Delhi Liquor Scam: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇవాళ ఈడీ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే 3 సార్లు విచారణకు హాజరైన కవితకు ఇవాళ మరోసారి విచారణకు రావాలని సడన్ గా నోటీసులు జారీ చేశారు. అయితే విచారణ సమయంలో కవిత అప్పగించిన ఫోన్లు ఓపెన్ చేయాలనీ ఈడీ భావించింది. ఈ మేరకు కవితను కానీ లేదంటే తన ప్రతినిధి కానీ రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు కవిత ప్రతినిధి సోమా భరత్ ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు.
ఉదయం ఈడీ ఆఫీస్ కు వెళ్లిన ఆయనను అధికారులు 5 గంటలకు పైగా విచారించారు. ప్రధానంగా ఆ ఫోన్లలో ఉన్న డేటా, ఇతర అంశాలపై భరత్ ను ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తుంది. అయితే మరోసారి విచారణకు పిలవలేదని..వారికి ఉన్న డౌట్లను నివృత్తి చేసుకునేందుకు పిలిచారని భరత్ విచారణ అనంతరం చెప్పుకొచ్చారు. కవిత ఇచ్చిన 10 ఫోన్లను ఈడీ అధికారులు ఓపెన్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఆ ఫోన్లలో ఏ సమాచారం ఉంది? ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయనేది ఆసక్తికరంగా మారింది.
కాగా ఈ కేసులో ఇప్పటికే నిందితుల నుంచి చాలా సమాచారాన్ని అటు ఈడీ, ఇటు సీబీఐ సేకరించింది. ముఖ్యంగా సౌత్ గ్రూప్ కు సంబంధించి నిధుల గురించి..అలాగే ఎవరి పాత్ర ఏంటనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ కేసులో కవిత మాజీ సీఏ బుచ్చిబాబు సహా హైదరాబాద్ కు చెందిన పలువురిని ఈడీ అరెస్ట్ చేసింది. అలాగే ఎమ్మెల్సీ కవిత 4 ఫోన్లు మార్చారని..మరిన్ని ఫోన్లు ధ్వంసం చేశారని ఈడీ ఆరోపించింది. అంతేకాదు మొత్తం 36 మంది 70 ఫోన్లు మార్చారని ఆరోపిస్తూ వస్తుంది. ఈ ఫోన్ లో డేటా రికవరీ ద్వారా కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి.
ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో భాగంగా ఈడీ అధికారులు ఇప్పటికే 3 సార్లు విచారించారు. మొదటగా ఆమెకు ఈనెల 11న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. సుమారు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ విచారణ కొనసాగింది. ఆ సమయంలో కవిత ఫోన్ ను అధికారులు సీజ్ చేశారు. అయితే 11న కవితను విచారించిన అధికారులు 16న మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. కానీ సుప్రీంకోర్టులో పిటీషన్ ఉన్న కారణంగా ఆ తీర్పు వచ్చే వరకు విచారణకు రాలేనని కవిత తన ప్రతినిధి ద్వారా ఈడీకి సమాచారం అందించారు. ఆరోజు నెలకొన్న హైడ్రామాతో విచారణ జరగలేదు.
అయితే ఈనెల 20న విచారణకు రావాలని కవితకు మూడోసారి నోటీసులు ఇచ్చారు. దీనితో ఆమె విచారణకు హాజరు కాక తప్పలేదు. ఆ మరుసటి రోజు కూడా విచారణకు రావాలని చెప్పగా..21న కూడా కవిత విచారణకు హాజరయ్యారు.ఆ తరువాత 21న జరిగిన విచారణలో 9 ఫోన్లను కవిత ఈడీకి స్టీల్ కవర్ లో అప్పగించారు. దాదాపు 3 రోజుల పాటు 30 గంటలు కవితపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తుంది. అయితే ఒక మహిళను ఈడీ ఆఫీస్ లో రాత్రి వరకు విచారించడాన్ని ఆమె తప్పుబట్టారు. ఈడీ అధికారులు నిబంధనలకు లోబడి విచారణ జరపడం లేదని కవిత తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
దీనిపై నిన్న కోర్టులో విచారణ జరగగా ఇరువర్గాల వాదనలు వినిపించారు. అనంతరం విచారణను 3 వారాలకు వాయిదా వేస్తున్నట్టు సుప్రీం డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. కవిత తరపున కపిల్ సిబాల్ అనే న్యాయవాది వాదనలు వినిపించారు. కవితకు ఇచ్చిన నోటీసుల్లో ఇన్వెస్టిగేషన్ కు రమ్మని చెప్పారు. ఆమె నిందితురాలు కానప్పుడు ఇన్వెస్టిగేషన్ కు ఎలా పిలుస్తారని కోర్టు దృష్టికి సిబాల్ తీసుకొచ్చారు. ఈడీ విచారణ సరిగా లేదని..తనకు నోటీసులు ఇవ్వడం సరి కాదని..విచారణ సమయంలో తన ఫోన్ ను సీజ్ చేశారని కవిత పిటీషన్ లో పలు అంశాలను లేవనెత్తారు. ఒక మహిళను ఈడీ ఆఫీస్ లో సూర్యాస్తమయం వరకు విచారించడాన్ని తప్పుబడుతూ పిటీషన్ లో పేర్కొన్నారు. అయితే PMLA చట్టం ప్రకారం ఈడీ అధికారులు ఎవరికైనా నోటీసులు ఇవ్వొచ్చు. అలాగే ఎంతసేపైనా విచారించవచ్చని ఈడీ తరపు న్యాయవాది తెలిపారు. దాదాపు 15 నిమిషాల పాటు సుప్రీంలో వాదనలు జరిగాయి. ఈ క్రమంలో కవితకు, ఈడీకి లిఖితపూర్వక వాదనలు ఇవ్వాలని సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈడీ అధికారాలను ప్రస్తావిస్తూ..నళిని చిదంబరం పిటీషన్ తో కలిపి కవిత పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.
అయితే ఫోన్లు ఓపెన్ చేసి డేటా రికవరీ చేసిన ఈడీ అధికారులు నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఫోన్లో ఉన్న డేటా ఆధారంగా రానున్న రోజుల్లో ఈ కేసులో కీలక పరిణామాలు ఉండే అవకాశం లేకపోలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi liquor Scam, Enforcement Directorate, Kalvakuntla Kavitha, Telangana