భారతీయులకు ఇష్టమైన ఇలవేల్పు శ్రీరాముడికి సంబంధించి అత్యంత ప్రాశస్త్యం కలిగిన భద్రాచలం పట్టణానికి రైలు మార్గం అనేది తరతరాలుగా ప్రజలు ఎదురుచూస్తోన్న ముఖ్యాంశం. ప్రపంచం నలుమూలల నుంచి సీతారామచంద్రస్వామి సందర్శనకు వచ్చే భక్తులకు అనువుగా, ఆదివాసీ ప్రాంతంలో మెరుగైన రవాణా సౌకర్యాలకు వీలుగా భద్రాచలానికి ట్రాక్ వేసి రైలు నడుపుతామని చెప్పని ప్రభుత్వాలు, మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టని పార్టీలంటూ లేవు. ఈ క్రమంలోనే కొవ్వూరు-భద్రాచలం లైన్ పురుడుపోసుకుంది. కానీ దశాబ్దాలు గడుస్తున్నా దానికి మోక్షం దొరకలేదు. అయితే ఇప్పుడు, ఎట్టకేలకు రాములోరి సన్నిధికి రైలు రాకకు మార్గం దాదాపు సుగమమం అయింది. ఒడిశా వైపు నుంచి తెలంగాణలోని భద్రాలచలానికి రైలు మార్గం నిర్మాణం ప్రాజెక్టుపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక సమీక్ష చేశారు. పూర్తి వివరాలివే..
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా పేరుపొందిన భద్రాచలానికి రైలు సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఒడిశా–తెలంగాణ మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణం కానుంది. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి తెలంగాణలోని భద్రాచలం వరకు ఇది ఏర్పాటుకానుంది. రెండు రాష్ట్రాల్లోని మారుమూల గిరిజన ప్రాంతాలను అనుసంధానిస్తూ ఈ కొత్త లైన్ వేయనున్నారు. గిరిజన ప్రాంతాలకు రవాణా వసతిని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణం కానున్నట్టు రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రాజెక్టుపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం నాడు కీలక సమీక్ష నిర్వహించారు.
రూ.2,800కోట్లు.. 213బ్రిడ్జిలు..
ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి తెలంగాణలోని భద్రాచలం వరకు మొత్తం 173.416 కిలోమీటర్ల నిడివి ఉండే ఈ లైన్ నిర్మాణానికి రూ.2,800 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. నదులు, వాగులు వంకలు ఉన్న నేపథ్యంలో ఈ మార్గంలో ఏకంగా 213 వంతెనలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. వీటిల్లో 48 భారీ వంతెనలు ఉన్నాయి. గోదావరి నదిపై భారీ వంతెన కూడా ఇందులో భాగంగా నిర్మించనున్నారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వే ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు గతేడాది సెప్టెంబర్‌లో రైల్వే బోర్డు పచ్చజెండా ఊపింది. ఇటీవలి బడ్జెట్లో ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్) కోసం రూ.3 కోట్లు ప్రతిపాదించారు. ఈ మేరకు మొదలైన సర్వే జూన్ నాటికి పూర్తి కానుంది. సర్వే నివేదికను పరిశీలించి రైల్వే బోర్డు అనుమతి ఇవ్వగానే పనులు ప్రారంభించనున్నారు.
తెలంగాణలోకి ఇలా..
ఒడిశాలోని జేపూర్ నుంచి మల్కన్‌గిరికి గతంలో రైల్వే లైన్ మంజూరు కాగా, ప్రస్తుతం ఆ పనులు సాగుతున్నాయి. దాన్ని మరింత విస్తరించే క్రమంలో, ఈ కొత్త మార్గానికి ఈస్ట్‌కోస్ట్ రైల్వే ప్రతిపాదనలు రూపొందించింది. కొత్త లైన్ ఒడిశాలోని మల్కన్‌గిరి, బదలి, కోవాసిగూడ, రాజన్‌గూడ, మహారాజ్‌పల్లి, లూనిమన్‌గూడల మీదుగా తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. కన్నాపురం, కుట్టుగుట్ట, పల్లు, నందిగామ, భద్రాచలం వరకు సాగుతుంది. ఇప్పటికే ఉన్న భద్రాచలం – పాండురంగాపురం లైన్‌తో దీనిని అనుసంధానించనున్నారు. మొత్తంగా 12 స్టేషన్లను అనుసంధానం చేస్తూ ఈ రైలు మార్గం ఏర్పాటుకానుంది.
మారనున్న రూపురేఖలు..
ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో రైల్వే శాఖ కొంతకాలంగా సరుకు రవాణాకు బాగా ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో, గిరిజన ప్రాంతంలో రూపురేఖల మార్పునకు అవకాశం కలిగిన భద్రాచలం రైల్వే లైనును కూడా సరుకుల రవాణాకే వినియోగిస్తారా? అంటే ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని, ప్రయాణికుల రైళ్ల కోసమే దీనిని నిర్మిస్తున్నట్లు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సింగరేణి సంస్థతోతో కలిసి సంయుక్తంగా భద్రాచలం–సత్తుపల్లి లైన్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఇది కేవలం బొగ్గు తరలింపును దృష్టిలో పెట్టుకునే నిర్మిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా చేపట్టబోయే మల్కన్‌గిరి–భద్రాచలం మార్గాన్ని ప్రస్తుతానికి ప్రయాణికుల రైళ్ల కోసమే మొదలుపెట్టి, రాబోయే రోజుల్లో సరుకు రవాణాకు కూడా వినియోగించే అవకాశం ఉంది.
భద్రాచలానికి రైలుపై మంత్రి రివ్యూ..
రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం మల్కన్‌గిరి ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఈస్ట్‌కోస్ట్ రైల్వే అధికారులు ఆయనకు మల్కన్‌గిరి–భద్రాచలం లైన్ పురోగతిని మ్యాప్‌ల సాయంతో వివరించారు. కొత్తలైన్ పనులు వీలైనంత త్వరగా చేపట్టేలా సర్వేలో వేగం పెంచాలని మంత్రి సూచించారు. దశాబ్దాలుగా భద్రాచలానికి రైలు కోసం ఎదురుచూస్తోన్న రామభక్తులు, జిల్లా వాసులకు రైల్వే మంత్రి రివ్యూ, అనంతరం వెలువడిన ప్రకటనలు శుభవార్తలుగా మారాయి. మరి పనులు ఎంత వేగంగా జరుగుతాయో చూడాలి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadrari kothagudem, India Railways, Odisha, Railway passengers, Telangana