ట్యాంక్ బండ్ శివ, శవాల శివ (Tankbund Shiva).. ఈయన గురించి హైదరాబాద్ (Hyderabad)లో చాలా మందికి తెలుసు. ఎన్నో ఏళ్లుగా ట్యాంక్‌బండ్ వద్దే ఉంటున్నారు. వివిధ కారణాలతో హుస్సేన్ సాగర్(Hussain Sagar)లో పడి ఆత్మహత్యాయత్నం చేసే వారిలో.. ఇప్పటి వరకు ఎంతో మంది ప్రాణాలను ఆయన కాపాడారు. అప్పటికే చనిపోయిన వారి శవాలను తన చేతులతో బయటకు తీశారు. కంపు కొట్టే హుస్సేన్ సాగర్ జలాల్లో ఈతకొడుతూ.. నిస్వార్థంగా సమజానికి సేవ చేస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న శివ.. భార్యాపిల్లలతో ట్యాంక్ బండ్ మీద చిన్న గుడిసె వేసుకొని జీవించేవాడు. ఆయన పేదరికంపై పలు పత్రికలు, ఛానెళ్లు ఆయన్ను ఇంటర్వ్యూ చేశాయి. ఆయన కష్టాలను, జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి తెలిసి... మంత్రి కేటీఆర్ (Minister KTR) చలించిపోయారు. అనంతరం నెక్లెస్ రోడ్డులో డబుల్ బెడ్ రూమ్ ఇంటిని ఇప్పించారు. ఈ మధ్యే శివ కుటుంబం కొత్త ఇంటికి వెళ్లింది.
ప్రస్తుతం శివ తన ఫ్యామిలీతో కొత్త ఇంట్లో ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం ట్యాంక్ బండ్ శివ జీవితం ఎలా ఉంది..? ఏం చేస్తున్నారు? అని ఓ యూట్యూబ్ ఛానెల్ ఆయన ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో తన మనసులోని కోరికను బయటపెట్టారు ట్యాంక్ బండ్ శివ. కేటీఆర్ ఎంతో మంచివారని.. తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు. ఆయన చేతుల మీదుగా గృహప్రవేశం జరగాలని కోరుకున్నామని..కానీ అది జరగనందుకు కొంత బాధగా ఉందని పేర్కొన్నారు. అన్నం పెట్టిన దాత.. ఒక్కసారైన తన ఇంటి గడప తొక్కాలని అభిప్రాయపడ్డారు. ఈ వీడియోను తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొనతం దిలీప్ ట్విటర్లో పోస్ట్ చేసి.. కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు.
ఆ వీడియోపై మంత్రి కేటీఆర్ స్పందించారు. త్వరలోనే ట్యాంక్ బండ్ శివ ఇంటికి వెళ్తానని తెలిపారు.
Will visit Shiva’s home soon ???? https://t.co/hd6gK3rwhc
— KTR (@KTRTRS) September 15, 2022
ఈ విషయం తెలిసిన ట్యాంక్ శివ ఆనందానికి అవధులు లేవు. మంత్రి కేటీఆర్ తన కోరికను మన్నించి.. ఇంటికి వస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తన కల నెరవేరిందని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.