Home /News /telangana /

MINISTER HARISHRAO DIALS CM KCR OVER FARMERS ISSUE AND REQUEST HIM TO RELEASE WATER FROM KONDAPOCHAMMA SAGAR SK

రైతుల కన్నీళ్లు.. సీఎం కేసీఆర్‌కు మంత్రి హరీష్ రావు ఫోన్.. చిటికెలో పరిష్కారం

కేసీఆర్, హరీశ్ రావు (ఫైల్ ఫోటో)

కేసీఆర్, హరీశ్ రావు (ఫైల్ ఫోటో)

మల్లన్న సాగర్ నుంచి కొండ పోచమ్మ జలాశయానికి నీటిని తీసుకెళ్లే కాల్వకు గండిపెట్టి.. కూడవల్లి వాగులోకి వదిలితే, సమస్య పరిష్కారమవుతుందని గుర్తించారు. ఆ నీటితో తమ కష్టాలు తీరుతాయని రైతులు మంత్రి హరీష్‌ రావుకు చెప్పారు.

    ఎండాకాలం ప్రారంభమయింది. సాగు నీటికి కొన్ని చోట్ల కష్టాలు మొదలయ్యాయి. నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్‌లో చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే వారంతా శనివారం మంత్రి హరీష్ రావును కలిశారు. గజ్వేల్ పర్యటనలో ఉన్న మంత్రిని కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. పంటలు ఎండిపోతున్నాయని మీరే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం నీటిని విడుదల చేస్తే పంటల బతుకుతాయని చెప్పారు. రైతుల విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన హరీష్ రావు క్షేత్రస్థాయిలో పర్యటించారు. కోడకండ్ల వద్దకు వెళ్లి కెనాల్‌ను పరిశీలించారు. మల్లన్న సాగర్ నుంచి కొండ పోచమ్మ జలాశయానికి నీటిని తీసుకెళ్లే కాల్వకు గండిపెట్టి.. కూడవల్లి వాగులోకి వదిలితే, సమస్య పరిష్కారమవుతుందని గుర్తించారు. ఆ నీటితో తమ కష్టాలు తీరుతాయని రైతులు మంత్రి హరీష్‌ రావుకు చెప్పారు.


    ఈ విషయాన్ని మంత్రి హరీశ్‌రావు స్వయంగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి నుంచే ఫోన్ చేసి సీఎంకు వివరించారు. ఇలా చేస్తే సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. మంత్రి హరీష్ రావు విజ్ఞప్తిపై సానుకూలంగా సీఎం కేసీఆర్‌ వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. రైతులకు సాగునీరు అందించాలని అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ జలాశయానికి వెళ్లే కాలువకు గండిపెడుతున్నారు. అక్కడి నుంచి కూడవల్లి వాగు ద్వారా నీరు అందిస్తారు. తద్వారా గజ్వేల్‌, దుబ్బాక నియోజకవర్గాల్లోని వేలాది ఎకరాల్లో పంటకు సాగునీరు అందనుంది. తమ సమస్యకు తక్షణ పరిష్కారం చూపిన మంత్రి హరీశ్‌రావు, సీఎం కేసీఆర్‌కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే తమ కష్టాలు తీరనున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: CM KCR, Farmers, Harish Rao, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు