హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mahbubnagar : పటాకుల వ్యాపారం పేరుతో లక్షలు దోపిడీ.. యాప్ మోసగాళ్లు ముంచేశారు

Mahbubnagar : పటాకుల వ్యాపారం పేరుతో లక్షలు దోపిడీ.. యాప్ మోసగాళ్లు ముంచేశారు

లక్షలు కొట్టేసిన యాప్ మోసగాళ్లు

లక్షలు కొట్టేసిన యాప్ మోసగాళ్లు

దీపావళి దుకాణాలతో బురిడీ కొట్టించారు. గత నెల 24, 25 తేదీల్లో దీపావళి దుకాణ పేరుతో పలు రకాల ఆఫర్లను యాప్ నిర్వాహకులు ప్రకటించారు. దీంతో చాలామంది అప్పులు చేసి లక్షల్లో పెట్టుబడి పెట్టారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Mahbubnagar (Mahabubnagar), India

  Syed Rafi, News18,Mahabubnagar

  కొద్దిపాటి పెట్టుబడితో తక్కువ సమయంలో ఎక్కువ లాభం పొందవచ్చని చాలామంది ఓ మాయదారి యాప్ లో డబ్బులు పెట్టారు. మొదట ఈజీ మనీ ఆశ చూపి ఊరించిన తర్వాత మాయమైపోయింది ఆ యాప్. యాప్ ఓపెన్ కాకపోవడంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం రేపింది.

  పాలమూరు జిల్లాలో యాప్ బాధితులంతా విద్యావంతులే ఎక్కువగా ఉండడం విశేషం. నిత్యం జరుగుతున్న ఆన్లైన్ మోసాలపై పోలీసులు హెచ్చరిస్తున్నా కూడా ఎవరూ పట్టించుకోకపోవడం లేదనేదానికి ఇదే నిదర్శనం. అద్దె వ్యాపారం పేరుతో ఇన్వెస్టర్లకు వల వేశారు ఫేక్ గాళ్లు. పెట్టే పెట్టుబడితో ఇన్వెస్టర్లు భారీ వాహనాలు కొనుగోలు చేయొచ్చని.. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టుల పనులకు ఆ వాహనాలను అద్దెకు పెడతామని.. తద్వారా భారీ ఆదాయం అర్జించి లాభాలు పంచుతామని క్యాటర్ పిల్లర్ యాప్ నిర్వాహకులు నమ్మబలికారు.

  Read Also : Vizag : విన్యాసాలు చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీ..! సాగర్ తీరంలో నేవీ డే శోభ

  ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఆరు వందల రూపాయలు పెట్టుబడిగా పెట్టిన వారికి రోజుకు రూ.18 అద్దె చెల్లిస్తామని రూ.1600 పెట్టిన వారికి రోజుకు 80 రూపాయలు ఇస్తామని చెప్పారు. నమ్మి డబ్బులు పెట్టిన వారికి అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో చెల్లించారు. ఇది వారిలో మరింత ఆశను పెంచింది. దీనితో చాలా మంది తమ కుటుంబ సభ్యుల ఫోన్లలో యాప్ డౌన్లోడ్ చేయించి.. యూపీఐ పేమెంట్స్ తో డబ్బులు పంపించారు.

  ఒకరి నుంచి మరొకరికి తెలియడంతో సెప్టెంబర్, అక్టోబర్ మాసాలు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వందల మంది చేరిపోయారు. రూ.600 నుంచి 2 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు.

  దీపావళి దుకాణాలతో బురిడీ కొట్టించారు. గత నెల 24, 25 తేదీల్లో దీపావళి దుకాణ పేరుతో పలు రకాల ఆఫర్లను యాప్ నిర్వాహకులు ప్రకటించారు. దీంతో చాలామంది అప్పులు చేసి లక్షల్లో పెట్టుబడి పెట్టారు. నవంబర్ 8 నుంచి ఆ యాప్ ఇంటర్నెట్ లో కనపడకుండా పోయింది. ఎంత ప్రయత్నించినా తెరుచుకోలేదు. నిర్వాహకులు ఎవరో.. ఎక్కడి వారో తెలియరాలేదు.

  దిక్కుతోచని స్థితిలో ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. 40 మంది బాధితులు మహబూబ్ నగర్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అందులో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. మహబూబ్ నగర్, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, ఆత్మకూర్, వనపర్తి , కొత్తకోట, గద్వాల, నాగర్ కర్నూల్ , అచ్చంపేట, జడ్చర్ల, పెబ్బేరు, అలంపూర్, కల్వకుర్తి తదితర ప్రాంతాల్లోని చాలామంది బాధితులు ఉన్నారని రెండో పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ వివరించారు.

  వరంగల్ కు చెందిన సాయికుమార్ ఈ యాప్ లింకును ఆత్మకూరులో ఉన్న తన బంధు రాజుకు పంపించాడని పోలీసులు తెలిపారు. వారి ద్వారానే ఇక్కడి వారు పెట్టుబడి పెట్టారని విచారిస్తున్నామని రెండో పట్టణ సి ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అంతర్జాలం మోసాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామనీ.. అత్యాశకు పోయి మోసపోతూనే ఉన్నారనీ.. తమ ఐటీ కోర్ టీం దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి సాధ్యమైనంత వరకు త్వరగా కేసును ఛేదిస్తామన్నారు. బాధితులంతా వివరాలు తెలియజేయాలిని కోరారు.

  Published by:V. Parameshawara Chary
  First published:

  Tags: Mahabubabad

  ఉత్తమ కథలు