జీవ నదిగా పేరుగాంచిన ప్రాణహిత నది పుష్కరాలు (Pranahita Pushkaralu) అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మంచిర్యాల (Manchiryala) జిల్లా చెన్నూరు నియోజకవర్గం పరిధిలోని కోటపల్లి మండలం అర్జున గుట్ట లో రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Minister Allola Indrakaran Reddy) ఈ పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు, ప్రభుత్వ విప్, చెన్నూరు శాసన సభ్యుడు బాల్క సుమన్ దంపతులు, ఎమెల్సీ దండె విఠల్, మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ నల్లా భాగ్యలక్ష్మీ పండితుల మంత్రోచ్చరణల నడుమ పుష్కరుడికి శాస్త్రోక్తంగా పూజలు చేసి అనంతరం ప్రాణహిత నదిలో పుణ్యస్నానాలు చేసి నదికి హారతి ఇచ్చారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. దేవాదాయ శాఖ మంత్రిగా గతంలో గోదావరి, కృష్ణ పుష్కరాల్లో, ఇప్పుడు ప్రాణహిత పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించటం మహాభాగ్యంగా భావిస్తున్నాని అన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సారధ్యంలో గోదావరి, కృష్ణ పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి విజయవంతంగా నిర్వహించామన్నారు.
24వ తేదీ వరకు..
ప్రాణహిత పుష్కరాలను ఇవాళ్టి నుంచి 24వ తేదీ వరకు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు. ఈ పుష్కరాలకు తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని, దానికి తగ్గట్లుగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని మంత్రి వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కుమ్రం భీం - ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు వివిధ శాఖల అధికారులను సమన్వయం చేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లను చేశారన్నారు మంత్రి.
ప్రత్యేక ఏర్పాట్లు..
యుద్ధప్రాతిపదికన పుష్కరాల ఏర్పాట్లను పూర్తి చేసిన జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులను ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభినందించారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం దేవాదాయ శాఖ ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంతో పాటు ఇతర దేవాస్థానాల ముస్తాబు (పేయింటింగ్స్, లైటింగ్ తదితర పనులు), ప్రత్యేక క్యూ లైన్లు, చలువ పందిళ్ళు, నదీ స్నానం అనంతరం బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేసిందని మంత్రి వివరించారు.
ఇదిలా ఉంటే కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల మండల తుమ్మిడిహెట్టి వద్ద పుష్కరాలను సిర్పూర్ శాసనసభ్యుడు కోనేరు కోణప్ప దంపతులు, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి పుష్కరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనప్ప దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తుమ్మిడి హెట్టి, మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం అర్జునగుట్ట, దేవులవాడ, వేమనపల్లి మండల కేందంలో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్ల వద్ద వివిధ ప్రాంతాల నుండి తరలివస్తున్న భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ మేరకు ఆయా జిల్లా యంత్రాంగాలు అవసరమైన ఏర్పాట్లను చేపట్టాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.