కంటైన్మెంట్ జోన్లపై 12 సూచనలు చేసిన కేటీఆర్

సమీక్షలో పాల్గొన్న మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్

ఇటీవల జ్వరం, గొంతు నొప్పి నివారణకు మెడికల్ షాపుల నుండి మందులు కొనుగోలు చేసిన వారి వివరాలను తెలుసుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు.

 • Share this:
  కంటైన్మెంట్ జోన్లలో వున్న ప్రజలను ఇళ్లకే పరిమితం చేయాలని మున్సిపల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లకు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పాలు, కూరగాయలు, నిత్యావసరాలు, మెడిసిన్స్‌ను ఇళ్ల వద్దకే సరఫరా చేయాలని సూచించారు. ప్రభుత్వం నియమించిన వాలెంటీర్లు, సిబ్బందిచే మాత్రమే నిత్యవసరాలను డోర్ డెలవరీ చేయించాలని ఆదేశించారు. వీలైతే వాలెంటీర్లు, సిబ్బందికి ప్రత్యేక దుస్తులు అందజేయాలని తెలిపారు. మంత్రులు ఈటెల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్ లతో కలిసి జిహెచ్ఎంసి కార్యాలయం నుండి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కంటైన్మెంట్ జోన్లలోకి దాతలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని స్పష్టం చేశారు.

  కంటైన్మెంట్ జోన్‌లోని కుటుంబాల సెల్ నెంబర్లతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి, అవసరాలను తెలుసుకోవాలన్నారు. కంటైన్మెంట్ నిబంధనలు అతిక్రమించిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం కంటైన్మెంట్ జోన్లను తొలగించనున్నట్లు తెలిపారు. ప్రజల సహకారం పైనే కంటైన్మెంట్ జోన్ల తొలగింపు ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఆ విధంగా జిహెచ్ఎంసి పరిధిలో 15 కంటైన్మెంట్ జోన్లను తొలగించినట్లు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. కొత్త కేసులు నమోదు కాకుండా కంటైన్మెంట్ నిబంధనలపై అవగాహన కల్పించి, ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు.

  కంటైన్మెంట్ జోన్లను మానిటరింగ్ చేసేందుకు చేపట్టాల్సిన 12 ప్రధాన అంశాల గురించి అధికారులకు మంత్రి కేటీఆర్ వివరించారు. సరైన విధంగా బారీకేడింగ్ చేయడం, సంబంధిత శాఖల సిబ్బందిని నియమించడం, ఫీవర్ సర్వే కోసం పారమెడికల్ సిబ్బందిని నియమించడం, శానిటేషన్, స్ప్రేయింగ్ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడం, నిత్యవసర వస్తువులను ఇంటింటికి అందించుటకై ఏర్పాట్లు చేయడం, పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా కంటైన్మెంట్ నిబంధనలు పాటించాలని కోరుతూ, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల గురించి ప్రచారం చేయడం వంటిని చేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

  దీంతో పాటు ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేయడం, ప్రతిరోజు మెడికల్ టీమ్, అధికారులు ప్రతి ఇంటిని సందర్శించడం, సీనియర్ అధికారులు కంటైన్మెంట్ ఏరియాని తనిఖీ చేయడం, కంటైన్మెంట్ జోన్లలోని ప్రజలను ఇంటికే పరిమితం చేయడంతో పాటు వారి కదలికలను నియంత్రించడం, అత్యవసర వైద్య సేవలకై అంబులెన్స్‌ను సిద్దంగా ఉంచడం, బియ్యాన్ని పంపిణీ చేయడం వంటి వాటిని కచ్చితంగా చేపట్టాలని కేటీఆర్ ఆదేశించారు.

  ఇటీవల జ్వరం, గొంతు నొప్పి నివారణకు మెడికల్ షాపుల నుండి మందులు కొనుగోలు చేసిన వారి వివరాలను తెలుసుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. అందులో భాగంగా డ్రగ్ ఇన్ స్పెక్టర్ల సహకారంతో ఆయా మున్సిపాలిటీలలోని ఫార్మసి అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేకంగా సమీక్షించాలని తెలిపారు. జ్వరం, గొంతు నొప్పి మందులను కొనుగోలు చేసిన వారి వివరాలను తప్పనిసరిగా అందజేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని తెలిపారు.

  Published by:Kishore Akkaladevi
  First published: