తెలుగు రాష్ట్రాల్లో ప్రణయ్ హత్య కేసు ఓ సంచలనం. ఈ కేసులో అమృత తండ్రి మారుతీరావుకు బెయిల్ మంజూరైంది. మారుతీరావుతోపాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరికి కూడా బెయిల్ ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2018 సెప్టెంబర్ 14న నల్గొండ జిల్లా... మిర్యాలగూడలో ప్రణయ్ హత్య జరిగింది. భార్య అమృతతోపాటు ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా... ఆస్పత్రి బయటే 24 ఏళ్ల ప్రణయ్‌ని కత్తులతో నరికి చంపారు. అమృత తండ్రి తిరునగరి మారుతీరావు... హంతకులకు సుపారి ఇచ్చి ప్రణయ్‌ని హత్య చేయించినట్టు పోలీసులు స్పష్టం చేశారు. నిందితులు ఎప్పటికప్పుడు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేస్తున్నా ఇన్నాళ్లూ కోర్టు తోసిపుచ్చింది. తాజాగా మరోసారి హైకోర్టును ఆశ్రయించగా బెయిల్ మంజూరైంది. మారుతీరావు 7 నెలలుగా వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇప్పుడాయన బెయిల్ పేపర్లు జైలు అధికారులకు చేరగానే విడుదల అవుతారు.
ప్రణయ్ హత్య కేసులో మారుతీరావు ప్రధాన నిందితుడు. ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్ ఆరో నిందితుడిగా ఉన్నారు. వాళ్లిద్దరితోపాటూ... ఐదో నిందితుడు కరీంపై 2018 సెప్టెంబరు 18న పోలీసులు పీడీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురూ బెయిల్‌పై బయటకు వస్తే ప్రణయ్ కుటుంబానికి ప్రమాదమని భావించిన పోలీసులు పీడీ చట్టాన్ని ప్రయోగించారు. అయినప్పటికీ మారుతీరావుకు బెయిల్ రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రియల్టరైన మారుతీరావు... తన పేరు ప్రఖ్యాతుల్ని అడ్డం పెట్టుకొని అక్రమ మార్గంలో బెయిల్ తెప్పించుకున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. బెయిల్ రావడాన్ని నిరసిస్తూ... త్వరలో పైకోర్టుకు వెళ్తారా అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మొత్తానికి పీడీ చట్టం ప్రయోగించినా బెయిల్ రావడంతో... ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
ఈ ఏడాది గూగుల్ సైన్స్ ఫెయిర్ కంటెస్ట్‌లో 18 మంది ఇండియన్ సైంటిస్టులు...
నేడు వారణాసిలో రైతుల నామినేషన్... ప్రధాని మోదీకి పోటీ...
ఇండియాలోకి ఉగ్రవాదులు వస్తారని ఊహించాడట... ఫేక్ కాల్ చేసినందుకు అరెస్ట్...
బూత్ లెవెల్లో టీడీపీ సర్వే... పూర్తి వివరాలు కోరిన చంద్రబాబు... గెలుపు లెక్కలు తేల్చేందుకు...
నేడు హైదరాబాద్‌కి జగన్... పార్టీ నేతలతో కీలక సమావేశం... ఎన్నికల ఫలితాలపై చర్చ