MAOISTS LOOK TO GO HI TECH IN SPREADING PROPAGANDA AND FIGHTING WAR BA
మావోయిస్టులు.. ఇప్పుడు మరీ 'స్మార్ట్'
ప్రతీకాత్మక చిత్రం
గతంలో ల్యాండ్‌మైన్స్, క్లెమోర్‌మైన్స్ లాంటివాటిని తయారు చేయడం, వినియోగించడం కోసమే ఉపయోగించిన టెక్నాలజీని ప్రస్తుతం మావోయిస్టులు 'స్మార్ట్' టెక్నాలజీని వాడుకోవడం కొత్త ఒరవడిగా చెప్పుకోవచ్చు.
(జి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం కరస్పాండెంట్, న్యూస్18)
అవును. ఇప్పుడు మావోయిస్టులు మరీ స్మార్ట్‌గా మారిపోయారు. ఎప్పుడూ అడవుల్లో తిరుగుతూ పోలీసు కూంబింగ్ పార్టీలకు దొరక్కుండా ఎక్కడికక్కడ తమ ఉనికిని రహస్యంగా ఉంచుకుంటూ సాగే వీరి దినచర్యను ఇప్పుడు టెక్నాలజీ పూర్తిస్థాయిలో మార్చేసిందనే చెప్పొచ్చు. అడవుల్లో ఉన్నా.. తమ సానుభూతి పరులైన గిరిజనం ఉన్న గూడేలకు సమీపంలో శిబిరాలు ఏర్పాటు చేసినా.. ఎక్కడికక్కడ టెక్నాలజీ సాయంతో అప్డేట్ అవుతున్నారు. చేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావడం.. మారుమూల గ్రామాల్లో, వాటి దగ్గరలో ఏమూలకెళ్లినా సిగ్నల్ గ్యారంటీ. ప్రభుత్వం తమ అధికారిక కార్యకలాపాల కోసం ఏర్పాటు చేసుకున్న సాంకేతికతనే మావోయిస్టులు కూడా తెలివిగా ఉపయోగించుకుంటున్నారు. వారి సానుభూతి పరుల సాయంతో సెల్ఫోన్లు తెప్పించుకుని వాట్సాప్ లాంటి సోషల్‌మీడియా యాప్‌లను విరివిగా వాడుతున్నారు. ఈ మధ్య కాలంలో వారి భావజాల వ్యాప్తికి ఈ ఆధునిక సాధనాలను, సోషల్‌మీడియాను ఉపయోగించడం ఓ పెద్ద మార్పుగా చెప్పుకోవచ్చు.
ఇటీవల మావోయిస్టుల వద్ద పోలీసులకు లభించిన వస్తువులు
ఈ మధ్య కాలం దాకా ఏదైనా ఘటనకు సంబంధించి తమ ప్రతిస్పందనను తెలియజేయాలన్నా.. లేదా ప్రభుత్వ విధానాలపై తమ స్పందనను తెలియజేయాలన్నా మావోయిస్టులు పోస్టర్లను వేయడానికి మాత్రమే పరిమితం అయ్యేవారు. మావోయిస్టు పార్టీ లెటర్హెడ్పైన కొన్నిసార్లు చేతితోనూ.. మరికొన్ని సార్లు ప్రింట్ ఫార్మాట్లలోనూ వారు ప్రెస్ మరియు మీడియాకు రహస్య కొరియర్ల ద్వారా చేరవేశేవారు. ఎవరొచ్చి ఎప్పుడు ఇచ్చివెళ్లేవారో తెలిసే పరిస్థితి ఉండేది కాదు. దీంతో పాటుగా ప్రజా సమూహానికి తెలిసేలా గ్రామాల్లో తాము ముద్రించిన పోస్టర్లను గోడలపైన అంటించడం పరిపాటిగా ఉండేది. కొన్ని సార్లు బ్యానర్ల రూపంలోనూ వారి నినాదాలను, వైఖరిని వెల్లడిస్తుండేవారు. కాలక్రమంలో అడవుల్లో ఉండే మావోయిస్టులు సైతం టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
తాజాగా ఈ వారంలో భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరు డివిజన్లోని మల్లేపల్లితోగు, కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి అటవీ ప్రాంతాల్లో పోలీసు కూంబింగ్ పార్టీలకు మావోయిస్టు దళాలు తారసపడడంతో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ వరుస ఘటనలు వెంటవెంటనే జరగడం విశేషం. ఈ ఘటన జరిగిన మరుసటి రోజున మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట ఓ లేఖ (లెటర్ హెడ్‌పై ప్రింట్ ఫార్మాట్లో) వాట్సాప్ మాధ్యమంగా హల్చల్ చేసింది. దీంతోబాటు సదరు లేఖలో పేర్కొన్న అన్ని అంశాలను జగన్ స్వయంగా మాట్లాడినట్టున్న ఆడియో వాయిస్ రికార్డింగ్ రూపంలోనూ సామాజిక మాధ్యమాలలో చేరిపోయింది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి.. ఎవరికి ఎలా చేరుతోందోనన్నది తెలియని పరిస్థితి. సాధారణంగా పార్టీ సానుభూతి పరులను దీనికోసం మావోయిస్టు పార్టీ నియోగించడం సాధారణంగా జరిగే విధానం. అయితే ఇక్కడ ఎవరి ఫోన్ నుంచి ఎవరికి చేరిందన్నది సాంకేతికత సాయంతో వెలికితీసే అవకాశం ఉన్నా.. ఏ మాత్రం బెరుకు లేకుండా మావోయిస్టు పార్టీ లెటర్‌హెడ్ పైన ముద్రించిన ప్రెస్రిలీజ్ను, ఆడియో వాయిస్ టేప్‌ను వాట్సాప్ ద్వారా జనారణ్యంలోకి పంపారంటే నెట్‌వర్క్‌ను అంచనా వేయొచ్చు.
