Home /News /telangana /

MANIPULATIONS IN THE RECRUITMENT OF JOBS IN THE NIRMAL DISTRICT MUNICIPAL DEPARTMENT SNR ADB

Telangana: అక్కడ సర్కారు కొలువులు స్వలాభం చూసుకొనే భర్తీ చేశారంటా..ఏ శాఖలో అంటే

(స్వలాభం కోసమే పోస్ట్‌ల భర్తీ)

(స్వలాభం కోసమే పోస్ట్‌ల భర్తీ)

Nirmal:నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలోని పారిశుద్ధ్య విభాగంలో చేపట్టిన ఉద్యోగ నియామక ప్రక్రియలో అవినీతి గుప్పుమంది. ప్రజా ప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై అర్హులకు దక్కాల్సిన ఉద్యోగాలను ఆప్తులకు, డబ్బులు ముట్టజెప్పినవారికి కట్టబెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  (K.Lenin,News18,Adilabad)
  దేశంలోనే అవినీతి లేని రాష్ట్రం తెలంగాణ (Telangana)అని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla kavitha) ఈ మధ్య ఓ కార్యక్రమంలో సెలవిచ్చారు . అంతలోనే నిర్మల్(Nirmal)మున్సిపల్ కార్యాలయంలోని పారిశుద్ద విభాగంలో చేపట్టిన ఉద్యోగ నియామక ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవహారం తీవ్ర దుమారం లేపుతోంది. రాత్రికి రాత్రి ఇక్కడి మున్సిపల్  కమిషనర్‌(Municipal Commissioner)‌ను బదిలీ చేయడంతో ఈ ఆరోపణలకు మరింత బలం చేకురుతోంది. ఏడవ తరగతి అర్హత ఉన్న పబ్లిక్ హెల్త్ వర్కర్లు(Public Health Workers), ఆఫీస్‌ సబార్డినెంట్స్ (Office Subordinates), స్వీపర్(Sweeper)ఉద్యోగాలకు ఏకంగా ఇంటర్(Inter)డిగ్రీ(Degree)అర్హత ఉన్న 44 మంది అభ్యర్థులతో ఉద్యోగాల ప్రక్రియ పూర్తి చేశారు. ఇందులో 50 శాతం ఉద్యోగాలను మున్సిపల్ చైర్మన్ , కౌన్సిలర్లు, మున్సిపాలిటీ ఉద్యోగులు అంతా కలిసి తమ బంధువులకే కట్టబెట్టినట్లు  తెలుస్తోంది.

  అడ్డదారిలో ఉద్యోగాల భర్తీ..
  అర్హత కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలిచి వెనక్కి పంపించడమే కాకుండా చివరికి వారి పేర్లను జాబితాలో లేకుండా చేసినట్టు సమాచారం. నియామకాల విషయంలో బంధుప్రీతి చూపించినప్పటికి 44 పోస్టులకు ఒక్కో పోస్ట్‌కు 6 లక్షల నుండి 10 లక్షలు డిమాండ్ పలకగా ఓ ఆఫీస్ సబార్డినెట్ పోస్ట్‌ను చైర్మన్ బంధువు 14 లక్షలకు దక్కించున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఉపాధి కల్పన విభాగం అధికారులు కూడా అవాక్కయ్యారు. నిర్మల్ మున్సిపాలిటీలో అర్హత కలిగిన నిరుద్యోగులకు దక్కాల్సిన పారిశుద్ధ్య విభాగంలోని 44 ఉద్యోగాలను అధికారబలం, అర్ధబలం చూసుకొని కొంత మంది ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు కలిసి పంచుకున్నారు. అర్హులకు మొండి చేయి చూపారు.

  (స్వలాభం కోసం ఉద్యోగాల భర్తీ)
  (స్వలాభం కోసం ఉద్యోగాల భర్తీ)


  అధికారులు,నేతల అనుయాయులకే ..
  పీహెచ్ డబ్ల్యూ విభాగంలోని హెల్త్ వర్కర్, స్వీపర్, వాచ్ మెన్, క్లీనర్,  ఆఫీస్ సబార్డినెట్ పోస్ట్‌లను ఆ శాఖలోని ఉద్యోగులతో పాటు కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ కుమ్మక్కై తమ బందువులకు కట్టపెట్టుకున్నట్టుగా తేలింది. గత ఏడాది డిసెంబర్ 18న నిర్మల్ మున్సిపల్ కమిషనర్  ఎల్ఆర్సీసీ1/393/2021 ఆధారంగా మున్సిపల్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న 44 కింది స్థాయి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి అర్హత కలిగిన 880 మంది అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ ఉద్యోగాల భర్తీకి కాల్ లెటర్స్ కూడా పంపించారు. రోస్టర్ ప్రతిపాదికన మెరిట్ కం రిజర్వేషన్ ప్రకారం అధికారులు ఈ యేడాది ఫిబ్రవరి 14న  కలెక్టరేట్ లో ఇంటర్వూలు కూడా నిర్వహించారు. ఇంత వరకు ఉద్యోగ నియామకాల విషయంలో సవ్యంగానే జరిగింది.

  అర్హులకు మొండిచేయి..
  ఆ తర్వాతే ట్విస్ట్ బయటపడింది. ఇంటర్వ్యూలకు హజరైన వారిలో ఏ ఒక్క అభ్యర్థికి కూడా అవకాశం ఇవ్వకుండా 44 పోస్టులను అనర్హులతో భర్తీ చేశారనే ఆరోణలు వెల్లువెత్తున్నాయి. ఈ 44 మందిలో 28 మంది ఉపాధి కల్పన విభాగంలో నమోదు చేసుకున్న అభ్యర్థులు కాదని, తమకు ఈ ఉద్యోగాల భర్తీ పూర్తయినట్టుగా మున్సిపల్ శాఖ నుండి ఎలాంటి సమాచారం అందలేదని చెపుతున్నారు ఉపాది కల్పన అధికారి. ఈవ్యవహారం పై నిర్మల్ ఇంచార్జ్ మున్సిపల్ కమిషనర్ గా కొనసాగుతున్న భైంసా మున్సిపల్ కమిషనర్ అలీ మాత్రం తనకు ఎలాంటి వివరాలు తెలియవని పేర్కొంటున్నారు.

  తిలా పాపం తలా పిరికెడు..
  ఒప్పంద ప్రాతిపదికన భర్తీ అయిన ఈ ఉద్యోగాలకు లక్షల్లో సొమ్ము చేతులు మారడం నిర్మల్ మున్సిపాల్టీలో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి పై బదిలీ వేటు పడింది.  ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఎంత,  ఎవరెవరికి ఎంతెంత ముట్టాయన్నది  తేలాల్సి ఉంది. భారీ ఎత్తున జరిగిన అక్రమాలపై విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలనే డిమాండ్ చేస్తూ బిజెపి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. అడ్డదారిన నియమించిన వారిని తొలగించి అర్హులైన నిరుద్యోగులతో ఈ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Govt Jobs 2022, Nirmal district

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు