తెలంగాణలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. తెలంగాణ పోలీసు శాఖలో హోంగార్డును కొట్టి చంపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఛత్తీస్ గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో నాయకులపు ఈశ్వర్ అనే హోంగార్డును కొట్టి చంపారు. బాధితుడు ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన వాడు. హోంగార్డు ఈశ్వర్‌ను చంపిన తర్వాత ఆ మృతదేహాన్ని చర్ల మండలం చెన్నపురం దగ్గరలోని గొత్తికోయ గ్రామం గోరుగొండ దగ్గర వదిలి వెళ్లారు.
తెలంగాణలో ఈ నెలలోనే టీఆర్ఎస్ నేతను మావోయిస్టులు హత్య చేశారు. ములుగు జిల్లాలో టీఆర్ఎస్ నేత భీమేశ్వర్‌ను మావోయిస్టులు అతి కిరాతకంగా చంపేశారు. వెంకటాపురం మండలం... అలుబాకలో ఈ ఘటన జరిగింది. అర్థరాత్రివేళ భీమేశ్వర్ ఇంటికి వచ్చిన మావోయిస్టులు... అత్యవసరంగా డబ్బులు కావాలి... ఆస్పత్రికి వెళ్లాలి అంటూ... ఆయన్ని బయటకు రమ్మన్నారు. ఇంత రాత్రివేళ తన దగ్గర డబ్బులు లేవన్న భీమేశ్వర్... డోర్ తియ్యలేదు. దాంతో మావోయిస్టులు డోర్‌పై కాల్పులు జరిపి... భీమేశ్వర్‌ను బయటకు పిలిచారు. నిద్రమత్తులోనే ఆయన బయటకు వచ్చారు. ఆ తర్వాత మావోయిస్టులు ఆయన్ని దారుణంగా కత్తులతో పొడిచారు. తనను చంపొద్దని మీరు ఏం చెబితే అది చేస్తానని భీమేశ్వర్ వేడుకున్నా... మావోయిస్టులు ఆగలేదు. ప్రాణాలు తీసేశారు. ఈ దారుణం జరిగినప్పుడు భీమేశ్వర్ భార్య కూడా ఆ ఇంట్లో ఉన్నట్లు తెలిసింది.
ఈ హత్య ఎవరు చేశారో అని పోలీసులు ఎంక్వైరీలు చేయాల్సిన అవసరం లేదంటూ... తామే హత్య చేసినట్లుగా నిరూపించేందుకు ఘటనా స్థలంలో ఓ లేఖను వదిలి వెళ్లారు. ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల అంచనా ప్రకారం... ఈ దుశ్చర్యలో మొత్తం ఆరుగురు మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. తమ లేఖలో మావోయిస్టులు... టీఆర్ఎస్, బీజేపీ నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలని ఎప్పట్లాగే కొన్ని డిమాండ్లు చేశారు. అధికార పార్టీలో ఉంటూ... ప్రజలను దోచుకుంటున్నారని లేఖలో ఫైర్ అయ్యారు. తాము చెప్పినట్లు రాజీనామా చేయకపోతే... వారికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.
పది రోజుల క్రితం మావోయిస్టులు ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం షాపల్లి గ్రామంలో వాల్ పోస్టర్లు వేశారు. తెలంగాణ ప్రభుత్వం పోలీసు బలగాలతో అడవులను జల్లెడ పట్టడం ఆపాలని లేఖలో డిమాండ్ చేశారు. కూంబింగ్ లకు ఆపకపోతే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులకు భీమేశ్వరరావుకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. పలువురు ఫారెస్టు అధికారులు పద్ధతి మార్చుకోవాలని లేఖలో వార్నింగ్ ఇచ్చారు. కొత్త రెవెన్యూ చట్టం పేరుతో కేసీఆర్ చేసిందేమీ లేదంటూ ధ్వజమెత్తారు. అయితే ఆ లేఖ నకిలీదని పోలీసులు తెలిపారు.
తెలంగాణలో వారం రోజుల క్రితం జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట అటవీ ప్రాంతాల్లో ములుగు జిల్లా ప్రత్యేక బలగాలు, గ్రేహౌండ్స్ బలగాలతో కూంబింగ్ ఆపరేషన్ ను నిర్వహించాయి. మంగపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముసలమ్మ గుట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పులలో ఇద్దరు మగ మావోయిస్టులు మరణించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Maoists, Telangana, Telangana Police