తెలంగాణలో రాజకీయ వేడి రగులుతోంది. బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు అసలు తగ్గడంలేదు.. కౌంటర్‌కు కౌంటర్ ఇచ్చి పడేస్తున్నారు. ముఖ్యంగా గవర్నర్ తమిళిసై సెంటర్‌గా రాజకీయ రచ్చ అంతకంతకూ ముదురుతోంది. ప్రగతిభవన్ వర్సెస్ రాజ్‌భవన్ పొగ ఇప్పట్లో ఆరిపోయే పరిస్థితి ఏ మాత్రం కనిపించడలేదు. ఇద్దరూ ఢీ అంటే ఢీ అంటున్నారు. కేసీఆర్ టార్గెట్‌గా తమిళిసై(tamilisai) విమర్శలు చేస్తుండడం.. ఆ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ నేతలు రివర్స్ అటాక్ చేయడం.. మళ్లీ తమిళిసై వాటికి కౌంటర్ ఇవ్వడం సర్వసాధరణమైపోయింది. తాజాగా మంత్రి హరీశ్‌రావు(harish rao) సీన్‌లోకి దిగారు. తమిళిసైతో పాటు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్(nirmala sitharaman) లక్ష్యంగా ట్వీట్ల వర్షం కురిపించారు.
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష:
వైద్య కళాశాలల కేటాయింపుల విషయంలో కేంద్రంపై మాటల దాడి పెంచింది అధికార బీఆర్‌ఎస్. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని హరీశ్‌రావు ఆరోపించారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విన్నవించినా తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా కేటాయించలేదని విమర్శలు గుప్పించారు. అప్పట్లో సానుకూలంగా స్పందించిన కేంద్రం.. ఇప్పుడు మాత్రం అసలు తమకేమీ పట్టనట్లు వ్యవహారిస్తుందని ఫైర్ అయ్యారు. దేశంలోని ప్రతి లక్ష మందికి 19 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని .. జిల్లాకో వైద్య కళాశాల లక్ష్యంతో రాష్ట్ర నిధులతో సీఎం కేసీఆర్ 12 కాలేజీలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అయితే కేంద్రం మాత్రం తెలంగాణపై వివక్ష చూపిస్తుందంటూ మండిపడ్డారు.
Why no one voices about injustice meted to TS? Why not find fault with Centre in the interest of Telangana? It would be a great help to people of TS, if Raj Bhavan reorients its focus & pushes GoI for Tribal University and Rail Coach factory, as promised in APRA2014 5/5
— Harish Rao Thanneeru (@BRSHarish) March 5, 2023
తమిళిసై నిర్మలమ్మకు హరీశ్‌రావు కౌంటర్:
వైద్య కళాశాలల కేటాయింపు అంశంపై గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యలపై హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. కేంద్రం, గవర్నర్ అనవసరంగా విమర్శలు చేసేందుకు బదులుగా ఒకే రోజు 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన తెలంగాణను అభినందించాలన్నారు. మెడికల్ కాలేజీల కేటాయింపులో కేంద్ర మంత్రులు వ్యాఖ్యలకు అసలు పొంతనే లేదన్నారు హరీశ్‌రావు. ఒకరు తెలంగాణ మెడికల్ కాలేజీలు కావాలని కోరలేదంటే... మరొకరు ప్రైవేటు మెడికల్ కాలేజీలున్న ఖమ్మం , కరీంనగర్‌లో కొత్త కాలేజీల కోసం దరఖాస్తు చేసుకోవటం వల్లే కొత్తవి మంజూరు చేయలేదంటున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. బీబీనగర్ ఎయిమ్స్‌కి నిధుల కొరత ఉందన్న హరీశ్‌రావు.. దేశవ్యాప్తంగా ఎయిమ్స్ వృద్ధి కోసం రూ.1,365 కోట్లు మంజూరు చేస్తే అందులో తెలంగాణకు మాత్రం కేవలం రూ.156 కోట్లే కేటాయించటానికి గల కారణమేంటో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ గవర్నర్ తన పంథాను మార్చుకొవాలని చురకలంటించారు హరీశ్‌రావు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.