Telangana: కుల బహిష్కరణ చేశారనే మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య.. కలకలం రేపుతున్న సెల్ఫీ వీడియో..

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. కుల బహిష్కరణ చేశారని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

 • Share this:
  తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. కుల బహిష్కరణ చేశారని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆత్మహత్యకు ముందు అతడు రికార్డు చేసిన వీడియో స్థానికంగా కలకలం రేపుతోంది. తన చావుకు ముగ్గురు కులపెద్దలే కారణమని ఆత్మహత్య చేసుకున్న యువకుడు ఆ వీడియోలో ఆరోపించాడు. వివరాలు.. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండ‌లం ముస్లాపూర్‌ గ్రామానికి చెందిన శంకర్ కుటుంబాన్ని ఇటీవల ముగ్గురు కుల పెద్దలు గ్రామం నుంచి బహిష్కరించారు. పంచాయతీ పెట్టి మరి కులం నుంచి బహిష్కరిస్తున్నట్టు చెప్పారు. అంతేకాకుండా శంకర్ కుటుంబానికి గ్రామస్తులు ఎవరైనా సహకరిస్తే జరిమానా విధిస్తామంటూ హెచ్చరించారు. ఈ ఘటనపై శంకర్ జనవరి 6న అల్లాదుర్గ్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లితే పోలీసులు సరైన సమాధానం ఇవ్వకపోవడం, దురుసుగా ప్రవర్తించడంతో తీవ్ర మనస్తాపం చెందాడు.

  ఈ క్రమంలోనే సోమవారం అర్ధరాత్రి వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు మృతుడు శంకర్ ఓ సెల్ఫీ వీడియోలో తన బాధను, తనకు జరిగిన అన్యాయాన్ని, అందుకు ఎవరెవరు కులపెద్దలు కారణమో, పోలీసులు ఎలా రియాక్టయ్యారో వివరించాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  ఇక, మంగళవారం ఉదయం శంకర్ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న అల్లాదుర్గం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలంలో మృతుడి సెల్‌ఫోన్, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
  Published by:Sumanth Kanukula
  First published: