(జి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా న్యూస్ 18 ప్రతినిధి)
ఎక్కడో కిలోమీటర్ల దూరం.. మామూలుగా చూస్తే మన కంటికి అందని దృశ్యం. చుట్టూతా కొండలు గుట్టలు.. ఎటు చూసినా కంటికి కనిపించినంత దూరమూ అడవే. మావోయిస్టులకు కేంద్ర స్థానంగా ఉన్న దట్టంగా ఉండే దండకారణ్యమే వారి బలం. ధైర్యం. మనుగడ. దాన్ని ఇప్పుడు పోలీసు బలగాలు సవాల్ చేస్తున్నాయి. వారి ఆనుపానులు.. కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోడానికి పోలీసులు అత్యాధునిక డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. తాపీగా మైదాన ప్రాంతంలో కూర్చొని ఓ డ్రోన్ కెమెరాను పంపుతున్నారు. అది ఏ దిక్కుగా ఎంత దూరం.. ఎంత ఎత్తున ప్రయాణించాలన్న దాన్ని కూర్చొన్న చోటు నుంచే మోనిటర్ చేస్తున్నారు. మావోయిస్టుల ఆనుపానులు దొరికిన ప్రాంతాన్ని జీపీఎస్‌తో అనుసంధానించి అక్షాంశరేఖాంశాల ఆధారంగా తమ లక్ష్యం అయిన మావోయిస్టులు ఎటు నుంచి ఎటు దారితీస్తున్నారు.. ఎంత మంది ఉన్నారు.. వారి చేతుల్లో ఉన్న ఆయుధాలు ఎలాంటివి.. బలం.. బలగం.. ఆయుధ సంపత్తి సైతం ఇప్పుడు పోలీసులకు సులువుగా.. పక్కాగా తెలిసే పరిస్థితి ఉంది.
తాజాగా పోలీసులు పెట్టిన నిఘాలో ఉలిక్కిపడే స్థాయిలో మావోయిస్టులు కనిపించారు. వందలాది మంది ఒక క్రమ పద్దతిలో వాగులు వంకలు దాటుతున్న దృశ్యాలు లభించాయి. ఎంతో ఎత్తు నుంచి డ్రోన్ కెమెరాలో చిత్రీకరించిన వీడియోలో మావోయిస్టులు చీమల దండులా బారుగా సాగుతున్నట్టు స్పష్టంగా కనిపించింది. వారంతా చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని సుక్మా, బీజపూర్, కిరండోల్ ప్రాంతాల నుంచి తెలంగాణ వైపుగా ప్రయాణిస్తున్నట్టు వారి ప్రయాణ దిశను బట్టి అంచనా వేస్తున్నారు. వందలాది మంది మావోయిస్టులు వాగు దాటుతున్న దృశ్యం మాత్రం సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలోడి అటవీప్రాంతంగా గుర్తించారు.
చత్తీస్‌ఘడ్‌లో నిత్యం ఎదురుకాల్పులతో నిర్బందం పెరిగిపోవడంతో వీరంతా తెలంగాణ రాష్ట్రం దిశగా సాగుతున్నట్టు భావిస్తున్నారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సుదీర్ఘంగా ఉన్న చత్తీస్ఘడ్ సరిహద్దు నుంచి మావోయిస్టులు ఎప్పుడైనా గోదావరి దాటే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు. తాకిడి ఎక్కువగా ఉండే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములుగు సహా గోదావరి తీర ప్రాంతంలో నిఘా పెంచారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల ఉనికి పలుమార్లు వెల్లడైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం, గుండాల, చర్ల పోలీసుస్టేషన్ల పరిధిలోనూ, కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లోనూ పరస్పర ఎదురు కాల్పులు జరగడం, భద్రాద్రి జిల్లాలో ఇప్పటికే ముగ్గురు మావోయిస్టులు మృతిచెందడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోలీస్ చీఫ్ మహేందర్‌రెడ్డి పలుమార్లు ఏజెన్సీలోని జిల్లాల్లో స్వయంగా పర్యటిస్తూ సమీక్షలు నిర్వహిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.