ప్రతీకాత్మక చిత్రం
సాధారణ ప్రజల నుంచి ఇది వ్యాప్తి చెందే పరిస్థితి ఏమాత్రం ఉండదని, కేవలం మావోయిస్టు కార్యకలాపాలతో నేరుగా సంబంధం ఉండి, లేదా సీరియస్ సానుభూతి పరులకే ఈ మాత్రం తెగువ ఉంటుందని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. దీంతోపాటు మొన్నటి ఎన్కౌంటర్ అనంతరం ఘటనా స్థలంలో పోలీసులకు లభ్యమైన సామగ్రి, కిట్‌బ్యాగులలో సోలార్ ప్యానెళ్లు దొరకడంతో మావోయిస్టులు టెక్నాలజీ పరంగా అప్డేట్ అవుతున్నట్టు తెలుస్తోంది. సెల్ఫోన్ల ఛార్జింగ్ సహా, టార్చ్లైట్ల ఛార్జంగ్లకు సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తైన విద్యుత్తు సహాయంతో వినియోగిస్తున్నట్టు వెల్లడయింది. దీంతోపాటుగా కొత్త ప్రదేశాలలో ముఖ్యంగా అటవీ ప్రాంతాలలో కంపాస్ సాయంతో దగ్గరి దారుల్లో తప్పించుకోవడం, సురక్షితమైన దారులను తమ ప్రయాణానికి ఎంచుకోడానికి ఈ స్మార్ట్ ఫోన్లు ఉపయోగపడుతున్నాయి. అయితే తాము ఉపయోగిస్తున్న స్మార్ట్ఫోన్లను పోలీసులు ట్రేస్ చేసే అవకాశం ఉండడంతో ఎక్కడికక్కడ అన్నట్టుగా వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. వీలైనంత మేరకు తమ ఉనికికి బయటపెట్టుకోకుండా సామాజిక మాధ్యమాల ద్వారా తమ భావజాల వ్యాప్తిని విస్తృతంగా చేపడుతున్నట్టు చెబుతున్నారు. వర్తమాన సమాజంలో ముఖ్యంగా యువతలో స్మార్ట్‌ఫోన్ వినియోగం బాగా పెరగడం వల్ల .. దాని ద్వారానే వారికి దగ్గరయ్యే విధంగా మావోయిస్టులు వ్యూహాలు రచిస్తూ, అమలు చేస్తున్నారు.
కూంబింగ్‌లో భద్రతా బలగాలు (ప్రతీకాత్మక చిత్రం)
భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాలలో జరిగిన ఎన్కౌంటర్లలో తప్పించుకున్న మావోయిస్టులను ఎట్టి పరిస్థితులలోనూ పట్టుకోవాలని, లేదంటే కనిష్టంగా వాళ్లను రాష్ట్రం నుంచి పారదోలాలని ఇప్పటికే ఈ రెండు జిల్లాల్లో పర్యటించిన రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఎన్ కౌంటర్లలో తప్పించుకున్న మావోయిస్టుల తలలపై భారీ మొత్తంలో రివార్డులు ఉండడంతో పట్టుకున్న వారికి, సమాచారం ఇచ్చిన వారికి రివార్డులు ఇస్తామంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. గతంలో ల్యాండ్‌మైన్స్, క్లెమోర్‌మైన్స్ లాంటివాటిని తయారు చేయడం, వినియోగించడం కోసమే ఉపయోగించిన టెక్నాలజీని ప్రస్తుతం మావోయిస్టులు 'స్మార్ట్' టెక్నాలజీని వాడుకోవడం కొత్త ఒరవడిగా చెప్పుకోవచ్చు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.