తెలంగాణలో లాక్‌డౌన్ కఠినంగా అమలవుతున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు ఎవరినీ రోడ్డు మీదకు అనుమతించడం లేదు. ఐతే కొందరు అధికారులు అత్యవసర సేవలకు కూడా మినహాయింపు ఇవ్వడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఆస్పత్రికి వెళ్తున్నానని.. ఆధారాలు చూపించినా వదల్లేదని గతవారం సినీ నటడు నిఖిల్ ట్విట్ చేశారు. తాజాగా ఎమ్మెల్యే సీతక్క కుటుంబ సభ్యులకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లికి రక్తదానం చేసేందుకు వెళ్తుండగా.. తమ బంధువులను పోలీసులు అడ్డుకున్నారని సీతక్క మండిపడ్డారు. ఈ-పాస్ ఉన్నప్పటికీ కనీస కనికరం లేకుండా ప్రవర్తించారని మల్కాజ్‌గిరి డీసీపీపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే సీతక్క తల్లికి ఆరోగ్యం బాగాలేదు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. రక్తం అవసరం ఉండడంతో.. సీతక్క బంధువులు రక్తదానం చేసేందుకు ములుగు నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. లాక్‌డౌన్ సమయంలో కూడా ప్రయాణించేలా ములుగు జిల్లా కలెక్టర్ అనుమతి కూడా తీసుకున్నారు. ఐతే హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత వారిని మల్కాజ్‌గిరి డీసీసీ రక్షిత అడ్డుకున్నారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తారా? అని కోప్పడ్డారు. ఐతే తాము ఈపాస్ తీసుకున్నామని చెప్పినా వినలేదని.. సీతక్క ఆరోపించారు. వీడియో కాల్ చేసి.. తన తల్లిని చూపించినా పట్టించుకోలేదని ఎమ్మెల్యే విమర్శించారు. ఎమ్మెల్యేకే ఇలాంటి అనుభవం ఎదురయితే.. సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని మండిపడ్డారు సీతక్క.
డీసీపీ రక్షిత తన డ్యూటీ నుంచి వెళ్లిపోయిన తర్వాత.. కింది స్థాయి సిబ్బంది వారిని అనుమతించినట్లు సీతక్క చెప్పారు. అందరినీ ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని అన్నారు. ఎవరి పరిస్థితి ఏంటో.. ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో తెలుసుకోవాలని ఆమె సూచించారు. కనీసం మానవత్వంతో వ్యవహరించాలని.. ఇలాంటి వారుంటే చాలా మంది ప్రాణాలు పోతాయని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్‌లో వీడియో పోస్ట్ చేశారు సీతక్క.
My mom is fighting for life in hospital police stopped my family members who is coming to donate blood with permission, @DcpMalkajgiri Ignored to talk to me on video call stopped them 30 mins & and spoke harshly with them.
— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) June 3, 2021
?Imagine the position of common man. @TelanganaDGP pic.twitter.com/D2p25shC5I
ములుగు జిల్లా కలెక్టర్ నుంచి ఈపాస్ అనుమతులు తీసుకున్నప్పటికీ.. తమ బంధువులకు జరిమానా విధించినట్లు ఆమె చెప్పారు. ఫైన్లు, చలానాల కన్నా మానవత్వం ముఖ్యమని విమర్శించారు. మల్కాజ్‌గిరి డీసీసీ తీరుపై ట్విటర్ ద్వారా డీజీపీకి ఫిర్యాదు చేశారు సీతక్క. పోలీసుల తీరును మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు ఇతర నేతలు తీవ్రంగా ఖండించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, MLA seethakka, Telangana, Telangana lockdown