టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా.. మహిళలకు ఎన్ని చట్టాలు తెచ్చిన కొంతమందిలో మార్పు మాత్రం రావడం లేదు. దేశంలో ఏదో చోట హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అదనపు కట్నం తీసుకురావాలని భర్త బలవంతం చేయగా తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పెద్దపడిశాలకు చెందిన రాములు, ఎల్లమ్మ దంపతుల కుమార్తె నవనీతను సింగారాజుపల్లికి చెందిన కొంగరి మల్లయ్య, ఎల్లమ్మ దంపతుల కొడుకు భాస్కర్‌కి ఇచ్చి ఆరు నెలల క్రితం పెళ్లి చేశారు. తర్వాత కొన్ని నెలల వరకు కాపురం సజావుగా సాగినా తర్వాత కట్నం కోసం వేధించం మొదలు పెట్టారు. దీంతో మనస్థాపం చెంది ఆమె ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివాహం జరిగిన దగ్గర నుంచి తన కూతరును కట్నం కోసం వేదించేవారని ఆమె తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి తండ్రి రాములు ఫిర్యాదు చేయడంతో మృతురాలి భర్త, అత్తమామలతో పాటు కుటుంబ సభ్యులపై కేసు నమోదుచేసినట్లు ఎస్సై కరుణాకర్‌రావు తెలిపారు.
నవనీత ఆత్మహత్యతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పెద్దఎత్తున సింగరాజుపల్లికి తరలివచ్చారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. వర్ధన్నపేట ఏసీపీ రమేష్, పాలకుర్తి సీఐ చేరాలు, రఘునాథపల్లి సీఐ వినయ్‌కుమార్, పాలకుర్తి, కొడకండ్ల, లింగాలఘణపురం, గుండాల ఎస్సైలు సతీష్, పవన్‌కుమార్, దేవేందర్, తిరుపతితో పాటు సిబ్బంది సంఘటనా స్థలంలో గస్తీ నిర్వహించారు.
తమ కూతరుకు చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరుతూ మృతదేహాన్ని తరలించడానికి సిద్ధంచేసిన వాహనాన్ని ఆమె కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. ఈ విషయంపై పెద్దలు కల్పించుకొని ఎట్టకేలకు మృతదేహాన్ని తరలించడానికి ఆమోదం తెలిపారు. ఆమె తల్లి ఎల్లమ్మ స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించి చికిత్స అందించారు. ఈ విషాద ఘటనతో గ్రామంలో రోదనలు మిన్నంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Dowry harassment, Nalgonda, Telangana crime news, Wife suicide, Yadadri