రిపోర్టర్ : వీరన్న
లొకేషన్ : మెదక్
ఆగి ఉన్న ట్రాక్టర్ ని వేగంగా వస్తూ కారు ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే తల్లి కూతుర్లు మరణించారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ హాస్పిటల్ కు తరలించారు. ఓకే కుటుంబంలో జరిగిన ఈ విషాదకర సంఘటన అర్ధరాత్రిచోటుచేసుకుంది.మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని అంతారం గేటు వద్ద చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై శివప్రసాద్ రెడ్డి కథనం ప్రకారం.. కంచన్ పల్లి గ్రామానికి చెందిన దుంపల మల్లేశం ఏపీ 29 సిసి6975 నంబర్ గల తన స్విఫ్ట్ కారులో నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామంలో గల తన సమీప బంధువు ఇంటికి సాయంత్రం ఏడు గంటలకు శుభకార్యానికి వెళ్లి రాత్రి తిరిగి వస్తున్నారు.
కాగా, అంతారం గేటు వద్ద నడిరోడ్డులో ఆగి ఉన్న టీఎస్ 15 టి 0557 నెంబర్ గల ట్రాక్టర్ ను అర్ధరాత్రి 12 గంటల 15 నిమిషాలకు బలంగా కారు ఢీకొంది.ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో దుంపల మల్లేశం భార్య దుంపల స్వరూప (36) దుంపల శ్రీలేఖ (13)లు ఘటన స్థలంలోని మృతి చెందగా, దుంపల మల్లేశం, తన చిన్న కూతురు దుంపల లావణ్యలకు తీవ్ర గాయాలయ్యాయని ఎస్సై తెలిపారు. మృతి చెందిన దుంపల స్వరూప గ్రామంలో ఆశ వర్కర్ గా పనిచేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం తెలిసిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు పోలీసులు. మృతి చెందిన స్వరూప, శ్రీలేఖల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ తరలించి తీవ్ర గాయాలైన దుంపల మల్లేశం, లావణ్యలను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాదులోనిప్రైవేట్ హాస్పటల్ తరలించినట్లు ఎస్సై తెలిపారు.
కాగా ఈ రోడ్డు ప్రమాదానికి డ్రైవర్ రమావత్ ప్రవీణ్ కుమార్ అతివేగంగా నడపడమే ఓ కారణంగా తెలుస్తోంది. అంతారం గేటు వద్ద 765 ప్రధాన రహదారిపై సడన్ బ్రేక్ వేయడం మరో కారణం. ట్రాక్టర్ ట్రాలీకి వెనుక భాగంలో రేడియం స్టిక్కర్లు లేనందున చీకట్లో కనిపించకపోవడం ఇంకో కారణం. ఓవరాల్ గా వేగంగా వస్తున్న కారు ట్రాక్టర్ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. దుంపల మల్లేశం సోదరుడు దుంపల పరమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివప్రసాద్ రెడ్డి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Accident, Local News, Medak, Telangana