#MissionPaani | ఆ కాలనీ మంచినీటి ఖర్చు.. ఏడాదికి రూ.కోటి

#MissionPaani | హైదరాబాద్ యాకుత్‌పురాలోని మెగా టౌన్ షిప్ వాసులు మంచినీటి కోసం ఏడాదికి రూ.కోటి వరకు ఖర్చు చేస్తున్నారు.

news18-telugu
Updated: July 4, 2019, 5:53 PM IST
#MissionPaani | ఆ కాలనీ మంచినీటి ఖర్చు.. ఏడాదికి రూ.కోటి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైద‌రాబాద్ లో నీటి క‌ష్టాలు న‌గ‌ర‌వాసుల‌కు చుక్క‌లు చూపిస్తున్నాయి. మండే ఎండ‌ల నుంచి విముక్తి పొందినా నీటి క‌ష్టాలు మాత్రం అలానే ఉన్నాయి. ప్ర‌స్తుతం న‌గ‌రంలో వ‌ర్ష‌పాతం కూడా న‌మోదు కాక‌పోవ‌డంతో నీటి తిప్ప‌లు తీవ్ర‌త‌రం అయ్యాయి. రుతుప‌వ‌నాలు వ‌చ్చినా, రోజూ మ‌బ్బులు ఉన్నా ఒక్క చినుకు కూడా ప‌డ‌క‌పోవ‌డం ఇప్పుడు హైద‌రాబాద్ వాసుల‌ను తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేస్తోంది. ఇప్ప‌టికే చాలా నివాస ప్రాంతాల్లో బోర్లు ఎండిపోయి వాట‌ర్ బోర్డు నీటిపై ప్రజలు ఆధార‌ప‌డుతున్నారు. దీంతో నీటికోసమే త‌మ జీతాల్లో చాలా మొత్త‌ంలో వెచ్చించాల్సి వ‌స్తోంది. య‌ర్కంత‌పురా లో ఉన్న మెగా టౌన్ షిప్ వాసులు మంచినీటి కోసం ఏడాదికి రూ.కోటి ఖర్చు చేస్తున్నారంటే నమ్మాల్సిందే. మొత్తం నాలుగు వేల కుటుంబాలు ఉన్న ఈ ప్రాంతంలో ఏడాది ఒక కోటి రూపాయిలు ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తోంద‌ంటున్నారు నివాసితులు. అంటే నెల‌కు ఒక్కో కుటుంబం రూ.3వేల నుంచి రూ.4వేల వరకు కేవ‌లం మంచి నీటి కోసమే ఖ‌ర్చు చేస్తోంది. అవి కూడా అంతంత‌ మాత్రంగానే వ‌స్తోన్నాయ‌ని, వాట‌ర్ బోర్డు అధికారుల‌కు ట్యాంక‌ర్ కోసం ఆర్డ‌ర్ ఇచ్చినా నాలుగు రోజుల‌కు కానీ రావ‌డం లేద‌ని వాపోతున్నారు.

హైదరాబాద్ యాకుత్‌పురాలోని మెగా టౌన్ షిప్


మ‌రోవైపు మ‌హాన‌గ‌రంలో వ‌ర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సిటీకి ప్ర‌ధాన నీటి స‌ర‌ఫ‌రా ప్రాజెక్ట్స్ అయిన‌ నాగార్జున్‌సాగర్‌, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు గణనీయంగా పడిపోతున్నాయి. ఇప్పటికే నాగార్జున్‌సాగర్‌లో నీటిమట్టం 511 అడుగులకు పడిపోయింది. దీనికి తోడు ఎల్లంపల్లి ప్రాజెక్టులో 142 అడుగులకు నీటి మట్టం దిగజారింది. మరో నాలుగు అడుగులు తగ్గితే వాటర్‌బోర్డు అత్యవసర పంపింగ్‌ మొదలు పెట్టి నగరానికి నీటిసరఫరా చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సాగర్‌లో 510 అడుగులకు జలాలు పడిపోతే అత్యవసర పంపింగ్‌ చేస్తే తప్ప.. హైదరాబాద్‌కు నీటి సరఫరా అయ్యే పరిస్థితి ఉండదు. నగరానికి ప్రతిరోజూ సరఫరా చేస్తున్న 460 మిలియన్‌ గ్యాలన్ల నీటిలో అత్యధిక వాటా నాగార్జున్‌సాగర్‌ నుంచి వస్తున్న కృష్ణాజలాలే. 277 మిలియన్‌ గ్యాలన్ల కృష్ణాజలాలను మూడు దశల్లో నగరానికి సరఫరా చేస్తున్నారు. గోదావరి జలాలను ఎల్లంపల్లి రిజర్వాయర్‌ నుంచి 164 మిలియన్‌ గ్యాలన్ల రోజూ సరఫరా చేస్తున్నారు. నగరానికి సరఫరా అయ్యే సాగర్‌, ఎల్లంపల్లి ప్రాజెక్టులలో నీటిసరఫరా పడిపోతుండడంతో వాటర్‌బోర్డు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

‘ఈ ఏడాది ఇంకా వ‌ర్షాలు ప‌డ‌డం లేదు. ప్ర‌స్తుతం ఉన్న బోర్లు అన్ని ఎండిపోయాయి. పోనీ ఇంకుడు గుంతులు ప్లాన్ చేయ‌డానికైనా వ‌ర్షాలు ప‌డాలి క‌దా. మా ప్రాంతంలో ఎప్పుడూ మంచి నీటి స‌మ‌స్య లేదు. కానీ గ‌త రెండు నెల‌ల నుంచి తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నాం. బోర్లు వేసినా అందులో నీరు ప‌డ‌డం లేదు. అందుకోసం బ‌య‌ట నుంచి నీటిని తెప్పించుకుంటున్నాం.’ న్యూస్ 18‌తో మారుతీన‌గ‌ర్ నివాస్ వాస్ దేవ్.
కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ పరిధిలో పద్మానగర్‌ ఫేజ్‌- 1,2, వాజ్‌పాయినగర్‌, దత్తాత్రేయనగర్‌, అంబేడ్కర్‌నగర్‌లతోపాటు పలు ప్రాంతాల్లో బోర్లు అన్ని ఇప్ప‌టికే ఎండిపోయాయి ఈ ప్రాంతంలో నివసిస్తోన్న వారు త‌మ జీతంలో నెల‌కు రూ.3 వేల నుంచి రూ.4 వేల వ‌ర‌కు మంచినీటి కోసం వెచ్చిస్తోన్నారంటే ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు. ఇదే ప‌రిస్థితి అన్ని ప్రాంతాల్లో కూడా క‌నిపిస్తోంది. వ‌రుణుడు క‌నిక‌రిస్తే త‌ప్ప న‌గ‌రానికి నీటి ఎద్ద‌డి తప్పేలా లేదు.

(ఎం.బాలకృష్ణ, సీనియర్ కరస్పాండెంట్, న్యూస్‌18)
First published: July 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు