీ ఉపయోగించుకోలేకపోయిందని మోత్కుపల్లి విమర్శించారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన దళిత బంధు అద్భుతమైన పథకమని కొనియాడారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో దళితులంతా సీఎం కేసీఆర్ పక్షాన నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

  ''దళితుల కోసం కేసీఆర్ గొప్ప కార్యక్రమం చేపట్టారు. దళిత బంధు పథకంతో దళితులు ఆర్థికంగా బాగుపడతారు. సామాజిక భద్రత లభిస్తుంది. ఇలాంటి గొప్ప పథకాన్ని తీసుకొచ్చినందుకు దేశ చరిత్రలో నిలిచిపోతారు. ఏ ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ పథకంపై సలహాలు ఇవ్వాలని కేసీఆర్ నన్ను అడిగారు. సీఎం కేసీఆర్‌కు అందరూ మద్దతు ఇవ్వాలి. ఆయన్ను దళితుడిగా గుర్తించాలి. నేను 30 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నాను. నా అనుభవాన్ని బీజేపీ ఉపయోగించుకోలేదు. నా కాళ్లను కట్టేసినట్లుగా ఉంచారు. అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నా. నా ఏ పదవి అవసరం లేదు. దళితులకు న్యాయం చేస్తారన్న విశ్వాసంతోనే బీజేపీకి రాజీనామా చేస్తున్నా.'' అని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.


  బీజేపీకి రాజీనామా చేసిన సందర్భంగా ఈటల రాజేందర్‌పై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మోత్కుపల్లి. ఆయన అవినీతి పరుడని..ఎన్నికల్లో పోటీ చేసే అర్హతే లేదని మండిపడ్డారు. ''ఈటల రాజేందర్ అవినీతిపరుడు. ఆయకు వేల కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది. ఎన్నికల్లో పోటీచేసే అర్హతే ఆయనకు లేదు. హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీని ఓడించండి. దళితులు, పేద వర్గాలు టీఆర్ఎస్‌కు ఓటువేసి గెలిపించాలి. అక్కడ ఈటల రాజేందర్ గెలవకూడదు.'' అని మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు.

  కాగా, జూన్ 27న సీఎం కేసీఆర్ అధ్యక్షతన దళితుల సాధికారతపై అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆ సమావేశానికి హాజరైన మోత్కుపల్లి నర్సింహులు..అదే రోజు బీజేపీ కార్యాలయంలో జరిగిన దళిత నేతల భేటీకి మాత్రం డుమ్మా కొట్టారు. ఆయన అఖిలపక్ష సమావేశానికి వెళ్లడంపై బీజేపీ పెద్దలు గుర్రుగా ఉన్నారు. తాము చెప్పినా వినకుండా అఖిపక్ష భేటీకి ఎందుకు హాజరుకావాల్సి వచ్చిందని విమర్శించారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీకి రాజీనామా చేశారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Bjp, Huzurabad, Huzurabad By-election 2021, Motkupalli Narasimhulu, Telangana

  ఉత్తమ కథలు