రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఆర్టీసీ బస్సులకు కష్టకాలం వచ్చిందని డిపో సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసు శాఖ తీసుకున్న కొత్త నిర్ణయం కారణంగా డిపో చుట్టూ తిరిగి రావాలంటే అక్షరాల రోజుకు లక్షన్నర నష్టం భరించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు బస్సు మలపడానికి డ్రైవింగ్ కష్టాలు కూడా తోడయ్యాయంటూ డిపో డ్రైవర్లు ఇతర సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏం జరిగింది..?
షాద్ నగర్ చౌరస్తాలో నలు దిక్కుల నుంచి వచ్చిపోయే వాహనాలతో రద్దీ ఏర్పడి ట్రాఫిక్ తీవ్రత కలుగుతుందని భావించిన ట్రాఫిక్ పోలీసు శాఖ ఉన్నతాధికారులు డిపోకు అన్ని వైపుల లాంగ్ డిస్టెన్స్ తో యూటర్న్ నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నారు. దీంతో ఆర్టీసీ డిపోకు రెండు గేటుల ముందు వెంటనే మలుపు లేకుండా చాలా దూరం వెళ్లి బస్సులు రావాల్సి ఉంటుంది. ఈ మలుపుల వద్ద బస్సులు తిరగడం లేదని డ్రైవర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే బస్సులొ ప్రయాణిస్తున్న ప్రయాణికులు కూడా తమకు చుట్టూ తిరిగి వచ్చేవరకు చాలా దూరం అవుతుందని అసహనం వ్యక్తం చేస్తూ..మళ్ళీ బస్సు ఎక్కమని చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కరోజులోనే ఈ పరిణామంతో లక్షన్నర రూపాయలు ఆర్టీసీకి నష్టం వాటిల్లిందంటూ ఆర్టీసీ సిబ్బందిశ్రీధర్ రావు, వహీద్, నర్సింహులు, స్వాములయ్య, బాలస్వామి, నరసింహ, వెంకటేష్, గోపాల్, సత్యం, శీను, ఎల్లయ్య, గుండియా నాయక్, పర్వతాలు, రాజశేఖర్, రాములు తదితరులు మీడియా ముందు వాపోయారు.
ముఖ్యంగా బాలానగర్, జడ్చర్ల, రాజాపూర్, మహబూబ్ నగర్ వైపు నుండి వచ్చే ప్రయాణికులు డిపోలకు బస్సులు రావాలంటే జంకుతున్నారని.అనవసరంగా అరగంట కాలయాపన జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని కారణంగా బస్సులో ప్రయాణికులు ఎక్కాలంటే భయపడుతున్నారని అన్నారు. అదే కాకుండా పరిగి రోడ్డు నుండి వచ్చేవారు కూడా తీవ్ర కాలయాపన జరుగుతుందని అటు బ్లాక్ ఆఫీస్ ముందు యూటర్న్ తీసుకొని అక్కడి నుండి డిపోకి రావాల్సి ఉంటుందని ఇలా రెండు వైపులా రూటల్లో వచ్చే ప్రయాణికులు కాలయాపన కారణంగా బస్సు ఎక్కడం లేదని వాపోయారు. కేవలం 24 గంటల్లోనే ఆర్టీసీ డిపోకు లక్షన్నర రూపాయల ఆదాయం కరువైందని సిబ్బంది వాపోయారు.
ఏం చేయాలంటే..?
ఈ సందర్భంగా డిపోలో సిబ్బంది సమావేశం అయ్యారు. ఆర్టీసీ సిబ్బంది మీడియాతో మొరపెట్టుకుంటూ పరిగి రోడ్డులో బస్ డిపో గేటు వద్ద ప్రత్యామ్నాయంగా నిషేధాజ్ఞలు తొలగించాలని కోరుతున్నారు. అవసరమైతే ఆర్టీసీ సిబ్బంది ఒకరు ట్రాఫిక్ జామ్ కాకుండా చూస్తామని చెబుతున్నారు. షాద్ నగర్ ట్రాఫిక్ పోలీసులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ సంస్థకు, ప్రయాణికులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాదు చుట్టూ తిరగడం వల్ల ఐదు కిలోమీటర్ల వ్యత్యాసం ఉంటుందని దీనివల్ల కేఎంపిఎల్ మైలేజ్ కూడా రావడం గగనం అని అన్నారు. అసలే కష్టనష్టాలతో నడుస్తున్న సంస్థకు ఇలాంటి నిషేదాజ్ఞల వల్ల మరింత నష్టం జరుగుతుందని సిబ్బంది వాపోయారు. ట్రాఫిక్ పోలీసులు దీనిని దృష్టిలో ఉంచుకొని గేటు ముందు దారిని పునరుద్ధరించాలని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahabubnagar, Rtc, Telangana