Corona to maoist : వ్యాక్సిన్‌ వేటలో మావోయిస్టులు.. మెడిసిన్స్‌ కోసం ప్రయత్నాలు.. ?

Corona to maoist : మావోయిస్టులు కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేటలో పడ్డారా..? తెలంగాణ నుంచి వీటిని రప్పించడానికి కొరియర్లను ఉపయోగిస్తున్నారా..? చికిత్సకు అవసరమైన మందులను తెప్పించుకుంటున్నారా..? అంటే అవుననే అంటున్నారు పోలీసులు.

Corona to maoist : మావోయిస్టులు కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేటలో పడ్డారా..? తెలంగాణ నుంచి వీటిని రప్పించడానికి కొరియర్లను ఉపయోగిస్తున్నారా..? చికిత్సకు అవసరమైన మందులను తెప్పించుకుంటున్నారా..? అంటే అవుననే అంటున్నారు పోలీసులు.

  • Share this:
జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్‌, న్యూస్‌18 తెలుగు,ఖమ్మం జిల్లాతాజాగా వరంగల్‌ పోలీసులకు దొరికిన దండకారణ్య స్పెషల్‌ జోన్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్‌ను విచారించిన పోలీసులకు ఈమేరకు కొత్త కొత్త విషయాలు తెలిశాయి. వాస్తవానికి గడ్డం మధుకర్‌ అలియాస్‌ శోభ్రాయ్‌ అలియాస్‌ మోహన్‌ చత్తీస్‌ఘడ్‌ నుంచి వైద్యం నిమిత్తం రహస్యంగా వస్తుండగా.. రహదారి తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. మధుకర్‌ వెల్లడించిన వాస్తవాలు చత్తీస్‌ఘడ్‌లోని కోవిడ్‌ వ్యాప్తి తీవ్రతను కళ్లకు కట్టింది. ఇప్పటికే టాప్‌ క్యాడర్లోని పన్నెండు మంది మావోయిస్టు నేతలకు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చినట్టు, మధుకర్‌ పేర్లతో సహా వరంగల్‌ సీపీ తరుణ్‌జోషి ఎదుట వెల్లడించారు.

దీంతో ఇప్పటిదాకా మైదాన ప్రాంతాలకు, ముఖ్యంగా పట్టణ, నగర ప్రాంతాలకే పరిమితం అయిందనుకున్న కరోనా వైరస్‌, అడవుల్లోకి, అదీ రహస్య కార్యకలాపాలు నిర్వహించే మావోయిస్టు పార్టీ క్యాడర్‌కు విస్తరించినట్టు వెలుగుచూసింది. మావో క్యాడర్ ‌లో ముఖ్యులు సహా పలువురు ఈ వైరస్‌ బారిన పడడంతో.. వ్యాక్సిన్‌ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. అవికూడా తెలంగాణ నుంచి తెప్పించేందుకు కొరియర్లను నియమించినట్టు.. ఇప్పటికే చికిత్సకు సంబంధించిన మందులు సైతం తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. ఇక క్యాడర్‌ ప్రాణాలను కాపాడుకోవడం కోసం మావోయిస్టు అగ్రనేతలు ఇంకొకడుగు ముందుకేసి, గ్రామీణ ప్రాంతాలలో సామాన్యుల్లా వెళ్లి వ్యాక్సిన్‌ వేయించుకుంటున్నట్టు చెబుతున్నారు. అలా వెళ్లలేని పరిస్థితులు, ఉద్యమంలో కీలకమైన వారి ఆరోగ్యం కోసం వ్యాక్సిన్‌ తెప్పించే ఏర్పాట్లలో ఉన్నట్టు వెల్లడైంది.

దట్టమైన దండకారణ్యం, వందల కిలోమీటర్ల వైశాల్యంతో ఉన్న సువిశాల ప్రాంతం. అక్కడక్కడా విసిరేసినట్టుండే గొత్తికొయలు సహా పలు గిరిజనవాసుల గూడేలు.. అప్పుడప్పుడు షెల్టర్‌ కోసం వచ్చే మావోయిస్టులు.. వారికోసం వెంటాడుతూ వచ్చే పోలీసు బలగాలు.. ఇదే అక్కడి సందడి. ఇక బయటి నుంచి సాధారణ పౌరులు ఆ ప్రాంతంలో సంచరించే పరిస్థితి ఉండదు. అందుకే అక్కడికి కరోనా వైరస్‌ పాకే పరిస్థితి అస్సలు ఉండదని అనుకుంటాం. కానీ ఇప్పుడక్కడ పరిస్థితి విషమించింది.

మేనెల మూడో వారంలో బీజపూర్‌ జిల్లా సిల్గేర్‌లో పోలీసులు ఏర్పాటు చేస్తున్న స్పెషల్‌ క్యాంపు వద్దంటూ మిన్నంటిన స్థానికుల నిరసనకు మావోయిస్టులు తోడయ్యారు. కొన్ని రోజుల పాటు సాగిన ఈ నిరసనల ఉధృతి కాల్పుల దాకా పోయింది. అయితే ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న మావోయిస్టు కీలక నేతలకు.. కరోనా వైరస్‌ వ్యాపించింది. అలా ఒకరి నుంచి ఒకరికి.. దాదాపు అందరికీ అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితి తయారైంది. దీన్ని తొలుత అంత సీరియస్‌గా తీసుకోని మావోయిస్టు అగ్రనేతలు, రోజులు గడిచేకొద్దీ మారుతున్న పరిస్థితులను అంచనా వేసి చికిత్స, నివారణపై దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. వీలైతే వ్యాక్సిన్, లేకుంటే చికిత్సకు అవసరమైన మందులు తెప్పించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటిదాకా మావోయిస్టులకు సాధారణ అలసరాలను తీరుస్తున్న కొరియర్లకే ఈ బాధ్యతను అప్పగించి, పొరుగునే ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి వ్యాక్సిన్‌ తెప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు వెల్లడైంది.
Published by:yveerash yveerash
First published: