కొండగట్టు నుంచి రాయికల్ వెళ్లే క్రమంలో మల్యాల మండలం రాజారాం గ్రామం దగ్గర కవిత ప్రయాణిస్తున్న కాన్వాయ్ అదుపుతప్పింది. స్పల్ప రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే కవితకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
తెలంగాణ రాష్ట్ర సమితి నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు పెద్ద ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో కారు దెబ్బతింది. కవిత ఎలాంటి గాయాలు కాకుండా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. గురువారం నాడు కొండగట్టు నుంచి రాయికల్ వెళ్లే క్రమంలో మల్యాల మండలం రాజారాం గ్రామం దగ్గర కవిత ప్రయాణిస్తున్న కాన్వాయ్ అదుపుతప్పింది. స్పల్ప రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే కవితకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ, సడెన్ గా కారు ప్రమాదానికి గురి కావడంతో వెనుక వస్తున్న కాన్వాయ్ లోని 5 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కార్లలో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకపోయినప్పటికీ కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆ తర్వాత వేరే కారులో కవిత బయలుదేరి వెళ్లారు. కవితకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కల్వకుంట్ల కవిత గురువారం జగిత్యాల జిల్లాలో పర్యటించారు. రాయికల్ మండలం కొత్తపేట గ్రామంలోని నాగాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దొంగల మర్రి చౌరస్తాలో స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ కూడా ఆడారు. నాగాలయంలో జరిగిన ప్రత్యేక పూజలో భాగంగా ఎమ్మెల్సీ కవిత ఉత్సవ మూర్తులకు పంచామృత అభిషేకం చేశారు. అలాగే ప్రసిద్ధి పొందిన కొండగట్టు ఆంజనేయ స్వామినికూడా కవిత దర్శించుకున్నారు. తర్వాత కొండగట్టు నుంచి రాయికల్ వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.