లాక్‌డౌన్ వేళ.. ఆ పనిలో తెలంగాణకు మంచి గుర్తింపు వచ్చిందన్న కేటీఆర్

ప్రతీకాత్మక చిత్రం

జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న లింక్ రోడ్ల వెడల్పు 120 అడుగులు ఉండాలని చెప్పారు. భవిష్యత్తులో ఈ లింక్ రోడ్ల వలన ఆయా ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు.

  • Share this:
    దేశంలో లాక్‌డౌన్‌ను చక్కగా వినియోగించుకున్న రాష్టంగా తెలంగాణకు మంచి గుర్తింపు లభించిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం నగరంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేసేందుకు అధికారులు మరింత వేగంగా ముందుకు పోవాలని మంత్రి సూచించారు. ఇది వర్కింగ్ సీజన్... ఒక నెలపాటు పనులు చేయవచ్చని, జూన్ నుంచి వర్షాలు వస్తాయని పేర్కొన్నారు. ఆ మేరకు శనివారం బుద్దభవన్‌లో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్‌లతో కలిసి హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కింద చేపట్టిన పనుల ప్రగతిని మంత్రి కేటీఆర్ సమీక్షించారు. దేశంలో వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. మే నెలలో కొన్ని పనులను ప్రారంభించుకుందామని, అందుకనుగుణంగా పనులకు తుది మెరుగులు దిద్దాలని అధికారులకు సూచించారు. వివిధ ప్యాకేజీల కింద చేపట్టిన లింకు రోడ్లలో అక్కడక్కడ అటంకంగా ఉన్న భూముల సేకరణపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అధికారులకు సూచించారు.

    అదే సమయంలో నిర్వాసితులయ్యే పేదలు, కూలీల పట్ల మానవీయకోణంలో వ్యవహరించాలన్నారు. అటువంటి నిర్వాసితులకు ప్రభుత్వపరంగా పునరావాసం కల్పించాలని చెప్పారు. జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న లింక్ రోడ్ల వెడల్పు 120 అడుగులు ఉండాలని చెప్పారు. భవిష్యత్తులో ఈ లింక్ రోడ్ల వలన ఆయా ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. భవిష్యత్ అవసరాలు, పెరిగే ట్రాఫిక్ రద్దీని అంచనా వేసి పనులు చేపట్టాలని వివరించారు. హైదరాబాద్ నగర మాస్టర్ ప్లాన్‌ను అప్‌డేట్ చేయనున్నట్లు ప్రకటించారు. అందుకనుగుణంగా రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేయాలని తెలిపారు.

    అలాగే నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్ పాసులు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలతో పాటు కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలకు కూడా అవసరమైన భూ సేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులు, భూసేకరణకు నిధులు కొరత లేదని పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో మాజీ ఎంపీ, కాంట్రాక్టింగ్ ఏజెన్సీ ఎండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈవిడిఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, సిసిపి దేవేందర్ రెడ్డి, ఈఎన్‌సి శ్రీధర్, చీఫ్ ఇంజనీర్ జియాఉద్దీన్, ఎస్‌ఈ‌లు, ఈఈ‌లు, భూసేకరణ విభాగం అధికారులు పాల్గొన్నారు.
    Published by:Narsimha Badhini
    First published: