తెలంగాణలో (Telangana)ని చాలా ప్రాంతాలపై చలి (Winter) పులి పంజా విసిరింది. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ (Hyderabad) నగరంలో చలి విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరాల భారిన పడుతున్నారు. అంతేకాదు చలి పెరిగి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అనేక అనారోగ్యాల భారిన పడుతున్నారు. కోవిడ్ తగ్గినప్పటికీ చలి (Cold wave) కారణంగా ప్రజలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, సీజనల్ జ్వరాలు, అస్తమా, అలెర్జీలతో ఇబ్బంది పడుతున్నారు. చలి పెరిగే కొద్దీ ఈ రోగాలతో జనం ఆస్పుత్రుల పాలవుతున్నారు.
చలి ప్రభావం సాధారణంగా ఫిబ్రవరి చివరి వరకు కొనసాగుతుంది. తరవాత క్రమంగా తగ్గిపోతుంది. రాబోయే కొద్ది రోజుల్లో ఉష్ణోగ్రతలు పడిపోయి, చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ నగరంతోపాటు, ఉత్తర తెలంగాణలో చాలా ప్రాంతాల్లో రాబోయే కొద్ది రోజుల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా హెచ్చరించింది. చలి పెరగడంతో వెంటాడే జబ్బులపట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
గత సంవత్సరం శీతాకాలంలో కోవిడ్ పాజిటివ్ కేసులతో వైరల్ ఇన్ఫెక్షన్లు వ్యాపించాయి. అయితే ఈ శీతాకాలంలో సీజనల్ ఫ్లూ, శ్వాసకోశ వ్యాధులు ప్రభావం చూపుతున్నాయి. వీటికితోడు జ్వరం, న్యుమోనియా, శ్వాసనాళాల వాపు కేసులు పెరిగిపోతున్నాయి. గర్భిణీలు, పిల్లలు అనారోగ్య పరిస్థితులు ఉన్న వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అలాంటి వ్యక్తులు బయటకు వెళ్లే సమయంలో మాస్క్ ధరించడం మంచిదని హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె శంకర్ చెప్పారు.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. రిజర్వేషన్లు ప్రారంభం..
శీతాకాలంలో చల్లని గాలి ఆస్తమాను ప్రేరేపిస్తుంది. ఆస్తమా రోగుల్లో, శ్వాసనాళాల పొర ఉబ్బి, శ్వాసనాళాలు కుంచించుకుపోతాయి. కఫం ఏర్పడటం వల్ల కూడా శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఆస్తమా రోగులకు చలి మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది. ఆస్తమాకు దీర్ఘకాలిక చికిత్స అవసరమవుతుంది. ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు ఇన్హేలర్లు కొంత రిలీఫ్ ఇస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఆస్తమా సమస్యలతో బాధపడుతున్న పిల్లలు, పెద్దలు ఇన్హేలేషన్ థెరపీని అనుసరించాలని వారు సూచిస్తున్నారు. డాక్టర్ల సలహాలు, సంప్రదింపులు లేకుండా ఉబ్బసం చికిత్సను ఆపకూడదని హైదరాబాద్ ఛాతీ ఆసుపత్రి సూరింటెండెంట్ మహబూబ్ ఖాన్ సూచించారు.
చలికాలం అలర్జీలు ఎక్కువవుతుంటాయి. సాధారణంగా చలికాలం 40 శాతం వరకు ఇటువంటి కేసులు పెరుగుతాయి. వీటిలో ఎక్కువ భాగం దుమ్ము, పురుగులు నుండి అలెర్జీలు వస్తాయి. శరీరం పొడిబారడం, దురద, ఎరుపు దద్దుర్లు కలిగించే చర్మ వ్యాధిని అలర్జీ అనవచ్చు. చలికాలంలో కిటికీలు మూసి ఉన్న ఇళ్ళులో వెంటిలేషన్ సమస్య ఏర్పడుతుంది. ఇది శిలీంధ్రాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. చల్లటి గాలి కూడా అలెర్జీలను పెంచుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే చలిగాలి తగలకుండా సరైన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.