(కట్టా లెనిన్, న్యూస్ 18 తెలుగు, ఆదిలాబాద్ జిల్లా)
మంచిర్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరుగురి సజీవ దహనం కేసు మిస్టరీ వీడింది. మందమర్రి మండలం గుడిపల్లి గ్రామంలో జరిగిన ఆరుగురు వ్యక్తుల సజీవ దహనం కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పెట్రోల్ కోసం వాడిన క్యాన్లు, మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. సజీవ దహనం ఘటనలో మృతి చెందిన సింగరేణి కార్మికుడు శాంతయ్య భార్య సృజనతో పాటు మరో నలుగురు అరెస్టైన వారిలో ఉన్నారు. ముగ్గురు నిందితులను మంచిర్యాల ఓవర్ బ్రిడ్జి వద్ద అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు నిందితులను శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద అరెస్టు చేశారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంచిర్యాలలోని డిసిపి కార్యాలయంలో రామగుండం పోలీస్ కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సింగరేణి కార్మికుడు శనిగరం శాంతయ్య భార్య శనిగరం సృజన లక్షెట్టిపేట పట్టణానికి చెందిన డాక్యుమెంట్ రైటర్ మేడి లక్ష్మణ్‌తో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. సృజన భర్త శనిగరం శాంతయ్య గుడిపల్లి గ్రామానికి చెందిన మాసు పద్మ అనే వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. సింగరేణి ఉద్యోగం ద్వారా వచ్చిన డబ్బుతో పాటుగే భూమి అమ్మగా వచ్చిన డబ్బులను.. తన ప్రియురాలు పద్మకే ఇస్తున్నాడని శనిగరం శాంతయ్య భార్య సృజన పగపెంచుకుంది.
ఎలాగైనా భర్త శాంతయ్యను, పద్మను హత్య చేయడానికి మేడి లక్ష్మణ్‌తో కలిసి ప్రణాళిక రూపొందించుకున్నారు. సృజన భర్త శాంతయ్య, అతని ప్రియురాలు పద్మను హత్య చేసేందుకు... సృజన, లక్ష్మణ్, సృజన తండ్రి అంజయ్య, రమేష్ అనే మరో వ్యక్తి కలిసి పథకం పన్నారు. వారి గురించి సమాచారం అందించేందుకు సమ్మయ్య అనే వ్యక్తిని పెట్టుకున్నారు. ఈ ఐదుగురు నిందితులు కలిసి బొలెరో వాహనంతో రెండుసార్లు ఢీ కొట్టి చంపే ప్రయత్నం చేసినప్పటికీ విఫలమయ్యారు. ఒకసారి కత్తులు కొనుగోలు చేసి పొడిచి చంపుదామని విరమించుకున్నారు.
నాలుగోసారి శాంతయ్య, పద్మ, పద్మ భర్త శివయ్య, పద్మ అక్క కూతురు మౌనిక వారి పిల్లలు స్వీటీ హిమబిందులు ఆరుగురు ఇంట్లో నిద్రిస్తుండగా పెట్రోల్‌ను ఇంట్లోకి పోసి తలుపులు వేశారు. ఆ తర్వాత నిప్పుపెట్టినట్లు.. నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. నిందితులకు సమాచారం ఇచ్చే వ్యక్తి.. మద్యం మత్తులో ఇంట్లో ఆరుగురు ఉంటే.. ముగ్గురే ఉన్నారని చెప్పడంతో నిందితులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. కాని అభం శుభం తెలియని ఇద్దరు అమాయక పిసిపిల్లలతో పాటు నలుగురు అగ్నికి ఆహుతయ్యారు. వివాహేతర సంబంధాలు, ఆస్తి తగాదాలే ఈ ఘటనకు కారణమని వెల్లడైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fire Accident, Mancherial, Telangana