Syed Rafi, News18,Mahabubnagar
Mahabubnagar Congress | తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తి రాగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో సీనియర్ నాయకుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారిపోయాయి. ఇక రాష్ట్రంలోని ఆ నియోజకవర్గ కాంగ్రెస్ లో అసంతృప్తి పీక్స్ కు చేరింది. టికెట్ కోసం ఆ ఇద్దరు పోటీ కోసంవిశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆ ఇద్దరిలో సీటు ఎవరికి దక్కుతుందో చూడాలి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అయోమయ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. టీపీసీసీ ఉపాధ్యక్షుడు జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం కో ఆర్డినేటర్ జనంపల్లి అనిరుద్ రెడ్డిలు రెండు వర్గాలుగా ఏర్పడి రాజకీయాలు చేయడం ఇందుకు కారణం. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అండతో మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ముందుకు సాగుతుండగా, టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతుతో టీపీసీసీ జనరల్ సెక్రటరీ జనంపల్లి అనిరుద్ రెడ్డి టికెట్ నాదే అంటూ ధీమాతో ఉన్నారు.
ఈ క్రమంలోనే జడ్చర్ల నియోజకవర్గంలో పొలిటికల్ కార్యక్రమాలు నడిపిస్తున్నారు. అయితే టీపీసీసీ ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పాల్గొంటుండగా, అనిరుద్ రెడ్డి మాత్రం తనదైన శైలి రాజకీయాలు నడిపిస్తున్నారు. జడ్చర్ల నియోజకవర్గం లో అన్ని మండలాల వారిగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. జనవరి 31న జడ్చర్ల పట్టణ కేంద్రంలో చేపట్టిన మ్యూజికల్ నైట్ తో పాటు సంక్రాంతి పండుగ సందర్భం గా సెల్ఫీ విత్ రంగోలి పేరిట మహిళలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించడం ప్రత్యేక ఆకర్షణగా ఉంది.
అయితే అనిరుద్ రెడ్డి చేపట్టిన రెండు వేర్వేరు కార్యక్రమాలకు పార్టీ శ్రేణులను భాగస్వాములను చేయకపోవడం చర్చనీయాంశం అయింది. సొంత ఖర్చులతో చేపట్టిన ప్రైవేట్ కార్యక్రమాలు అటుంచితే..2023 డిసెంబరులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల కాంగ్రెస్ అభ్యర్థిని నేనే అంటూ అనిరుద్ రెడ్డి చెప్పుకోవడం నియోజకవర్గంలో బహిరంగ రహస్యంగా మిగిలి ఉంది. ఈ నేపథ్యంలోనే జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనే దానిపై నియోజకవర్గంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
గ్రూపుల గోల..
జడ్చర్ల కాంగ్రెస్ పార్టీలో కొంతకాలంగా గ్రూపుల గోల మొదలైంది. బీజేపీ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ వర్గంగా కొందరు పని చేస్తుండగా..టీపీసీసీ జనరల్ సెక్రటరీ జనంపల్లి అనిరుద్ రెడ్డి వర్గంగా ఇంకొందరు విడిపోవడం పార్టీలో ఆసక్తిని కలిగిస్తుంది. ఇందులో భాగంగానే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Mahabubnagar, Telangana