జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్, న్యూస్18 తెలుగు, ఖమ్మం జిల్లా
మావోయిస్టులను ఎదుర్కొనేందుకు పోలీసులు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం వారి ప్రభావం భవిష్యత్ తరాలపై పడకుండా చర్యలు చేపట్టారు. ఇందుకోసం మావోయిస్టులు, వారి సానుభూతి పరులు నిర్మించుకున్న స్థూపాలను మట్టికుప్పలుగా మారుస్తున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న చత్తీస్ఘడ్ తోపాటు పలు ప్రాంతాల్లో మావోయిస్టుల స్మృతి చిహ్నాలు కూలిపోతున్నాయి. ఎక్కడికక్కడ శిధిలాలుగా మారిపోతున్నాయి. దశాబ్దాలుగా ఉద్యమంలో పనిచేసి వివిధ కారణాలతో మృతిచెందిన మాజీ నక్సల్స్ గుర్తుగా అక్కడక్కడా నిర్మించుకున్న స్తూపాలు విరిగిపోతున్నాయి.
ముఖ్యంగా సమాజం కోసం త్యాగం చేసిన వారిని స్మరించుకుంటూ మరో తరానికి స్ఫూర్తిగా ఉండడం కోసం విగ్రహాలు, స్తూపాలు నిర్మిస్తుంటారు. ఇలా కమ్యూనిస్టు పార్టీల్లో ఈ స్తూపాలు నిర్మించుకోవడం పరిపాటిగా ఉంటుంది. ఇంకాస్త ముందుకెళ్లిన నిషేధిత మావోయిస్టు పార్టీ తనకు ప్రాబల్యం ఉన్న చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విస్త్రుతంగా స్తూపాల నిర్మాణం చేపట్టింది. గతంలోని పీపుల్స్‌వార్ మొదలు, ఇప్పటి మావోయిస్టు పార్టీ, ఇంకా పార్టీ విస్త్రుతికి సహాయసహకారాలు అందించే మిలీషియాలో పనిచేసిన వాళ్లు చనిపోయినా గొప్పగా స్తూపాలు నిర్మించుకున్న దాఖలాలున్నాయి. ఆ పార్టీ దృక్కోణంలో త్యాగధనులుగా అభివర్ణిస్తూ, వారి సేవలను కీర్తిస్తూ కొత్త తరానికి స్ఫూర్తి దాయకంగా ఉండేలా చూడ్డానికి ఇలా చేస్తుంటారు. ఇలా మావోయిస్టు ప్రాబల్యం ఉన్న చత్తీస్ఘడ్ రాష్ట్రంలోనూ, సరిహద్దుల్లోని తెలంగాణ, ఆంధ్ర, ఒడిషా రాష్ట్రంలోనూ కొన్ని వేల సంఖ్యలో ఇలాంటి స్తూపాలు కనిపిస్తుంటాయి.
మరి ఇవి ఇలాగే ఉంటే సమకాలీన సమాజంలోని యువతకు ఎలాంటి సంకేతాలు వెళ్తుంటాయి..? సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే చత్తీస్ఘడ్ పోలీసులు దృష్టి సారించారు. ఉన్నఫళంగా వీటిని తొలగించే ప్రక్రియను మొదలుపెట్టారు. ఎక్కడికక్కడ ఈ స్తూపాలను నేలకూల్చడం, కనీసం ఆనవాళ్లు కూడా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వివిధ కారణాలతో టాప్ క్యాడర్లోని ముఖ్యులు మృతిచెందగా, పలు స్థాయుల్లోని మావోయిస్టు నాయకత్వం తమ ఉనికిని చాటుకోడానికి అవకాశం కోసం వేచిచూస్తున్న పరిస్థితి.
ఈ పరిస్థితుల్లో రిక్రూట్మెంట్లకు ఉపక్రమించాలన్న మావోయిస్టుల వ్యూహాన్ని ముందస్తుగానే నిర్వీర్యం చేసే ప్రక్రియలో భాగంగా పోలీసు ఉన్నతాధికారులు ఇలాంటి ఎత్తుగడకు సిద్ధమైనట్టు భావిస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఇలా స్తూపాల విధ్వంస ప్రక్రియను చేపట్టిన పోలీసులు మధ్యలో కొద్దికాలం పట్టించుకోలేదు. మళ్లీ కొన్ని రోజులుగా ఇదే పనిలో నిమగ్నమయ్యారు. కూంబింగ్ బృందాలకు తుపాకులతో పాటు, పలుగులు, పెద్దపెద్ద విధ్వంసకర సామగ్రిని ఇచ్చి పంపుతున్నారు. చత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో ఉన్న గోండెరాస్ గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ డీవీసీఎం వినోద్ స్మారక స్తూపాన్ని నిన్న పోలీసులు కూల్చివేశారు. వినోద్‌పై గతంలో పది లక్షల మేర రివార్డు ఉండేది. ఈయన తీవ్రమైన అనారోగ్యంతో మరణించడంతో మావోయిస్టు పార్టీ స్మారక స్తూపాన్ని నిర్మించింది.
అలాగే ఏసీఎంగా పనిచేసిన గుండాదుర్ పైన ఐదు లక్షల మేర రివార్డు ఉండగా, ఆయన ఎన్కౌంటర్లో మృతిచెందాడు. ఈయన పేరిట పార్టీ నిర్మించిన స్తూపాన్ని కూడా పోలీసులు నేలమట్టం చేశారు. ఇలా గ్రామాలు, గూడేల్లో ఉన్న స్తూపాలను ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తూ గిరిజనం మది నుంచి మావోయిస్టు క్యాడర్ గుర్తులను చెరిపేసే ప్రయత్నం చేస్తున్నట్టు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.