(Syed Rafi, News18,Mahabubnagar)
ప్రజల కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలు సరిగా అమలవడం లేదు. ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు స్పందన కరువైపోతోంది. వాటిని అమలు చేయాల్సిన ప్రభుత్వ అధికారులు, సిబ్బందే దీనంతటికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కంటి వెలుగు పథకం పరిస్థితి అలాగే అవుతోంది. మొదటి విడత సక్సెస్ కావడంతో రెండో విడత కంటి వెలుగు(Kanti velugu)ను సీఎం కేసీఆర్(KCR) కేరళ రాష్ట్ర సీఎం(Kerala State CM ) పినరయి విజయన్(Pinarayi Vijayan)తో కలిసి ప్రారంభించారు. గవర్నమెంట్ ఇంత ప్రెస్టేజియస్‌గా భావిస్తున్న పథకాన్ని విజయవంతం చేయాల్సిన అధికారులు మొక్కుబడిగా విధులకు హాజరవడం పలు విమర్శలకు తావిస్తోంది. ప్రజల అసంతృప్తికి కారణమవుతోంది. వనపర్తి జిల్లా(Wanaparthy)కేంద్రంలో కంటి వెలుగుపై అధికారుల చిత్తశుద్ధి ఇందుకు సాక్ష్యంగా నిలిచింది.
నిర్లక్ష్యంతో నీరుగారుతున్న కంటి వెలుగు..
తెలంగాణ వ్యాప్తంగా కంటి వెలుగు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే వనపర్తి జిల్లాలో మాత్రం కంటి వెలుగు కార్యక్రమం అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంతో నీరుగారి పోతుంది. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పరీక్షలు చేయించాలని, అందులో కంటి చూపు మందగించిన వారికి అద్దాలు, చికిత్సలు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల కేంద్రంలో బుధవారం 10 గంటలు దాటిన కంటి పరీక్షలు నిర్వహించే కేంద్రానికి వైద్య సిబ్బంది రాకపోవడం పట్ల ప్రజలు విస్తూపోతున్నారు.
కంటి చూపుతో నిర్లక్ష్యమా..
గ్రామీణ ప్రాంతం కావడంతో పొలం పనులకు వెళ్లే రైతులు, కూలీలు ఉదయమే పరీక్షలు చేయించుకొని తమ పనులకు వెళ్లి పోదామని చూస్తూ కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే ఉదయం 10గంటలు దాటినప్పటికి వైద్య సిబ్బంది రాకపోవడం పట్ల వీపనగండ్ల మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్వహిస్తున్న ఈకార్యక్రమం అన్నీ వర్గాల ప్రజలకు మేలు కలిగేలా ఉండాలని అధికారులు, సిబ్బంది కారణంగా నీరుగారిపోకూడదని కోరుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామీణ ప్రాంతాల్లో కంటి వెలుగు కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
సరిగా అమలయ్యేలా చూడండి..
ఉదయమే పరీక్షా కేంద్రాన్ని తెరిచి ఉంచి పరీక్షలు చేయించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీడీవో కతాలపను వివరణ కోరగా కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణ పూర్తిగా వైద్య శాఖ దేనిని, జిల్లా మండల వైద్యాధికారులు స్పందించి సరి చేసేలా చూస్తానని తెలిపారు. ఉదయం 9 గంటలకల్లా కేంద్రానికి రావలసిన సిబ్బంది రాకపోవడాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kanti Velugu, Telangana News, Wanaparthi