Home /News /telangana /

MLA IS SUFFERING FROM HIS SON VANAMA RAGHAVENDRA GETTING INTO NEW CONTROVERSIES KMM VB

MLA Vanama Venkateswara Rao: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాకు ‘సన్‌’స్ట్రోక్‌.. అసలేం జరిగిందంటే..

వనమా వెంటేశ్వరరావు అతని కుమారుడు (ఫైల్)

వనమా వెంటేశ్వరరావు అతని కుమారుడు (ఫైల్)

Khammam News: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సన్‌స్ట్రోక్‌ తగులుతోంది. ఆయన కుమారుడు వనమా రాఘవేంద్ర అలియాస్‌ రాఘవ ఎప్పటికప్పుడు కొత్త కొత్త వివాదాల్లో తలదూర్చుతూ తండ్రికి తలనొప్పులు తెస్తున్నట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  (జి. శ్రీనివాసరెడ్డి, న్యూస్‌18 తెలుగు, ఖమ్మం జిల్లా) 

  కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సన్‌స్ట్రోక్‌ తగులుతోంది. ఆయన కుమారుడు వనమా రాఘవేంద్ర అలియాస్‌ రాఘవ ఎప్పటికప్పుడు కొత్త కొత్త వివాదాల్లో తలదూర్చుతూ తండ్రికి తలనొప్పులు తెస్తున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే రాఘవ పైన అనేక ఆరోపణలు, కేసులు ఉండగా తాజాగా ఒక వ్యాపారి ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న నేరారోపణపై పాల్వంచ టౌన్‌ పోలీసుస్టేషన్‌లో రాఘవ పైన కేసు నమోదైంది. దీంతో మరోసారి స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఇరకాటంలో పడినట్లయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం సృష్టించిన వ్యాపారి ఆత్మహత్య కేసులో రాఘవను పోలీసులు ఏ2గా పేర్కొన్నారు. బంధువులైన ఇద్దరు వ్యక్తుల ఆర్థిక వ్యవహారాల్లో వనమా రాఘవ ఒకరి పక్షం వహించడం వల్లే, తనకు అన్యాయం జరిగిందని.. తాను సర్వం కోల్పోయానని పేర్కొంటూ ఆత్మహత్యకు పాల్పడిన మల్లిపెద్ది వెంకటేశ్వరరావు సూసైడ్‌ నోట్‌ సంచలనం సృష్టించింది. తన భర్త చావుకు వనమా రాఘవే కారణమంటూ అతని భార్య శ్రావణి, ఇతర కుటుంబ సభ్యులు పోలీసుస్టేషన్‌ ఎదుట ధర్నా కూడా చేయాల్సి వచ్చింది.

  దీంతో తీవ్ర వత్తిడి రావడంతోనే పాల్వంచ పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. రాఘవపై ఐపీసీ సెక్షన్‌ 306 నమోదు చేస్తూ, ఎఫ్‌ఐఆర్‌ నెం.268\2021ను నమోదు చేశారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వనమా వెంకటేశ్వరరావు ప్రతిష్ట మసక బారినట్లయింది. ఇటు సొంత పార్టీలోని జలగం వెంకటరావు వర్గం ఇప్పటికే వెంకటేశ్వరరావు ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తూ వస్తోంది. స్వయంగా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు తానే సెల్ఫీ వీడియో ద్వారా న్యాయ విచారణకు డిమాండ్‌ చేయడం కొత్తగూడెం టీఆరెఎస్‌లో ముసలం పుట్టినట్లయింది. ఫలితంగా ఎమ్మెల్యే వనమాకు తలనొప్పి పెరిగింది. పాత పాల్వంచ పంచాయతీబోర్డులో సాధారణ వార్డు సభ్యునిగా రాజకీయ జీవితం ప్రారంభించిన వనమా వెంకటేశ్వరరావు నెమ్మదిగా ఎదుగుతూ పలు పొజిషన్లను సొంతం చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంకళరావుకు శిష్యరికం చేస్తూ కాంగ్రెస్‌లో ఎదిగారు.

  అనంతరం జలగం వెంగళరావు మద్దతుతో కొత్తగూడెం ఎమ్మెల్యేగా పలుమార్లు గెలుపొందారు. 2004 వైఎస్‌. రాజశేఖరరెడ్డి క్యాబినెట్‌లో వైద్య విధానపరిషత్‌ శాఖకు మంత్రిగా పనిచేశారు. అనంతరం జరిగిన రెండు వరుస ఎన్నికల్లో ఓడిపోయినా.. పదేళ్ల అనంతరం మళ్లీ కాంగ్రెస్‌ నుంచి 2018లో గెలుపొందారు. గెలిచిన కొద్ది నెలలకే తెరాస తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఇక్కడ వనమా పై ఓటమి పాలైన జలగం వెంకటరావు తన పటిష్టమైన నెట్‌వర్క్‌తో ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే వనమా వైఫల్యాలు, వివాదాలపై ప్రజల్లో విస్త్రుత చర్చకు తావిచ్చేలా సోషల్‌ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ సైతం ప్రతిపక్షం పెద్దగా పాత్ర చూపలేకపోగా, తెరాసలోని జలగం వర్గమే ప్రతిపక్ష పాత్రను పోషిస్టున్నట్టు చెప్పుకోవాల్సి ఉంది. ఫలితంగా మొదటి నుంచి తండ్రికి తలనొప్పిగా తయారైన వనమా రాఘవ వ్యవహారశైలి రానురాను తండ్రి ప్రతిష్టకు సవాలుగా మారుతోంది. పలు భూవివాదాల్లోనూ తలదూర్చి అభాసుపాలైన రాఘవపై తాజాగా కేసు నమోదు కావడం ఎమ్మెల్యే వనమాకు ఇబ్బందికరమైన అంశంగా చెబుతున్నారు. అసలు ఇద్దరు ప్రవేటు వ్యక్తులు, అందునా బంధువులైన వారి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల్లో ఒకరి పక్షం వహించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది ఇక్కడ తెరాసలోని ఒక వర్గం ప్రశ్నగా మారింది.

  ఏదైనా ఉంటే చట్టప్రకారం చూసుకోవాల్సిన అంశాన్ని, తన పరిధిలోకి తెచ్చుకుని ఒకరి బలవర్మణానికి కారణం అవడంతోపాటు, రాజకీయంగా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి తెచ్చుకుంటున్నారని తెరాసలోని వనమా అనుకూల వర్గమే అంటోందంటే పరిస్థితిని అంచనా వేయొచ్చు. దీనికితోడు ఇప్పటికే వనమాకు తోడల్లుడు కృష్ణ నుంచి ఇంటిపోరు ఉండగా, ఇది అదనంగా మారినట్లయిందంటున్నారు. గతంలో రెండుసార్లు ఓటమికి కూడా ఇంటిపోరే కారణమంటుండగా, తాజాగా మరోసారి మాజీ మంత్రి, కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావుకు సన్‌స్ట్రోక్‌ తగిలే ప్రమాదం లేకపోలేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదంతా గాలికి కొట్టుకుపోయే కంపను నెత్తికి చుట్టుకున్నట్టుగా ఉందని కొత్తగూడెం తెరాసలోని ఓ వర్గం నేత వ్యాఖ్యానించారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Khammam, Telangana Politics, Vanama

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు