శుభ్రత పాటించండి... పిల్లల్ని కాపాడుకోండి... పారిశుధ్య కార్మికురాలి విజ్ఞప్తి

Telangana : స్వచ్ఛభారత్ నినాదం వచ్చి... ఐదేళ్లు దాటినా... ఇప్పటికీ స్వచ్ఛత అన్నదే ఎక్కడా కనిపించట్లేదు. ఇందుకు కారణమేంటి? మనం చేస్తున్న తప్పేంటి? పారిశుధ్య కార్మికురాలు బాబమ్మ ఏమంటున్నారో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: September 17, 2019, 2:23 PM IST
శుభ్రత పాటించండి... పిల్లల్ని కాపాడుకోండి... పారిశుధ్య కార్మికురాలి విజ్ఞప్తి
బాబమ్మ, పారిశుధ్య కార్మికురాలు (Source - Twitter - Swachh Hyderabad)
Krishna Kumar N | news18-telugu
Updated: September 17, 2019, 2:23 PM IST
కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ నినాదం అమల్లోకి తేగానే... తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛ హైదరాబాద్ విధానం అమల్లోకి తెచ్చింది. శుచి, శుభ్రత పాటించేందుకు కొన్ని రూల్స్ పెట్టింది. ప్రతి ఇంటికి రెండు డస్ట్ బిన్‌లను ఇచ్చింది. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా వాటిలో వెయ్యమని కోరింది. అలాగే... చెత్తను సేకరించేందుకూ, తీసుకెళ్లేందుకు ప్రత్యేక వాహనాల్ని తెచ్చింది. అలాగే పారిశుధ్య కార్మికులను పెద్ద ఎత్తున నియమించింది. ఎన్ని చేసినా... ఇప్పటికీ ఎక్కడి చెత్త అక్కడే కనిపిస్తోంది. డస్ట్ బిన్‌లు ఉన్నా... చాలా మంది... రోడ్లపైనే చెత్తను వేసేస్తున్నారు. ఇక నీటి తడి లేని వీధులను హైదరాబాద్‌లో చూద్దామన్నా కనిపించవు. ఈ పరిస్థితులన్నీ కలిసి... లేనిపోని రోగాలకు కారణం అవుతున్నాయి. ఈ విషయాన్ని హైదరాబాద్ ప్రజలు గమనించాలంటూ తన ఆవేదనను మనతో పంచుకున్నారు పారిశుధ్య కార్మికురాలు బాబమ్మ.

హైదరాబాద్‌లో 18 ఏళ్లుగా పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు బాబమ్మ. ఐతే... ఆమెకు ప్రమోషన్ల వంటివి లేవు. జీతాలు అంతంత మాత్రమే. గుర్తింపు అస్సలు లేదు. దానికి తోడు పారిశుధ్య కార్మికులంటే చాలా మంది ప్రజలు చిన్న చూపు చూస్తారు. చెత్తను చెత్త డబ్బాల్లోనే వెయ్యమంటే... నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నట్లు చూస్తుంటారు కొందరు. ఇలాంటి ఎన్నో అవమానాల్ని భరిస్తూ... ఎప్పటికప్పుడు సిటీని క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉండేలా చేస్తున్నారు పారిశుధ్య కార్మికులు. మనకు తెలుసు. వాళ్లే గనక ధర్నాలకు దిగితే... ఎక్కడి చెత్త అక్కడే నిలిచిపోతుందని. మనం ఆరోగ్యంగా ఉంటున్నామంటే... కారణం వాళ్లు చేస్తున్న పారిశుధ్య పనులే. ఈ విషయాన్ని హైదరాబాద్ ప్రజలు గుర్తించాలని కోరుతున్నారు బాబమ్మ.

Loading...
డెంగ్యూ, మలేరియా జ్వరాలు రావడానికి ప్రత్యేక కారణాలు కూడా చెప్పారామె. చాలా అపార్ట్‌మెంట్లలో కలుషిత నీరు బయటకు పోయేందుకు ప్రత్యేక పైప్ మార్గాలు లేవు. అందువల్ల ఇళ్లు కడిగినప్పుడు ఆ నీరును రోడ్లపైకి వదిలేస్తున్నారు. ఆ కలుషిత నీటిపై దోమలు గుడ్లు పెట్టి కాలనీలను ఏర్పరచుకుంటున్నాయి. ఫలితంగా డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు ప్రభలుతున్నాయి. ఇదే విషయాన్ని గుర్తుచేసిన బాబమ్మ... మనం ఆరోగ్యంగా ఉండాలనీ, అందరం బాధ్యతగా మెలగుతూ... చెత్తను చెత్త కుండీల్లోనే వేస్తూ... పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రయత్నించాలని వేడుకుంటున్నారు బాబమ్మ.


బాబమ్మ ఆవేదన చాలా మంది హృదయాల్ని కదిలిస్తోంది. పారిశుధ్య కార్మికులకు ఎదురవుతున్న పరిస్థితులను హైదరాబాద్ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇకపై స్వచ్ఛతను పాటిస్తామని చాలా మంది ఆమెకు హామీ ఇస్తున్నారు.
First published: September 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...