మేడమ్‌కు కోపం వచ్చింది. రాష్ట్రంలో అమలయ్యే సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులు పంపుతుంటే కనీసం ప్రధాని ఫోటో కూడా పెట్టకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala sitharaman). ఉన్నట్టుండి తెలంగాణ(Telangana) పర్యటనకు వచ్చిన సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్(Central finance minister)ముందుగా కామారెడ్డి జిల్లాకు వెళ్లి అక్కడి అధికారులను కడిగిపారేశారు. పేదలకు అందించే రేషన్ బియ్యం(Ration rice)లో కేంద్ర ప్రభుత్వం సాయం పొందుతూ ప్రధాని ఫ్లెక్సీ(PM Flexi)పెట్టకపోవడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. ఇకపై అలా జరగడానికి వీల్లేదని .. ప్రతి రేషన్ షాపులో మోదీ ఫోటో ఉండేలా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదేనంటూ ఆదేశాలు జారీ చేశారు.దీనికి రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ హరీష్‌రావు ఏమని జవాబిచ్చారో తెలుసా.
ప్రధాని ఫోటో ఏదమ్మా..
కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. బీర్కూరు మండల కేంద్రానికి చేరుకున్న కేంద్ర మంత్రి మండల కేంద్రంలోని చౌక ధరల దుకాణంలో పేదలకు ఉచితంగా అందజేస్తున్న బియ్యాన్ని తనిఖీ చేశారు. లబ్దిదారులతో మాట్లాడారు. రేషన్ సరుకుల పంపిణీ తీరును లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. అటుపై రేషన్ షాపుల యందు పూర్తిగా ఉచితంగా అందిస్తున్న ప్రధానమంత్రి మోదీ ఫ్లెక్సీని ఎందుకు పెట్టలేదని రేషన్ డీలర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి. పేదలకిచ్చే రేషన్ బియ్యంపై కిలోకు 35 రూపాయల ఖర్చవుతుంటే కేంద్రం 29 రూపాయలు భరిస్తోందన్నారు నిర్మలా సీతారామన్.
ఏసారి నేనొచ్చేసరికే ఉండాలి..
పేద ప్రజల కోసం చేసే కార్యక్రమంలో మోదీ ఫ్లెక్సీ లేకపోవడంపై కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్. వి. పాటిల్‌ను కేంద్రమంత్రి నిలదీశారు. అయితే ఫ్లెక్సీ పెట్టడానికి అధికారులు వస్తే.. వాళ్లపై టీఆర్ఎస్ కార్యకర్తలు గంతులేయడం, ఫ్లెక్సీలు చింపేయడం చేస్తున్నారని చెప్పడంపై ఆమె మండిపడ్డారు. ఇకపై అలా జరగడానికి వీల్లేదని ప్రతి రేషన్ షాపులో ప్రధాని మోదీ ఫ్లెక్సీ ఉండాలని వాటిని చూసే బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈసారి తాను పర్యటనకు వచ్చేలోపు అన్నీ రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ ఉండాలని కలెక్టర్‌ను ఆదేశించారు.ఒక్క కామారెడ్డి జిల్లాలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి రేషన్ షాపుల్లో ప్రధాని ఫ్లెక్సీలు ఉండేలా చర్యలు తీసుకుంటామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రేషన్ డీలర్లు ప్రధాని మోదీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయకపోతే ఈసారి తానే వచ్చి స్వయంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తానన్నారు.
మేడమ్‌కి హరీష్ కౌంటర్ ..
కేంద్రమంత్రి మోదీ ఫ్లెక్సీలపై హుకూం జారీ చేయడాన్ని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా ఖండించారు. దేశానికి ఎందరో ప్రధానులు వచ్చారు ఎవరి ఫోటోలు రేషన్ షాపుల్లో పెట్టలేదన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి వచ్చి మోదీ ఫోటో పెట్టమనడం చూస్తుంటే ప్రధాని స్థాయని దిగజార్చే విధంగా ఉందన్నారు హరీష్‌రావు. పేదలకు ఇచ్చే ఉచిత రేషన్ బియ్యం పూర్తిగా కేంద్రమే ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకోవడం తగదన్నారు. కేంద్రం 55 శాతం ఖర్చు బరిస్తే మిగిలిన 45 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం 3610 కోట్ల రూపాయలు రేషన్ బియ్యం కోసం ఖర్చు చేస్తున్నామని అలాగని సీఎం ఫోటో పెట్టామంటారా అని కేంద్రమంత్రిని హరీష్‌రావు ప్రశ్నించారు. అంతే కాదు ఆయుష్మాన్ భారత్ పథకంలో తెలంగాణ చేరలేదన్న కేంద్రమంత్రి వ్యాఖ్యలను తప్పు పట్టారు హరీష్‌రావు. అలాగని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమన్నారు. లేదంటే ఆయుష్మాన్ భారత్‌లో తెలంగాణ చేరి ఉంటే మీరు రాజీనామా చేస్తారా అంటూ కేంద్ర మంత్రిని సవాల్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Minister harishrao, Nirmala sitharaman, Telangana News