Home /News /telangana /

MEDAK PERSON DIES OF HEART ATTACK IN DUBAI AND HIS FAMILY URGES TO GOVERNMENT FOR HELP MDK SSR

Sad: అయ్యో పాపం.. ఎంత కష్టం వచ్చింది ఈ కుటుంబానికి.. మెదక్ జిల్లాలో విషాద ఘటన..

బాధిత కుటుంబం, ఇన్‌సెట్‌లో మోహన్

బాధిత కుటుంబం, ఇన్‌సెట్‌లో మోహన్

ఐదేళ్ల క్రితం కుటుంబాన్ని వదిలి బతుకుదెరువు కోసం దుబాయ్‌కి వెళ్లాడు. రెండేళ్ల క్రితం సొంతూరు వచ్చి కుటుంబంతో కొన్నాళ్లు ఉండి మళ్లీ ఉపాధి నిమిత్తం దుబాయ్‌కు వెళ్లాడు. కానీ.. విధి ఆడిన వింత నాటకంలో ఆ వ్యక్తి ఓడిపోయాడు.

    మెదక్: ఐదేళ్ల క్రితం కుటుంబాన్ని వదిలి బతుకుదెరువు కోసం దుబాయ్‌కి వెళ్లాడు. రెండేళ్ల క్రితం సొంతూరు వచ్చి కుటుంబంతో కొన్నాళ్లు ఉండి మళ్లీ ఉపాధి నిమిత్తం దుబాయ్‌కు వెళ్లాడు. కానీ.. విధి ఆడిన వింత నాటకంలో ఆ వ్యక్తి ఓడిపోయాడు. దుబాయ్‌లో కష్టపడి డబ్బు సంపాదించుకుని కొన్నాళ్ల తర్వాత కుటుంబంతో కలిసి సొంతూరిలో సుఖంగా బతకాలని ఆశించిన అతను ఆశలను మృత్యువు అడియాసలు చేసింది. గుండెపోటు రూపంలో అతని కలలను చిదిమేసింది. ఆ కుటుంబానికి అతనిని దూరం చేసింది. ఈ విషాద ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. కుటుంబ పోషణ నిమిత్తం జిల్లాకు చెందిన కూలీలు చాలామంది దుబాయ్‌కు వెళ్తున్నారు. దుబాయిలో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అలా వెళ్లిన వారిలో హవేలి ఘనపూర్ మండలం జక్కన్న పేట్ గ్రామానికి చెందిన మోహన్ ఒకరు. ఉన్న ఊళ్లో వ్యవసాయం ఆశించిన లాభాలను ఇవ్వకపోగా అప్పులపాలు చేసింది. దీంతో.. కుటుంబ పోషణే కష్టంగా మారింది. దీంతో.. తన కుటుంబాన్ని కష్టాల నుంచి గట్టెక్కించాలంటే దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించడం ఒక్కటే మార్గమని మోహన్ భావించాడు.

    కుటుంబంతో ఈ విషయం చెప్పాడు. దేశం కాని దేశం వెళతానని మోహన్ అంటే ఆ కుటుంబం తొలుత ఆలోచనలో పడినప్పటికీ కొన్నేళ్లు చేస్తే అప్పులన్నీ తీరిపోతాయని, సుఖంగా ఉండొచ్చని మోహన్ చెప్పడంతో తప్పక ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే.. నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు కోసం మోహన్ దుబాయ్‌కి వెళ్ళాడు. కూలి పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. రెండేళ్ల క్రితం సొంతూరు వచ్చి కుటుంబంతో కొన్నాళ్లు సంతోషంగా గడిపి వాళ్లకు కొంత డబ్బు ఇచ్చి మళ్లీ దుబాయ్‌ వెళ్లిపోయాడు. అలా వెళ్లిన మోహన్‌ గుండెపోటుతో సోమవారం మృతి చెందినట్లు అతడి స్నేహితులు కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న కొడుకు మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మోహన్‌కు భార్య సరిత, ఇద్దరు కుమారులు ఉన్నారు.

    ఇది కూడా చదవండి: Teenager: షాకింగ్ ఘటన... ఆన్‌లైన్ క్లాసులకని స్మార్ట్‌ఫోన్‌ కొనిచ్చి.. నెట్ బ్యాలెన్స్ వేయిస్తే 14 ఏళ్ల బాలుడు చేసే పని ఇదా..!

    భర్త చనిపోయిన విషయం తెలిసి సరిత రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ఇక తనకు దిక్కెవరంటూ సరిత రోదించిన తీరు హృదయాన్ని ద్రవించేలా చేసింది. ఇదిలా ఉంటే.. దుబాయ్‌లో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని సొంతూరు చేర్చడమంటే అంత ఆషామాషీ విషయం కాదు. అందుకే.. మోహన్ మృతదేహాన్ని సొంతూరు తీసుకురావడానికి తగినంత డబ్బు లేక ఆ కుటుంబం అష్టకష్టాలు పడుతోంది. ప్రభుత్వమే తమ కష్టాన్ని తీర్చాలని ఆ కుటుంబం వేడుకుంటోంది. ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిని ఆ గ్రామస్తులంతా కలిసి దుబాయ్ నుంచి మోహన్ మృతదేహాన్ని సొంతూరు తరలించేలా చూడాలని విన్నవించుకున్నారు. మోహన్ మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాయం కోరుతానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.

    కె.వీరన్న, News 18 ప్రతినిధి
    మెదక్ జిల్లా

    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Dubai, Heart Attack, Medak, Medak District news, Telangana crime news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు