MOSCOW MODEL BRIDGE JUTTING INTO HYDERABAD HUSSAIN SAGAR TO COME UP SOON SAYS TS OFFICIAL MKS
Hyderabad: హుస్సేన్‌సాగర్‌పై వేలాడే వంతెన.. మాస్కో మోడల్ నిర్మాణం: KCR సర్కార్
మాస్కోలో మోస్క్వా నదిపై బ్రిడ్జ్
హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరనుంది. నగరంలోని ప్రఖ్యాత పర్యాటన ప్రాంతం హుస్సేన్ సాగర్ పై వేలాడే వంతెన రాబోతోంది. మాస్కో తరహా మోడల్ లో హైదరాబాద్ లోనూ ఈ మేరకు నిర్మాణం..
విశ్వనగరం హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరనుంది. నగరంలోని ప్రఖ్యాత పర్యాటన ప్రాంతం హుస్సేన్ సాగర్ పై వేలాడే వంతెన రాబోతోంది. మాస్కో తరహా మోడల్ లో హైదరాబాద్ లోనూ ఈ మేరకు నిర్మాణం చేపట్టేలా కేసీఆర్ సర్కారు ప్రణాళికలు సిద్దం చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) కమిషనర్ అర్వింద్ కుమార్ ఐఏఎస్ శుక్రవారం ట్వీట్ ద్వారా వెల్లడించారు.
రష్యా రాజధాని మాస్కోలోని నదీ తీరంలో నిర్మించిన తేలియాడే వంతెన లాంటిదే హుస్సేన్ సాగర్ చెంతనా రాబోతోందని, ఈ ఏడాది(2022) ఆఖరు నాటికి నెక్లెస్ రోడ్డులోని వీపీ ఘాట్ వద్ద ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఏఎస్ అధికారి తెలిపారు. మాస్కోలోని జర్యాడే పార్క్‌లో మోస్క్వా నదిపై తేలియాడే వంతెన ఉంది. అక్కడ ఉత్తమ పర్యాటక ప్రాంతాల్లో అదొకటిగా నిలుస్తోంది. నది లోపలకి యూ ఆకారంలో దాదాపు 70 మీటర్ల పొడవుతో నిర్మించారు. వంతెన కింద 13 మీటర్ల దూరం నుంచి మోస్వ్యా నది ప్రవహిస్తుంది. ఈ వంతెనపై ఉంటే నదిలో తేలుతున్న అనుభూతి కలుగుతుంది.
మాస్కో సిటీలో మోస్క్వా నదిపై నిర్మించిన వంతెన.. ఎలాంటి స్తంభాలు లేకుండా రోప్‌వే ద్వారా నదిలోకి చొచ్చుకొని పోయినట్లుటుంది. ఈ ఇంజినీరింగ్ అద్భుతం మన హైదరాబాద్ లోనూ ఆవిష్కృతం కానుంది. గతంలో ఇదే కేసీఆర్ సర్కారు హైదరాబాద్ లోని దుర్గం చెరువుపై ఇలాంటి సాంకేతికతను ఉపయోగించి వంతెన నిర్మించిన విషయం తెలిసిందే. ఇంతకంటే అత్యాధునిక సాంకేతికతతో మోస్క్వా నదిపై తేలాడే వంతెనను అందుబాటులోకి తెచ్చారు. ఆ కొత్త మోడల్ లోనే హుస్సేన్ సాగర్ పై బ్రిడ్జి రానుంది.
మాస్కో మోడల్ బ్రిడ్జిలో పారదర్శకమైన గాజును వినియోగించారు. ఫలితంగా వంతెనపై నిల్చొని కిందకు చూస్తే... నది అలలు, అందాలు స్పష్టంగా కనిపిస్తాయి. వంతెన డెక్ మొత్తం పొడవు 244 మీటర్లు. ఒకేసారి వంతెనపై 2400 మంది వరకు నిల్చొని నది అందాలతో పాటు జుర్యాడే పార్కు, రెడ్ స్క్వేర్ కళా చిత్రాలను తనివి తీరా చూడవచ్చు. నెక్లెస్ రోడ్డు వద్ద హుస్సేన్ సాగర్‌పై ఇలాంటి వంతెను వస్తే... హైదరాబాద్ పర్యాటక ముఖ చిత్రమే మారిపోనుంది.
A surprise, well something similar, is on its way at the PVNR marg, jutting into the Hussain Sagar, will be up and running before the end of this year https://t.co/yoju5WOPzIpic.twitter.com/sPluPaIuqq
ఇప్పటికే ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డును ఏటా లక్షలాది మంది వీక్షిస్తుంటారు. త్వరలో ట్యాంక్‌బండ్ వద్ద నైట్ బజార్ రానుంది. ఈ తేలియాడే వంతెనతో సాగర్ అందాలు ఇనుమడించనున్నాయి. గతంలో ట్యాంక్‌బండ్‌పై లండన్ ఐ ఏర్పాటుకు హెచ్ఎండీఏ ప్రణాళికలు చేసినా ప్రాజెక్టు ముందుకు కదలలేదు. అదే తరహాలో మరో ప్రాజెక్టు రూపకల్పనకు అడుగులు పడుతుండటంతో ఆసక్తి నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.