ధాన్యం కొనుగోలు (Paddy buying) విషయంలో కేంద్రం (Central government ), తెలంగాణ (Telangana) మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. బాయిల్డ్ రైస్ కొంటామని కేంద్రం.. లేదు ధాన్యమే కొనాలని రాష్ట్రం డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో వడ్లు పొలాల్లోనే ఉండిపోతున్నాయి. దీంతో ఆ ధాన్యాన్ని బీజేపీ కార్యకర్తల ముందు పోయాలని పిలుపునిచ్చారు . అయితే ఇపుడు తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై (paddy procurement) టీఆర్ఎస్ మరో అడుగు ముందుకేసింది. ఇక ఎల్లుండి మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపడతామని.. రైతుల్ని అవమానించినందుకు నిరసనగా ఆందోళన నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్ (Minister KTR) స్పష్టంచేశారు . ఈ నెల 6న జాతీయ రహదార్లపై రాస్తారోకో చేస్తామని కేటీఆర్ తెలిపారు.
విజయవాడ, ముంబై, బెంగళూరు హైవేలపై రాస్తారోకోలు నిర్వహిస్తామని కేటీఆర్ అన్నారు. ఈ నెల 7న అన్ని జిల్లా కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపడతామని మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 8న ప్రతీ రైతు ఇంటిపై నల్ల జెండాలు ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో కేంద్రం దిష్టిబొమ్మను తగులబెట్టాలని.. ఈ నెల 11న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు చలో ఢిల్లీ కార్యక్రమానికి హాజరవుతారని కేటీఆర్ వెల్లడించారు.
ఈ నెల 11న ఢిల్లీలో టీఆర్ఎస్ ముఖ్య నేతలంతా నిరసన తెలియజేస్తారని చెప్పారు. కేంద్రం వైఖరిని ఢిల్లీలో ఎండగడతామని కేటీఆర్ హెచ్చరించారు. వరి కొనుగోళ్లపై కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేశామని చెప్పారు. పీయూష్ గోయల్‌ను (piyush goyal) ఎన్నోసార్లు కలిశామని కేటీఆర్ తెలిపారు. ప్రతి ఏటా ధాన్యం కొనుగోళ్లు చేసే బాధ్యత కేంద్రానిదేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ వరి రైతుల్ని కేంద్రం ఇబ్బంది పెడుతోందని కేటీఆర్ ఆరోపించారు. రా రైస్, పారాబాయిల్డ్ రైస్ అంటూ నిబంధనల పేరుతో ఇబ్బంది పెడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ బీజేపీ కరెక్టా, ఇక్కడ మాట్లాడుతోన్న సిల్లీ బీజేపీ కరెక్టా అని కేటీఆర్ ప్రశ్నించారు. స్వయంగా కేసీఆర్ ధాన్యం కొనుగోళ్లపై ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశారని మంత్రి గుర్తుచేశారు.
కేంద్రంలో తలా తోకా లేని ప్రభుత్వం వుందని.. కార్పోరేట్లకు వత్తాసు పలుకుతుందని కేటీఆర్ ఆరోపించారు. రైతులపై ఏమాత్రం ప్రేమలేని ప్రభుత్వమంటూ దుయ్యబట్టారు. ఉప్పుడు బియ్యం కొనేది లేదని కేంద్రం కరాఖండిగా చెప్పిందని కేటీఆర్ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని తామే చెప్పామని ఆయన పేర్కొన్నారు. కానీ వేసవిలో వరి వేయాలని బండి సంజయ్ చెప్పారంటూ ఆయన ధ్వజమెత్తారు. మీరు వరి వేయండి మేం కొంటామని బండి సంజయ్ చెప్పారని మంత్రి దుయ్యబట్టారు.
రాష్ట్ర రైతుల్ని బీజేపీ అయోమయానికి గురిచేస్తోందని ముందు నుంచీ చెబుతున్నామని.. కేటీఆర్ అన్నారు. వీళ్లు కొనరు.. కొనరు అని మొత్తుకున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని ఒప్పిస్తామని బండి సంజయ్ మాట్లాడారని కేటీఆర్ గుర్తుచేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా యాసంగి ధాన్యాన్ని కేంద్రమే కొంటుందని చెప్పారని మంత్రి వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.