తెలంగాణలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ((Delhi Liquor Scam) ప్రకంపనలు రేపుతోంది. ఏకంగా సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) పేరు రావడంతో.. రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. టీఆర్ఎస్ను, కల్వకుంట్ల ఫ్యామిలీని టార్గెట్ చేసి బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. టీఆర్ఎస్ కూడా ఎదురు దాడి చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. తాజాగా ఆ నోటీసులపై కవిత స్పందించారు. కంప్లైంట్ ఒరిజినల్ కాపీ, సీబీఐ ఎఫ్ఐఆర్ కావాలని ఆమె కోరారు. అవి తనకు అందిన తర్వాతే వివరణకు డేట్ ఫిక్స్ చేయాలని తెలిపారు. ఈ మేరకు సీబీఐ అలోక్ షాహీకి కవిత లేఖ రాశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) శుక్రవారం ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలో నమోదుచేసిన ఆర్సీ 53(ఏ)/2022 కేసులో దర్యాప్తు కోసం.. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద.. సీబీఐ ఢిల్లీ విభాగానికి చెందిన డీఎస్పీ అలోక్ కుమార్ షాహి కవితకు నోటీసులు పంపించారు. లిక్కర్ స్కామ్ దర్యాప్తులో భాగంగా.. డిసెంబరు 6వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లో గానీ, ఢిల్లీలో గానీ.. మీ నివాసంలో విచారించాలనుకుంటున్నామని ఆయన తెలిపారు. మీకు ఎక్కడ సౌకర్యవంతంగా ఉంటుందో చెబితే.. అక్కడికే వచ్చి విచారిస్తామని అందులో పేర్కొన్నారు. ఆ నోటీసులపై స్పందిస్తూ..సీబీఐ ఇవాళ లేఖ రాశారు కవిత. ఫిర్యాదు కాపీ, ఎఫ్ఐఆర్ కాపీలు అందిన తర్వాత.. తనను విచారించవచ్చని తెలిపారు.
లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్ట్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించిన విషయం తెలిసిందే. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలను వెల్లడించింది. ఈ రిపోర్టులోనే కవిత పేరు తెరపైకి వచ్చింది. ఆప్ నేతలకు రూ. 100 కోట్ల ముడుపులను సౌత్‌గ్రూప్ చెల్లించినట్టు పేర్కొన్న ఈడీ.. ఈ మొత్తాన్ని సమకూర్చిన వారిలో కవిత పేరును కూడా చేర్చింది. సౌత్ గ్రూప్‌ను శరత్ రెడ్డి, కవిత, మాగుంట శ్రీనివాసులురెడ్డి నియంత్రించారని ఈడీ తెలిపింది. సౌత్‌గ్రూప్ ద్వారా రూ. 100 కోట్లను విజయ్ నాయర్‌కు చేర్చినట్టు వెల్లడించింది.
ఆప్ నేతల తరపున విజయ్ నాయర్ ఈ మొత్తాన్ని తీసుకున్నట్టు ఈడీ ప్రస్తావించింది. పది సెల్ఫోన్లను కూడా కవిత డ్యామేజ్ చేసినట్టు ఈడీ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. మొత్తం 36 మందికి చెందిన 170 ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ ఆరోపించింది. ఈ రిపోర్ట్‌లో కవిత పేరుతోపాటు వైసీపీ ఎంపీగా ఉన్న లిక్కర్ వ్యాపారి మాగుంట శ్రీనివాసులురెడ్డి (Magunta Srinivasulu Reddy) పేరు కూడా తెరపైకి రావడం గమనార్హం. మరి ఈ కేసులో సీబీఐ విచారణకు కవిత హాజరవుతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Kalvakuntla Kavitha, Telangana