తెలంగాణలో ఊరు ఊరు మొత్తాన్ని అమ్మేశాడు.. ఇళ్లు, కుటుంబాలు..

ప్రతీకాత్మక చిత్రం

నూతనంగా ఏర్పడిన ఎల్లమ్మతండా గ్రామ పంచాయతీ పరిధిలో బూరుగిద్ద గ్రామం ఉన్నట్లు గ్రామ పంచాయతీ రికార్డుల్లో ఉంది. 13 కుటుంబాల వారు ప్రతీ సంవత్సరం ఇళ్ల ట్యాక్సులు, నెలనెలా నల్లా బిల్లులు, కరెంటు బిల్లులు చెల్లిస్తున్నారు.

  • Share this:
    (మహేందర్, నిజామాబాద్ కరస్పాండెంట్, న్యూస్‌18)

    ఇది ఒక చిన్న ప‌ల్లె. ఇక్క‌డ‌ 13 కుటుంబాలు నివాసముంటున్నాయి. 30 ఏళ్లుగా ఇక్క‌డే ఉంటూ జీవ‌నం సాగిస్తున్న గడ్డతో పేదలు అనుబందాన్ని పెంచుకున్నారు. మూడు దశాబ్దాల కిందట ఆ ఊరు వెలిసింది. అప్పట్లో పూరిళ్లు నిర్మించుకున్నారు. తరువాత పక్కా ఇళ్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారు. పంచాయతీకి పన్నులు కూడా చెల్లిస్తున్నారు. కానీ ఇప్పుడెవరో వ‌చ్చి ఇది మా భూమి అంటున్నారు. మీరు ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్న‌ భూమిని మేం కొనుగోలు చేశాం. వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోండి. లేదంటే జేసీబీలతో ఇళ్లను నేలామ‌ట్టం చేస్తామ‌ని దబాయిస్తుండటంతో ఆ ఊరు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని బూరుగిద్ద ఊరు ఇప్పుడు అంగడి సరుకైంది. ఓ చర్చి ఫాదర్ కార‌ణంగా వెలిసింది ఈ గ్రామం. 1972లో లింగంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కామారెడ్డి– ఎల్లారెడ్డి రాష్ట్ర రహదారి పక్కన ఓ ఫాదర్‌ చర్చిని నిర్మించారు. నల్లగొండ జిల్లా నుంచి మూడు దశాబ్దాల కిందట 13 కుటుంబాలు వచ్చి చర్చి పక్కనే గుడిసెలు వేసుకొని జీవనం సాగించాయి.

    అప్పట్లో చర్చి ఆలనాపాలనా చూసే మారయ్య అనే ఫాదర్‌ ఈ నిరుపేదలకు ఇళ్లు కట్టించాలని భావించారు. లింగంపల్లి గ్రామానికి చెందిన పిట్ల కాశయ్య నుంచి చర్చి పక్కన గల సర్వే నెం.311లో 29 గుంటల భూమిని కొన్నారు. వేయి రూపాయలకు కొనుగోలు చేసి తెల్లకాగితం పై సాదా బైనామా రాసుకున్నారు. ఆ భూమిలో 1987లో 13 కుటుంబాలకు పెంకుటిళ్లు కట్టించారు. అప్పటి నుంచి వీరు గ్రామ పంచాయతీలో ఇంటి ప‌న్నుక‌డుతున్నారు.. జోసఫ్‌ ఫాదర్‌ క్రిస్టియన్‌ మిషన్‌ నుంచి రూ.45 వేలు, హౌజింగ్‌ కార్పొరేషన్ నుంచి రూ.18 వేల చొప్పున రుణం తీసుకొని ఈ 13 కుటుంబాలకు 1998లో ఆర్‌సీసీ భవనాలు నిర్మించి ఇచ్చారు. ప్రస్తుతం బూరుగిద్ద హామ్లెట్ విలేజ్ గా ఎల్లమ్మతండా గ్రామం పరిధిలో ఉంది.

    కామారెడ్డి జిల్లాలో బూరగిద్ద గ్రామం


    చర్చికి సమీపంలోనే సర్వే నెం.336లో ఓ వ్యక్తికి 14 గుంటల భూమి ఉంది. ప్రస్తుతం 13 కుటుంబాలు ఇళ్లు కట్టుకుని బతుకుతున్న సర్వే నెం.311లోని 29 గుంటల భూమిని 2014లో ఆ వ్యక్తి తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి ఇటీవల ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి 29 గుంటల భూమిని విక్రయించాడు. లింగంపేట తహసీల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. కొనుగోలు చేసిన వ్యక్తి రెండు రోజులుగా బూరుగిద్ద గ్రామానికి వెళ్లి ఇళ్లు ఖాళీ చేయాలని స్థానికులను దబాయిస్తున్నాడు. లేదంటే జేసీబీతో కూల్చివేస్తామని హెచ్చరించాడు. దాంతో దశాబ్దాలుగా స్థిర నివాసం ఉంటున్న గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు.

