హైదరాబాద్ ప్రజలు ఓ వైపు వర్షం, వరదలతోనే హడలిపోతుంటే ఇప్పుడు గచ్చిబౌలి వాసులను మరో అంశం కలవరపెడుతోంది. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వస్తున్నాయి. దీంతో ఆ చుట్టుపక్కల జనం హడలిపోతున్నారు. మై హోం విహంగ రెసిడెన్షియల్ కాంప్లెక్స్, టీఎన్జీవో 2 కాలనీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చినట్టు స్థానికులు చెప్పారు. భూమి లోపలి నుంచి శబ్దాలు కూడా వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, కొన్ని రోజుల క్రితం బోరబండలో వచ్చిన భూ ప్రకంపనల లాంటివే ఇవి కూడా అని, దీని వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్జీఆర్ఐ సైంటిస్టులు చెబుతున్నారు. గచ్చిబౌలిలో వచ్చిన భూ ప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 0.5 నుంచి 0.8 మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ‘భూ ప్రకంపనల గురించి భయపడాల్సిన పనిలేదు. ఇటీవల బోరబండలో వచ్చిన తరహాలోలోనే ఇవి కూడా. మై హోం విహంగ, టీఎన్జీవో 2 కాలనీ ప్రాంతాల్లో మూడు స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఎన్జీఆర్ఐ చూస్తుంది. మై హోం విహంగలో నివసించే 40 కుటుంబాల భయంతో అక్కడి నుంచి సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లిపోయారు. అయితే, మై హోం విహంగ రిక్టర్ స్కేల్‌పై 6.5 తీవ్రత ఉండే భూకంపాలను కూడా తట్టుకునేలా నిర్మించారు. మైహోం ప్రాంతంలో రెండు రోజుల నుంచి ప్రకంపనలు వస్తున్నాయి.
ఇటీవల బోరబండలో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ఎన్జీఆర్ఐ, జీహెచ్ఎంసీ అధికారులు బోరబండ ప్రాంతంలో పర్యటించారు. భూకంప తీవ్రతను కొలిచేందుకు మూడు ప్రాంతాల్లో సిస్మోగ్రాఫ్ పరికరాలను ఏర్పాటు చేశారు. అక్టోబరు 2న వచ్చిన ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 1.4 ఉండగా.. ఆ తర్వాత అక్టోబర్ 4న వచ్చిన ప్రకంపనల తీవ్రత 0.8గా నమోదయింది. తీవ్రత చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు భయపడాల్సిన పనిలేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. బోరబండ ప్రాంతం ఎత్తైన గుట్టల ప్రాంతంలో ఉండడంతో భూమి లోపలి పొరల్లో ఏర్పడే సర్దుబాట్ల కారణంగానే శబ్దాలు వస్తున్నట్లు తెలిపారు. ఈ మధ్య పడిన వర్షాల వల్ల వాన నీరు భూమిలోకి వెళ్తోందనీ... ఆ సమయంలో భూమి పొరల్లో ఉండే గాలి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుందనీ వెల్లడించారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలు కూడా కొండలు గుట్టలే. అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు నిర్మాణం జరిగాయి. అలాగే, గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. కాబట్టి గచ్చిబౌలి ప్రాంతాల్లో కూడా బోరబండలో జరిగినట్టే నీరు లోపలికి ఇంకిన తర్వాత భూమి పొరల్లో ఉండే గాలి బయటకు వచ్చి ఉంటుందని, ఆ శబ్దాలను విని జనం ఆందోళన చెంది ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.