సికింద్రాబాద్ పేరు వినగానే చాలా మందికి గుర్తుకొచ్చేది మహంకాళి ఆలయం. సికింద్రాబాద్ జనరల్ బజార్ లో కొలువైన శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి (Secunderabad unnaini Mahankali Temple) 207 ఏళ్ల సుదీర్గ చరిత్ర ఉంది. ఏటా ఆషాఢమాసంలో ఇక్కడ జరిగే బోనాల పండుగకు లక్షలాదిగా భక్తులు తరలివస్తుంటారు. కేసీఆర్ సర్కారు బోనాలు వేడుకను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నప్పటి నుంచి ఆలయానికి నిధులు కూడా పెరిగాయి.
మరో నెల రోజుల్లో (జూన్ 30 నుంచి) ఆషాఢమాసం మొదలుకానుండటంతో నగరంలో ముందస్తుగానే బోనాల పండుగ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, బోనాల వేళ.. చారిత్రక సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి మూల విరాట్టును మార్చేయబోతున్నారంటే కొద్ది రోజులుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. సదరు ప్రచారంపై, అలాగే మహంకాళి జాతర తేదీలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) క్లారిటీ ఇచ్చారు..
సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి విగ్రహం తప్పిస్తున్నారనే ప్రచారం అవాస్తవమని, అమ్మవారి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం నాడు సికింద్రాబాద్ లో పర్యటించిన మంత్రి.. బోనాలు ఏర్పాట్లపై మహంకాళి ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద అభివృద్ది పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి మూల విరాట్టు విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని మంత్రి తలసాని విమర్శించారు. ఆలయంలో మూల విరాట్ మార్పు ఆలోచన లేదని స్పష్టం చేశారు. అవాస్తవాలు ప్రచారం చేసేవారిని అమ్మవారే చూసుకుంటారని హెచ్చరించారు. కాగా, ఈ ఏడాది మహంకాళి బోనాల జాతరను జులై 17, 18 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. దీనికి సంబంధించి ప్రచార చిత్రాన్ని కూడా ఆయన విడుదల చేశారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండగ జంట నగరాల్లో వైభవంగా జరుగుతుండటం తెలిసిందే. లష్కర్ బోనాలుగా పిలిచే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ ఆలయానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి, బోనాలు సమర్పిస్తారు. ఉజ్జయని మహాంకాళి దేవాలయం 1815లో నిర్మితమైంది. సికింద్రాబాద్ పాత బోయిగూడ నివాసి సురటి అప్పయ్య ఆధ్వర్యంలో ఆలయానికి బీజం పడింది. బ్రిటిష్ ఆర్మీలో ఉద్యోగం చేసిన అప్పయ్య.. విధుల్లో భాగంగా 1813లో ఉజ్జయినిలో పనిచేస్తున్న సమయంలో అక్కడ కలరా ప్రబలి చాలా మంది చనిపోయారు. అయితే మహమ్మారి మరింతమందిని బలితీసుకోకుండా ఉజ్జయినిలోని అమ్మవారే కాపాడినట్లు భక్తులు నమ్ముతారు.
Mutual Transfers : టీచర్లు, ఉద్యోగులకు భారీ షాక్.. పరస్పర బదిలీలపై డెడ్లైన్ ఇవాళ సాయంత్రమే..
ఉజ్జయిని నుంచి క్షేమంగా ఇంటికి తిరిగొచ్చిన సురటి అప్పయ్య.. తన మిత్రులతోకలిసి 1815లో సికింద్రాబాద్ జనరల్ బజార్ లో ఉజ్జయిని పేరుమీదే అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. తొలుత కట్టె విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, 1864లో కట్టె విగ్రహాన్ని తీసివేసి ఇప్పుడు ఉన్న మహంకాళి, మాణిక్యాలదేవీ విగ్రహాలు ప్రతిష్టించారు. 207 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో మళ్లీ ఇప్పుడు మూల విరాట్టును మార్చబోతున్నట్లు వదంతులు రాగా, తెలంగాణ ప్రభుత్వం వాటిని కొట్టిపారేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bonalu, Secunderabad, Talasani Srinivas Yadav, Telangana, Telangana Bonalu