ప్రభుత్వ ఆస్పత్రుల ముఖచిత్రాన్నే మార్చేస్తున్న తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ (Telangana Health Dept).. తాజాగా మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 టిఫా స్కానింగ్ మిషన్లను ఏర్పాటు చేసింది. వాటిని ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు (Harish Rao) ప్రారంభించారు. పెట్ల బురుజు ఆసుపత్రి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్నింటినీ ఒకేసారి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీతో పాటు హెల్త్ సెక్రటరీ రిజ్వీ, కుటుంబ ఆరోగ్య సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, టి వి వి పి కమిషనర్ అజయ్ కుమార్, పెట్ల బురుజు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాలతి, మెటర్నల్ హెల్త్ జెడి డాక్టర్ పద్మజ, ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ శశికళ తదితరులు పాల్గొన్నారు.
'' ఏకకాలంలో 56 టిఫాలు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. మాతా శిశు సంరక్షణలో విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టిన కేసీఆర్ కిట్ పథకాన్ని పెట్ల బురుజు మెటర్నిటీ ఆసుపత్రి వేదికగా జూన్ 2, 2017న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఇప్పుడు ఇదే వేదికగా మరొక అద్బుతమైన కార్యక్రమాన్ని జరుపుకోవడం గొప్పగా, గర్వంగా ఉంది. వైద్య సిబ్బంది కృషితో రెండు నెలల్లోనే ఆసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిత్య పర్యవేక్షణ, గర్భిణులకు ఉచిత స్కానింగ్ సేవలు అందించాలని లక్ష్యంతో పని చేశారు. పుట్టబోయే పిల్లల్లో లోపాలను గర్బంలో ఉండగానే గుర్తించేందుకు ‘టిఫా’ (టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్ స్కాన్) దోహదం చేస్తుంది. రూ. 20 కోట్ల రూపాయలతో 56 టిఫా మిషన్లు సమకూర్చుకున్నాం. దీని కోసం ఇప్పటికే రేడియాలజిస్టులు, గైనకాలజిస్టులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాము. ప్రైవేటులో టిఫా స్కాన్‌కు రూ. 2000-3000 వసూలు చేస్తున్నారు. ఇప్పటి నుంచి ఈ ఆర్థిక భారం పేదలకు పూర్తిగా తప్పుతుంది. ప్రతి నెల సగటున 20 వేల మంది గర్బిణులు ఈ సేవలు ఉచితంగా వినియోగించుకునే వెసులుబాటు కలుగుతుంది.'' అని మంత్రి హరీష్ రావు అన్నారు.
Telangana: రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. డిసెంబరులో డబ్బులు
గర్బిణులకు18 నుంచి 22 వారాల మధ్య టిఫా స్కాన్ చేయాల్సి ఉంటుంది. నిపుణులైన రేడియాలజిస్టులు లేదా గైనకాలజిస్టులు మాత్రమే ఈ స్కాన్ చేస్తారు. గర్బంలోని శిశువు తల నుంచి కాలిబొటన వేలు వరకు ప్రతి అవయవాన్ని ఇందులో భాగంగా స్కాన్ చేస్తారు. ఇందుకు కనీసం 20-30 నిమిషాలు పడుతుంది. శిశువు గర్బంలో ఏ పొజిషన్లో ఉన్నది, జరాయువు లేదా మావి (ప్లాసెంటా) ఏ ప్రాంతంలో ఉన్నది, ఉమ్మ నీరు స్థితి వంటి వాటిని గుర్తిస్తారు. అంతర్జాతీయ నివేదికలు, వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, 7శాతం శిశువుల్లో లోపాలు ఉండే అవకాశం ఉంది. అంటే పుట్టే ప్రతి 100 మందిలో ఏడుగురు ఏదో ఒక ఆరోగ్య సమస్యతో ఉండే అవకాశం ఉంటుంది. మేనరిక వివాహాలు, జన్యు సంబంధ లోపాలు, ఆలస్యంగా గర్బం దాల్చడం, కొందరికి గర్బం దాల్చినప్పటి నుంచే శారీరక, మానసిక సమస్యలు ఉత్పన్నం కావడం, పోషకాహార లోపం.. ఇలాంటి కారణాల వల్ల శిశువుల్లో లోపాలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇలాంటి లోపాలను టిఫా స్కాన్‌తో ముందుగా గుర్తించే అవకాశం ఉంటుంది. గుండె, ఊపిరితిత్తులు వంటి అంతర్గత అవయవాలు, కంటి రెప్పలు, పెదవులు, వేళ్లు, చెవులు, కండ్లు, ముక్కు.. ఇలా ప్రతి అవయవాన్ని 3డి, 4డి ఇమేజింగ్ రూపంలో స్కాన్ చేస్తుంది. గ్రహణం మొర్రి, గుండెలో రంధ్రం, కాళ్లు, చేతులు వంకరగా ఉండటం, వెన్నుపూస వంటి అవయవాల్లో ఏవైనా లోపాలు తెలుస్తుంది.
కొన్ని సందర్బాల్లో పిల్లలు పుట్టగానే సర్జరీ చేయాల్సి రావొచ్చు. ముందే గుర్తించగలిగితే డెలివరీ సమయంలో పీడియాట్రిక్ సర్జన్లను అందుబాటులో ఉంచి ప్రాణాలు రక్షించవచ్చు. జరాయువు, బొడ్డుతాడు ఉన్న స్థితిని బట్టి సాధారణ ప్రసవం చేయడం సాధ్యమా లేదా సిజేరియన్ చేయాలా అనేది నిర్ణయించవచ్చు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో టిఫా స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేయడంతో గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రైవేట్ ల్యాబ్స్‌లో టెస్ట్ చేయించాల్సిన అవసరం లేకపోవడంతో.. వారికి డబ్బులు కూడా ఆదా అవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Harish Rao, Harishrao, Telangana