news18-telugu
Updated: April 24, 2020, 7:10 PM IST
మోటార్ ద్వారా రంగనాయకసాగర్‌లోకి నీటిని విడుదల చేసిన మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్
సిద్ధిపేట జిల్లాలోని రంగనాయక సాగర ప్రాజెక్టు నీళ్లు పోసే పంపులను మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ప్రారంభించారు. చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ శివారులోని రంగనాయకసాగర్ పంప్హౌన్లోని నాలుగు మోటర్ల వెట్ రన్‌ను మంత్రులు ప్రారంభించారు. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి ఆరోదశ ఎత్తిపోతతో అన్నపూర్ణ జలాశయాన్ని చేరుకున్న గోదావరిజలాలు... రంగనాయకసాగర్‌లోకి వస్తున్నాయి. రంగనాయక సాగర్‌లోకి జలాలు చేరుకోవడంతో... పది దశల ఎత్తిపోతలలో ఏడోదశ సంపూర్ణం అయినట్టయ్యింది. అంతకుముందు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు రంగనాయకసాగర్ సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రంగనాయకసాగర్‌లోకి పరుగులు పెడుతున్న గోదావరి జలాలు
మేడిగడ్డ నుంచి రంగనాయకసాగర్‌లోకి...
మేడిగడ్డ వద్ద గోదావరి తెలంగాణ వైపు తొలి అడుగు వెనుకకు వేసింది. ఒక్కో అడుగుకు ఒక్కో దశ దాటుకొంటూ కొండపోచమ్మ సాగర్ వైపు పరుగులు తీస్తున్నది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి బరాజ్‌ల ద్వారా తొలి మూడు దశల్లో నీటిని ఎత్తిపోయడం ద్వారా ఎల్లంపల్లికి చేరుకొన్న కాళేశ్వర జలాలు... ఆ తరువాత నంది, గాయత్రీ పంపుహౌజ్‌ల ద్వారా మరో రెండు అడుగులు వేసి శ్రీరాజరాజేశ్వర జలాశయాన్ని చేరుకున్నాయి. శ్రీరాజరాజేశ్వర నుంచి మరో అడుగువేసి కాళేశ్వర జలాలు అన్నపూర్ణ రిజర్వాయర్‌కు చేరుకున్నాయి. శుక్రవారం రంగనాయకసాగర్‌లో కాలుమోపడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదో దశ పూర్తయ్యింది. అక్కడి నుంచి తుక్కాపూర్, అక్కారం, మర్కూక్ మీదుగా మరో మూడడుగులు వేస్తే గోదావరి బేసిన్లోనే అతి ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన కొండపోచమ్మను కాళేశ్వర జలాలు చేరుకుంటాయి. మే రెండో వారంలోనే ఈ దీన్ని పూర్తిచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొండపోచమ్మసాగర్‌లోకి గోదావరిజలాలు అందుబాటులోకి వస్తే.. ప్రపంచంలోనే అతి పెద్ద బహుళ ఎత్తిపోతల పథకంగా ఖ్యాతికెక్కిన కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్ర సృష్టించనుంది.
Published by:
Kishore Akkaladevi
First published:
April 24, 2020, 12:36 PM IST