    తమ గతేంటంటున్న బూరగిద్ద వాసులు


    లింగంపేట తహసీల్దార్‌ నారాయణకు గ్రామస్తులు విషయాన్ని వివరించగా, సదరు 29 గుంటల భూమిలో ఊరు, ఇళ్లు ఉన్న విషయం తనకు తెలియదన్నారు. తమ రికార్డుల్లో వ్యవసాయ భూమిగా నమోదై ఉందని చెప్పారు. పాత పట్టాదారు వారసులు అమ్మకున్నా 29 గుంటల భూమిని ఎవరు రిజిస్ట్రేషన్‌ చేయించి ఇచ్చారని గ్రామస్తులు అధికారులను నిలదీస్తున్నారు.

    గతంలో తాము చెల్లించిన పన్నుల రసీదులను చూపుతున్న గ్రామస్తులు


    రెవెన్యూ రికార్డుల ప్రకారం లింగంపల్లి శివారులోని సర్వే నెం.311లో 29 గుంటలు పట్టాభూమిగా ఉందని లింగంపేట్ త‌హ‌సీల్ధార్ నారాయ‌ణ తెలిపారు. పది రోజుల కిందటే కొండి ప్రసాద్‌ అనే వ్యక్తి మీసేవలో స్లాట్‌ బుక్‌ చేసుకోగా, మేము రిజిస్ట్రేషన్‌ చేశాం. మరుసటి రోజు గ్రామస్తులు వచ్చి 40 ఏళ్లుగా నివాసం ఉంటున్నాం. మీరెలా రిజిస్ట్రేషన్‌ చేశారని ప్రశ్నించడంతో సర్వే నెం.311లో 29 గుంటలు సాగు భూమిగా పట్టా ఉన్నట్లు రికార్డులు చూపించాం. ఇంతకు మించి మా పరిధిలో ఏమీ లేదు. సివిల్‌ సూట్‌ వేసుకుంటే కోర్టు ఆదేశాలతో పట్టాను నిలిపి వేయవచ్చన్నారు.

    గతంలో తాము చెల్లించిన పన్నుల రసీదులను చూపుతున్న గ్రామస్తులు


    40 ఏళ్లుగా పుట్టి పెరిగిన గ్రామాన్ని తమకు తెలియకుండా కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడంతో మా బతుకులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఇదేమిటని అధికారులను ప్రశ్నిస్తే మాకు తెలియదని చెబుతున్నారు. అసలు మీ గ్రామం రెవెన్యూ రికార్డుల్లోనే లేదంటున్నారు. ఏళ్లుగా ఇంటి ప‌న్ను, నీళ్ల బిల్లులు, కరెంటు బిల్లు చెల్లిస్తున్నాం. మా పిల్లల స్కూల్‌ రికార్డుల్లో బూరుగిద్ద అని ఉంటుంది. అధికారులేమో ఊరేలేదని చెప్పడం విడ్డూరంగా ఉంది. మా సమస్యకు అధికారులే పరిష్కారం చూపాలి. లేదంటే ఆత్మహత్యలే శరణ్యం అంటున్న గ్రామాస్తులు.

    నూతనంగా ఏర్పడిన ఎల్లమ్మతండా గ్రామ పంచాయతీ పరిధిలో బూరుగిద్ద గ్రామం ఉన్నట్లు గ్రామ పంచాయతీ రికార్డుల్లో ఉంది. 13 కుటుంబాల వారు ప్రతీ సంవత్సరం ఇళ్ల ట్యాక్సులు, నెలనెలా నల్లా బిల్లులు, కరెంటు బిల్లులు చెల్లిస్తున్నారు. పిట్ల కాశయ్య పేరుపై సర్వే నెం.311లో 29 గుంటల భూమి ఉంది. ఆయన చనిపోయాక, వారసులు ఇప్పటివరకు సదరు భూమిని ఎవ్వరికీ అమ్మలేదు. వారసులకు తెలియకుండా భూమి ఎలా రిజిస్ట్రేషన్‌ చేశారనే విష‌యం తెలియ‌ద‌ని ఎల్లమ్మతండా స‌ర్పంచ్ అన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: