మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో రోజురోజుకు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్రభారతి (Rama chandhra bharathi), నందకుమార్ (Nandhakumar), సింహయాజి (Simhayaji) బెయిల్ పై హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై రేపు హైకోర్టు విచారణ జరపనుంది. ఇదిలా ఉండగా తెలంగాణ హైకోర్టులో బీజేపీ నేత BL సంతోష్ క్వాష్ పిటీషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది. సంతోష్ తరపు న్యాయవాది లంచ్ మోషన్ పిటీషన్ ను అడిగినట్లు తెలుస్తుంది. కాగా సంతోష్ కు ఇప్పటికే సిట్ 41A CRPC కింద విచారణకు రావాలని నోటీసులు ఇవ్వగా..తాజాగా దానిపై క్వాష్ పిటీషన్ వేసినట్లు తెలుస్తుంది.
తన పేరును తొలగించాలని పిటీషన్..
ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి BL సంతోష్ నిందితులతో మాట్లాడినట్టు సిట్ వాదిస్తుంది. అందుకే సంతోష్ ను విచారిస్తే కీలక విషయాలు బయటకు రానున్నాయి. దీనితో సంతోష్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 26న లేదా 28న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే దీనిపై బిఎల్ సంతోష్ హైకోర్టును అశ్రయించినట్టు తెలుస్తుంది. సిట్ నోటీసులను కొట్టేయాలని క్వాష్ పిటీషన్ ను ఆయన తరపు న్యాయవాది వేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ కేసులో విడుదలైన ఆడియో, వీడియోలో బిఎల్ సంతోష్ పేరు కూడా వినిపించింది. అయితే ఈ కేసులో తన పేరును తొలగించాలని హైకోర్టులో పిటీషన్ వేశారు BL సంతోష్. దీనిపై మరికాసేపట్లో కోర్టులో విచారణ జరగనుంది.
ఈ కేసులో గతంలో BL సంతోష్, తుషార్, జగ్గుస్వామి, కరీంనగర్ అడ్వకేట్ శ్రీనివాస్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. అయితే శ్రీనివాస్ తప్ప మిగతా ముగ్గురు విచారణకు హాజరు కాలేదు. దీనితో వారిపై సిట్ మెమో దాఖలు చేసింది. ఇప్పటికే A1 గా రామచంద్రభారతి (Rama chandhra bharathi), నందకుమార్ A2గా (Nandhakumar), సింహయాజి (Simhayaji) A3లుగా ఉన్నారు. కాగా A4గా బీజేపీ అగ్రనేత BL సంతోష్ (santosh), A5గా తుషార్ (Thushar), A6గా జగ్గుజీస్వామి (Jagguji swami), A7గా బండి సంజయ్ అనుచరుడు, న్యాయవాది శ్రీనివాస్ (Advocate Srinivas) ను చేర్చింది సిట్. వీరిపై కేసు నమోదు చేస్తూ నిందితులుగా చేర్చారు. ఇక తాజాగా జగ్గుస్వామి సోదరునితో సహా ఐదుగురికి సిట్ నోటీసులు ఇచ్చింది. జగ్గుస్వామి సోదరుడు మణిపాల్, అలాగే ఆయన ఆశ్రమంలోని సిబ్బంది శరత్, ప్రశాంత్ మరికొంతమందికి 41A CRPC కింద సిట్ నోటీసులు ఇచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Telangana, Telangana News, Trs, TRS MLAs Poaching Case