(K.Veeranna,News18,Medak)
ఆ నియోజకవర్గం టీఆర్ఎస్ (TRS)చేజార్చుకున్న స్థానం. అందుకే ఇప్పుడు ఆ నియోజకవర్గంపై కన్నేశారు అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ(MP).నిత్యం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ.. నియోజకవర్గ నేతలు, క్యాడర్ని కలుపుకొని ముందుకుపోతున్నారు. అంతే కాదు సమావేశాలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరైన ప్రతి సారి దుబ్బాక (Dubbaka)నియోజకవర్గం అంటే తనకెంతో అభిమానమని ..తన సొంత నియోజకవర్గంగా భావిస్తున్నానని చెబుతున్నారు. ఉన్నపళంగా ప్రస్తుతం ఎంపీగా గెలిచిన ఆ నేతకు దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం(Assembly Constituency)పై మనసు మళ్లడానికి కారణం అదేనంటున్నారు పార్టీ శ్రేణులు.
ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎంపీ ఆశ..
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు గతం సంగతి పక్కన పెడితే రాబోయే ఎన్నికల్లో మాత్రం తన రూటు మార్చుకోవాలని ట్రై చేస్తున్నారు. జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లుగా ఆయన సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. అంతే కాదు తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మనసులో ఉన్న విషయాన్ని స్వయంగా సీఎం కేసీఆర్ దృష్టి వరకు తీసుకెళ్లారట కొత్త ప్రభాకర్‌రెడ్డి. 2018 అసెంబ్లీ ఎన్నికలలో దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేసినా అప్పట్లో దక్కలేదు. స్వర్గీయ రామలింగారెడ్డికి సీఎం కేసీఆర్ దుబ్బాక నియోజకవర్గం టికెట్ ఇవ్వడం జరిగింది.
టికెట్ కోసం ముందు నుంచే ప్రయత్నం..
రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక నియోజకవర్గంలో ఉపఎన్నిక జరిగింది. సెంటిమెంట్‌గా రామలింగారెడ్డి సతీమణికి ఎమ్మెల్యేగా బరిలోకి దింపితే బీజేపీ అభ్యర్ది రఘునందన్ చేతిలో పరాయం పొందారు. అయితే పోగొట్టుకున్న స్థానంలో మళ్లీ గులాబీ జెండా ఎగురవేయాలన్న ఆలోచనలో టీఆర్ఎస్ ఉంది. అందుకే ఆ స్థానంలో రాబోయే ఎన్నికల్లో రామలింగరెడ్డి కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
నియోజకవర్గంలోనే తిష్ట..
ఈక్రమంలోనే మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి మళ్లీ దుబ్బాక నియోజకవర్గంపై తన ఇష్టాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. ఈసారి ఎలాగైనా సారే టికెట్ దక్కించుకొని పోటీ చేసి గెలవాలనే ధృడనిశ్చయంతో ఉన్నారట కొత్త ప్రభాకర్‌రెడ్డి. అందుకు తగినట్లుగానే రెగ్యులర్‌గా నియోజకవర్గంలో పర్యటిస్తూ క్యాడర్ని కలుపుకొని పోవడమే కాకుండా ప్రజల అవసరాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని సొంత వర్గమే ప్రచారం చేస్తోంది.
ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్..
ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్న కొత్త ప్రభాకర్‌రెడ్డికి రెండు అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ఒకటి మంత్రి హరీష్‌రావుకు అత్యంత సన్నిహితుడు కావడం, రెండవది పార్టీకి అవసరమైన మేరకు నిధులు ఖర్చు పెట్టగలిగే సామర్ద్యం ఉన్న నేత కావడంతో పార్టీ అధిష్టానం కూడా టికెట్ కన్ఫామ్ చేస్తుందనే టాక్ కూడా వినిపిస్తోంది. కాకపోతే కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక అసెంబ్లీ నుంచి పోటీ చేస్తే ..మెదక్ ఎంపీ స్థానంలో అంతటి బలమైన నేత దొరకడం కూడా కష్టమే కదా అనే ఆలోచన కూడా చేస్తోందట. మరి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పాచికలు ఏమాత్రం పారతాయో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.