తెలంగాణ (Telangana)రాష్ట్ర వ్యాప్తంగా భారీ వరదలు సంభవించాయి. వారం రోజుల పాటు రాష్ట్రాన్ని కమ్మేసిన ముసురు, భారీ వర్షాలతో రాష్ట్రంలో అపార నష్టం సంభవించింది. శుక్రవారం(Friday) ఉదయం నుంచి వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఇప్పుడిప్పుడే వరదల నుంచి తేరుకుంటున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో సంభవించిన వరదలపై ప్రభుత్వం సమీక్షలు చేపట్టింది. ఈక్రమంలో జిల్లాల్లో వరద నష్టంపై నివేదికలు సిద్ధం చేయాలనీ ప్రభుత్వం అధికారులను, మంత్రులను ఆదేశించింది. ఈక్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran Reddy)శనివారం ఆసిఫాబాద్- కుమ్రం భీం (Komurambhim Asifabad)జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. భారీ వర్షాలు, వరదలు కారణంగా జిల్లాలో జరిగిన నష్టాలపై మండలాల వారీగా సమగ్ర నివేదికలను సిద్ధం చేయాలని మంత్రి జిల్లా యంత్రాంగాన్ని, అధికారులను ఆదేశించారు.
వరద నష్టంపై అంచనా..
భారీ వర్షాల వల్ల జిల్లాలో జరగిన నష్టం, సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి... అన్ని శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వరద నేపథ్యంలో జిల్లా యంత్రాంగం చేపట్టిన సహాయక చర్యలు, ఆస్తి నష్టం, పంట నష్టం, బాధితులకు అందుతున్న సహాయం తదితర అంశాలపై మంత్రి అధికారులతో చర్చించారు. ఈసందర్భంగా ఆసిఫాబాద్ జిల్లాలో వరద నష్టంపై అధికారులు మంత్రికి వివరించారు. ఎడతెరపి లేని వర్షాలకు పంటలు బాగా దెబ్బతిన్నాయని, మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో పంట నష్టంపై సమగ్ర సర్వే చేయాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. రైతు వారీగా పంట నష్టం వివరాలను సర్వేలో నమోదు చేయాలన్నారు.
సహాయకచర్యలపై మంత్రి సమీక్ష..
వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. స్థానిక అధికారులు, నేతలు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ కోవాల క్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు కోనేరు కోణప్ప, ఆత్రం సక్కు, కలెక్టర్ రాహుల్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Asifabad, Local News, Minister indrakaran reddy, Telangana rains