రాష్ట్రంలో కరోనా వైరస్ మరోసారి వేగంగా విస్తరిస్తున్న వేళ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్, రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో యుద్ధ ప్రాతిపదికన సోడియం హైపోక్లోరైట్ క్రిమిసంహారక ద్రావణం పిచికారీ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్‌లతో మంత్రి కేటీఆర్ శనివారం ఫోన్‌లో మాట్లాడారు. కరోనా తీవ్రత దృష్ట్యా అన్ని పురపాలికల్లో వెంటనే శానిటేషన్ పనులు చేపట్టాలని, హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో అందుబాటులో ఉన్న వాహనాలతోపాటుగా.. అవసరమైన చోట వాహనాలు అద్దెకు తీసుకుని సోడియం హైపోక్లోరేట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలని చెప్పారు. ఇందుకోసం పట్టణ ప్రగతి నిధులు వినియోగించాలని సూచించారు.
కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున శాఖ పరిధిలోని ఎంటమాలజిస్టులంతా అప్రమత్తంగా ఉండాలని, ఉద్యోగులంతా విధిగా విధులకు హాజరు కావాలన్నారు. మున్సిపల్ శాఖ ఉద్యోగుల సెలవులు రద్దు చేయాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. అలాగే పాటు కోవిడ్ నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకునేలా ప్రజల్లో అవగాహన కూడా కల్పించాలని, ప్రజలందరూ ఎల్లవేళలా మాస్క్ ధరించేలా చూడాలని మంత్రి కేటీఆర్ అధికారులను కోరారు. మున్సిపల్ శాఖ సిబ్బంది కరోనాపై పోరులో ముందువరుసలో ఉన్నందున శాఖ ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ చేయించాలని మంత్రి కేటీఆర్ ఉన్నతాధికారులకు సూచించారు.
మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, కమీషనర్ ఎండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ సత్యనారాయణ, జీ.హెచ్.ఎం.సీ కమీషనర్ లోకేశ్ కుమార్ లతో మంత్రి @KTRTRS ఇవ్వాళ ఫోన్‌లో మాట్లాడారు.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) April 17, 2021
ప్రస్తుతం మున్సిపల్ శాఖ వద్ద ఉన్న వాహనాలతో పాటు అవసరమైన చోట ప్రత్యేకంగా వాహనాలను అద్దెకు తీసుకుని సోడియం హైపోక్లోరేట్ ద్రావకం పిచికారీ చేయాలని మంత్రి చెప్పారు. పై పనుల కోసం పట్టణ ప్రగతి నిధులు వినియోగించాలని మంత్రి @KTRTRS సూచించారు.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) April 17, 2021
జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు రేపటివరకు 100 శాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తవుతుందని, మిగతా పురపాలికల్లో కూడా ఇంకో 2-3 రోజుల్లో ఉద్యోగులు అందరికీ వ్యాక్సినేషన్ చేయిస్తామని అధికారులు మంత్రికి తెలియజేశారు.