(K.Veeranna,News18,Medak)
బిడ్డల్ని కని పెంచిన తల్లిదండ్రులకు వారి బంగారు భవిష్యత్తు కోసం మంచి బాట వేయాలని మాత్రమే చూస్తారు. కాని వాళ్ల బతుకులు చిందరవందర అయితే భరించలేరు. ముఖ్యంగా కుర్ర వయసులో ఉండే అబ్బాయి, అమ్మాయిలు ప్రేమ(Love) పేరుతో మానసికంగా కుంగిపోవడం చూస్తూ ఏ తల్లి తట్టుకోలేదు. మెదక్ (Medak)జిల్లాలో కూడా అదే జరిగింది. ప్రేమ పేరుతో తన 20ఏళ్ల కొడుకు దూరమైపోవడాన్ని భరించలేకపోయింది ఆ తల్లి. అందుకే బిడ్డలేని జీవితం ఎందుకని బలవన్మరణాని(Sucide)కి పాల్పడింది.
రెండు ప్రాణాలు తీసిన ప్రేమ..
మెదక్ జిల్లాలో ప్రేమ వ్యవహారం రెండు ప్రాణాల్ని బలిగొంది. మూడ్రోజుల క్రితం రామాయంపేటకు చెందిన కటిక శివకుమార్ అనే యువకుడు ఉరి వేసుకొని చనిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు బలవన్మరణం చేసుకోవడంతో తల్లి వరలక్ష్మి తీవ్ర మానసికక్షోభకు గురైంది. కొడుకు శాశ్వతంగా దూరమవడంతో మూడ్రోజులుగా తిండి, నిద్ర లేకుండా కొడుకుని తలచుకుంటూ బ్రతికింది. చివరగా శుక్రవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోతున్న సమయంలో పాండ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం వరలక్ష్మి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. చెరువు కట్టవద్ద చెప్పులు కనిపించడంతో గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో గాలించగా ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు.
కొడుకు లేడని తల్లి సూసైడ్..
ఈసంఘటన జరగడానికి ముందు వరలక్ష్మి కుమారుడు శివకుమార్ పట్టణంలో చెట్టుకు ఉరివేసుకొని చనిపోయాడు. మృతుడు నార్సింగ్‌కు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. రెండు నెలల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. యువతి మేజర్ కాకపోవడం వల్ల అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర ఉంటోంది. అయితే ఈనెల 14వ తేదీకి ఆమె మేజర్ కావడంతో భర్త శివకుమార్ తన ఇంటికి రావాలని పలుమార్లు ఫోన్ చేశాడు. అందుకు ప్రియురాలు స్పందించలేదు. తన భార్య కాపురానికి రావడం లేదనే మనస్తపానికి గురైన శివకుమార్ ప్రాణాలు తీసుకున్నాడు.
ప్రేమెంత పని చేసే..
ప్రేమ పేరుతో బిడ్డ దూరమవడాన్ని తట్టుకోలేక శివకుమార్ తల్లి వరలక్ష్మీ చెరువులో దూకి ప్రాణాలు తీసుకుంది. భార్య, ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో భర్త లక్ష్మణ్ ఒంటరిగా మిగిలిపోయాడు. ఒక్క ప్రేమ వ్యవహారం ఇంట్లో ఇద్దరు ప్రాణాలు పోవడానికి కారణం కావడంతో స్థానికులు విచారం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Medak, Mother suicide with her childrens, Telangana News