హోమ్ /వార్తలు /తెలంగాణ /

Encounter: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు నేత భాస్కర్ భార్య మృతి.. తెలంగాణ బోర్డర్‌లో మళ్లీ టెన్షన్

Encounter: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు నేత భాస్కర్ భార్య మృతి.. తెలంగాణ బోర్డర్‌లో మళ్లీ టెన్షన్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ ఘటనలో నిర్మల్ జిల్లాకు చెందిన మహిళా మావోయిస్టు మృతి చెందారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

(కట్టా లెనిన్, న్యూస్18 తెలుగు, ఆదిలాబాద్ జిల్లా)

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ ఘటన కలకలం రేపింది. ఈ ఎన్ కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా, మరొకరు గాయపడినట్లు మహారాష్ట్ర  ( Maharashtra) పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. మృతి చెందిన ఇద్దరు మావోయిస్టుల్లో ఒకరు తెలంగాణకు చెందిన మావోయిస్టు ముఖ్య నేత మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ భార్య కంతి లింగవ్వ ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే కంతి లింగవ్వ స్వస్థలం నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లక్ష్మీసాగర్ గ్రామం. కాగా కంతి లింగవ్వ పై మహారాష్ట్ర ప్రభుత్వం 16 లక్షల రివార్డును ప్రకటించగా, తెలంగాణ ప్రభుత్వం ఐదు లక్షల రివార్డును ప్రకటించింది.

కంతి లింగవ్వ  మావోయిస్టుల పాటలు, మాటలకు ఆకర్శితురాలై 1997 ప్రాంతంలో దళంలో చేరిందని సమాచారం. లింగవ్వ సోదరుడు రవి అలియాస్ సురేష్ కూడా కొంతకాలం దళంలో చేరి అక్కడ పనిచేసి తిరిగి 2016లో పోలీసులకు లొంగిపోయాడు. కాగా కంతి లింగవ్వ మావోయిస్టు పార్టీలో మంగి దళం ఇంద్రవెల్లి ఏరియా కమిటి కార్యదర్శిగా, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల డివిజనల్ కమిటి సభ్యురాలిగా ఉన్నట్లు సమాచారం. గతంలో లింగవ్వ సింగపూర్, బోథ్, చెన్నూరు దళాల్లో, జన నాట్య మండలిలో సభ్యురాలిగా పనిచేసినట్లు సమాచారం.

ఇక ఆదిలాబాద్ , నిర్మల్ జిల్లాల నుంచి మావోయిస్టులు ఉన్నప్పటికి ఈ ప్రాంతంలో అంతగా మావోయిస్టుల కదలికలు  లేవు.  కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో కదలికలు ఉన్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి, చత్తీస్ ఘడ్ లలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సుమారు 20 మంది మావోయిస్టులు వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నట్లు సమాచారం. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ కోసం గాలింపు కొనసాగుతోంది.

ఇటీవల ప్రాణహిత, పెన్ గంగా పరీవాహాక ప్రాంతాల నుండి మాయిస్టులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశించారన్న సమాచారంతో జిల్లా సరిహద్దులోని అటవీ సమీప గ్రామాలలో పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. అటు సరిహద్దు ప్రాంతాల నుండి వచ్చిపోయే వాహనాలను కూడా విస్తృతంగా తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో తాజా ఎన్ కౌంటర్ ఘటనతో ఉమ్మడి జిల్లాలోని పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. సరిహద్దు ప్రాంతాలపై మరోసారి దృష్టిసారించారు.

First published:

ఉత్తమ కథలు