ఆదాయానికి మించి ఆస్తులు కేసులో అరెస్టైన మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డిపై వేటు పడింది. ఆయన్ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నరసింహారెడ్డి స్థానంలో మల్కాజిగిరి ఏసీపీగా మాదాపూర్ ఏసీపీ శ్యాంప్రసాదరావును నియమించారు. ఇక ఇంటెలిజెన్స్‌లో డీఎస్పీగా పనిచేస్తున్న రఘునందన్‌రావును మాదాపూర్ ఏసీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్రమాస్తుల కేసులో ఇప్పటికే అరెస్టయిన నరసింహారెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసే అవకాశముంది.
ఏసీపీ నరసింహారెడ్డికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో ఏసీబీ అధికారులు కేసులు నమోదుచేసి ఇటీవల దాడులు చేశారు. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌లోని నరసింహ రెడ్డి ఇంట్లో సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయన్ను అరెస్ట్ చేశారు. అదే సమయంలో వరంగల్, కరీంనగర్ , నల్గొండ, అనంతపూర్ జిల్లాలోని 25 ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఇప్పటివరకు రూ.7.5 కోట్ల ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఐతే మార్కెట్ విలువ ప్రకారం ఇది రూ.75 కోట్లు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నరసింహారెడ్డి స్వస్థలం అనంతపూర్‌లో 55 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌లోని సైబర్ టవర్స్, మాదాపూర్ వద్ద 4 ప్లాట్లు, హఫీజ్‌పేట్ వద్ద మూడంతస్తుల భవనం, 2 ఇళ్ళు, 15 లక్షల నగదు బ్యాలెన్స్, 2 బ్యాంక్ లాకర్స్‌ను గుర్తించారు. పోలీస్ పదవిని అడ్డంపెట్టుకొని నరసింహారెడ్డి పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది.
ఐతే ఏకంగా 25 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రాంతాలన్నీ నరసింహ రెడ్డి బంధువులవేనా.. లేదంటే ఇంకేదైనా కోణముందా అనేది తెలియాల్సి ఉంది. నరసింహారెడ్డి సొంతంగా సంపాదించారా? ఎవరికైనా బినామీగా ఉన్నారా? అన్న దానిపైనా ఏసీబీ విచారణ కొనసాగుతోంది. కాగా, అక్రమాస్తుల కేసులో అరెస్టైన నరసింహారెడ్డి గతంలో ఉప్పల్ సీఐగా పనిచేశారు. స్పెషల్ పార్టీలో పనిచేస్తున్న సమయంలో నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేరుమోసిన గొలుసుదొంగ శివను ఎన్కౌంటర్ చేసిన బృందంలో ఈయన ఉన్నారు. నరసింహారెడ్డి పలు భూవివాదాల్లో తలదూర్చి సెటిల్మెంట్లు చేసినట్లు కూడా ఆయనపప ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమాస్తులతో పాటు సెటిల్మెంట్లపైనా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు అధికారులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ACB, Hyderabad, Telangana, Telangana Police