ర్యాంకుల పేరుతో తీవ్ర ఒత్తిడికి గురిచేస్తూ విద్యార్థుల ప్రాణాలను తీస్తున్న కాలేజీ యాజమాన్యాలపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహంగా ఉన్నట్లు కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రాంతానికి చెందిన సాత్విక్(16) నార్సింగ్‌లోని శ్రీచైతన్య కాలేజీ క్లాస్ రూమ్‌లోనే ఆత్మహత్య చేసుకోవడం..తన సూసైడ్‌కు కాలేజీ యాజమాన్యమే కారణమని నోట్ రాయడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన తర్వాత రాష్ట్ర విద్యాశాఖ వేగంగా అడుగులేస్తోంది. రేపు(సోమవారం) ప్రైవేట్ జూనియర్ కాలేజీ యాజమాన్యాలతో విద్యాశాఖ మంత్రి సబిత భేటీ కానున్నారు. మొత్తం 14 కాలేజీ యాజమాన్యాలతో భేటీ కానున్నారు సబిత. రేపు సాయంత్రం నాలుగు గంటలకు MCHRDలో సమావేశవుతారు. ఈ మీటింగ్‌కు శ్రీచైతన్య, నారాయణ తరఫు ప్రతినిధులు హాజరుకానున్నారని సమాచారం.
తీవ్ర ఒత్తిడి.. ఇవేం చదువులు:
ఏ ఇంటర్ కాలేజీలో చూసినా విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లోనే కాకుండా మిగతా కాలేజీల్లోనూ ఈ పరిస్థితి ఎప్పుడో వచ్చేసింది. దీంతో విద్యార్థుల మానసిక పరిస్థితి మరింత దయనీయంగా మారింది. నిత్యం చదువు... ఆపై మార్కులు... అంతిమంగా ర్యాంకులు. విద్యార్థులకు విజ్ఞానం అందించాల్సింది పోయి బట్టీ పట్టి చదివించడంతోపాటు మార్కులు, ర్యాంకులే ప్రధానం అన్న భావనను పెంపొందిస్తున్నాయి. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, మెడికల్ కాలేజీల్లో సీటు రావాలంటే ఉత్తమ ప్రతిభ కనబరచాలని నరనరాన ఇంకిపోయేలా కార్పొరేట్ కాలేజీల్లో నూరిపోస్తారు. మరోవైపు లక్షల రూపాయల ఫీజులు కట్టిన తల్లిదండ్రుల నుంచీ అదే స్థాయిలో ఒత్తిడి ఉంటుంది. ఎలాగైనా ఇంజినీర్ లేదా డాక్టర్ కావాల్సిందే అంటూ ఒత్తిడి పెంచుతారు. వారి మానసిక సంఘర్షణను ఎవరూ గుర్తించే పరిస్థితి ఉండదు. కాలేజీలో ఎవరికీ చెప్పుకోలేక... తల్లిదండ్రులకు చెప్పినా ప్రయోజనం లేదని భావించి చదువుల భారాన్ని, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక తనువు చాలిస్తున్నారు.
వేధింపులు భరించలేక సాత్విక్ సూసైడ్:
గత మంగళవారం రాత్రి పది గంటల సమయంలో తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు సాత్విక్. ఇది గమనించిన తోటి విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోలేదు. దీంతో కొన ఊపిరితో ఉన్న సాత్విక్‌ను తోటి విద్యార్థులు ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. అఖరికి ఒక వాహనం కూడా ఏర్పాటు చేయలేదు కాలేజీ యాజమాన్యం. సాత్విక్ స్నేహితుడే అతడిని తన భూజలపై మోసుకుంటూ.. రోడ్డుపై వచ్చిపోయే వారిని లిఫ్ట్ అడుగుతూ ఆస్పత్రికి తరించారు. అయితే వైద్యులు పరీక్షించి అప్పటికే సాత్విక్ మృతిచెందాడని నిర్ధారించారు. విద్యార్థి సాత్విక్ జేబులో పోలీసులు సూసైడ్ నోట్‌ను గుర్తించారు. ''అమ్మా, నాన్న.. నన్ను క్షమించండి.. మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. ప్రిన్సిపల్, ఇన్‌చార్జి, లెక్చరర్లు పెట్టే టార్చర్ వల్ల ఆత్మ హత్య చేసుకుం టున్నాను. కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్, నరేశ్ వేధింపులు తట్టుకోలేక పోయాను. ఈ ముగ్గురు హాస్టల్‌లో విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. వీరి వేధిం పులు తట్టుకోలేకనే నేనే ఆత్మహత్య చేసుకోవా లని నిర్ణయించుకున్నాను. నన్ను వేధించిన ఆ ముగ్గురిపై చర్యలు తీసుకోండి. అమ్మా, నాన్న లవ్ యూ, మిస్ యూ ఫ్రెండ్స్'' అని సూసైడ్ నోట్ రాశాడు సాత్విక్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sabita indra reddy