Home /News /telangana /

MAOIST SLAMS TELANGANA GOVT OVER SERIAL ENCOUNTERED IN BHADRADRI AGENCY SK

ఎన్‌కౌంటర్‌లపై మావోయిస్టుల ఆగ్రహం.. ఏజెన్సీలో యుద్ధ మేఘాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఒకేసారి మూడు ప్రాంతాల్లో మావోయిస్టు బాధ్యతలు చూస్తున్న బాధ్యులు వరుసగా ఒకేసారి బహిరంగలేఖలు విడుదల చేశారు.

  (జి.శ్రీనివాసరెడ్డి, న్యూస్ 18 ఖమ్మం కరెస్పాండెంట్)
  ఏజెన్సీలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం అందరినీ వెంటాడుతోంది. దండకారణ్యంలో మావోయిస్టుల ఆనవాళ్లు లేకుండా చేయాలన్న పట్టుదలతో ఇటు పోలీసులు, ఎలాగైనా తమ ఉనికిని చాటుకోవాలన్న కసితో మావోయిస్టులు ఉన్నట్టు తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. తెలంగాణను మావోయిస్టు ఫ్రీ స్టేట్‌గా రూపొందించాలన్న పాలసీతో ముందుకెళ్తున్న కేసీఆర్‌ ప్రభుత్వానికి ఈ మధ్య కాలంలో అక్కడక్కడా మావోయిస్టుల సంచారం, యాక్షన్‌ టీంలు రంగంలోకి దిగాయన్న సమాచారం ఇబ్బందిగా పరిణమించింది. గత జులై రెండో వారంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం పోలీసుస్టేషన్‌ పరిధిలోనూ.. అదే రోజు కొమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి పోలీసుస్టేషన్‌ పరిధిలోనూ ఒకేసారి పోలీసులకు, మావోయిస్టులకు పరస్పర ఎదురుకాల్పులు చోటుచేసుకోవడంతో ఆరేళ్ల నిశ్చబ్దం ఒక్కసారిగా బ్రేక్‌ అయింది. దీంతో అలర్ట్‌ అయిన పోలీసు ఉన్నతాధికారులు వరుస సమీక్షలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

  సాక్షాత్తూ రాష్ట్ర పోలీసు అధిపతి మహేందర్‌రెడ్డి ఇప్పటికే రెండుమార్లు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో హెలికాప్టర్‌ ద్వారా వచ్చి పరిస్థితులను సమీక్షించారు. గత వారంలో రెండోమారు ఆసిఫాబాద్‌ జిల్లాలో ఏకంగా రెండు రోజుల పాటు అక్కడే మకాం వేసి మరీ తాజా పరిస్థితులపై అన్ని విభాగాల పోలీసు అధికారులతో సమీక్ష చేశారు. ఒకవైపు ఆసిఫాబాద్‌ జిల్లాలో డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటిస్తుండగానే భద్రాద్రి కొత్తూగూడెం జిల్లాలో వరుసగా రెండు ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. గుండాల మండలంలో ఓ మావోయిస్టు కమాండర్‌ స్థాయి వ్యక్తి.. మరో నాలుగు రోజులకే చర్ల సమీపంలోని పూసుగుప్ప వద్ద మరో ఇద్దరు మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. కోవసి జోగాల్‌ అలియాస్‌ శ్రీను, మడకం ఐతులు పూసగుప్ప ఎన్‌కౌంటర్ లో మృతిచెందగా.. అది పక్కా బూటకపు ఎన్‌కౌంటర్‌ అంటూ మావోయిస్టులు ఆరోపిస్తున్నారు.

  ఈ విషయంలో ఒకేసారి మూడు ప్రాంతాల్లో మావోయిస్టు బాధ్యతలు చూస్తున్న బాధ్యులు వరుసగా ఒకేసారి బహిరంగలేఖలు విడుదల చేశారు. చర్ల- శబరి ఏరియా కమిటీ తరపున కార్యదర్శి అరుణ పేరిట.. ఇల్లందు- నర్సంపేట ఏరియా కమిటీ తరపున కార్యదర్శి శాంత పేరిట.. జయశంకర్‌, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, పెద్దపల్లి డివిజనల్‌ కమిటీ తరపున కార్యదర్శి వెంకటేష్‌ పేరిట , వెంకటాపురం- వాజేడు కమిటీ తరపున కార్యదర్శి సుధాకర్ పేరిట ఒకేరోజు ఒకే సమయానికి ఒకే విధమైన మ్యాటర్‌, ఒకే విధమైన స్పందనతో విడుదల చేశారు. కేసీఆర్‌ ఆధ్వర్యంలోని తెరాస ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని, ప్రజల తరపున పోరాటం చేస్తున్న మావోయిస్టులకు లక్ష్యంగా చేసుకుని బూటకపు ఎన్‌కౌంటర్లు సృష్టించి నిరాయుధులను చంపేస్తున్నారని ఆరోపించారు. పూసగుప్పలో జరిగిన ఘటనపై.. సరకులు తెచ్చానంటూ పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా మారిన ఓ వ్యాపారి ద్వారా కబురు పంపి, సరకులు తెచ్చుకోడానికి వెళ్లిన నిరాయుధులను పట్టుకుని చిత్రహింసలు పెట్టి మరీ చంపడాన్ని ఏమనాలంటూ లేఖలో ప్రశ్నిచారు.

  హక్కుల సంఘాలు స్పందించి నిజనిర్ధరణ చేయాలని, అమాయక ఆదివాసీ యువకులను కాల్చి చంపిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని లేఖలో బాధ్యులు పిలుపునిచ్చారు మావోయిస్టులు. ఈ మధ్య కాలంలో మావోయిస్టు ఉద్యమం తరపున ఎలాంటి స్పందన, లేఖలు వచ్చినా అధికార ప్రతినిధిగా జగన్‌ పేరిట రావడం ఉండేది. కానీ ఈ ఘటనపై ఒకేసారి తెలంగాణలోని అన్ని ఏరియాల కమిటీలు ఒకేసారి స్పందించడం విశేషంగానే చెప్పుకోవాలి. ఈ పరిస్థితుల్లో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్‌ కూడా మావోయిస్టు యాక్షన్‌ కమిటీల సంచారంపై చాలా సీరియస్‌గా దృష్టి సారించారు. గత వారం వ్యవధిలో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లను ఎస్పీ నేరుగా పర్యవేక్షించడమే కాకుండా.. ఘటనా స్థలికి గంటల వ్యవధిలోనే చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తూ పోలీసు బలగాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. మొత్తంమీద గత ఆరేళ్లుగా ప్రశాంతంగా ఉన్న భద్రాచలం ఏజెన్సీ, తెలంగాణ- చత్తీస్‌ఘడ్‌, ఆంధ్ర- తెలంగాణ, తెలంగాణ- ఒడిషా బోర్డర్లలో ఉద్రిక్త పరిస్థతులు నెలకొన్నాయి. గత వారంలో మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చినా పెద్దగా ప్రభావం లేకుండా చూడడంలో పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడిప్పుడే ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఏజెన్సీ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని భావించే సమయంలో మళ్లీ బందూకుల చప్పుళ్లు ఇక్కడి ఆదివాసీల జీవనంపై తీవ్ర దుష్ప్రభావం చూపనుంది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Maoists, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు