ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మరియమ్మ లాకప్‌డెత్ పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉండడంతో..సంఘటనకు సంబంధించిన బాధ్యులు ఒక్కొక్కరిపై వేటు పడుతోంది. ఇప్పటికే ఆమె కుటుంబానికి ఆర్థిక సహయం ప్రకటించిన సీఎం ఈ విషయంలో కన్నెర్ర చేశారు. దీంతో సంఘటనకు భాద్యులైన ఎస్సైతోపాటు,ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. కాగా తాజాగా ఏసిపిని సైతం అటాచ్ చేశారు. ఆయన గతంలో కూడా ఇలాంటీ సంఘటనలపై నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే వేటు పడింది.
ఇక శనివారం పోలీసులు అంతర్గత విచారణ చేపట్టారు. స్థానిక ఏసిపి శ్యామ్‌ప్రసాద్, ఓఎస్డీ మల్లారెడ్డిలు అడ్డగూడూరు పోలీసు స్టేషన్లో విచారణ జరిపారు.స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలతోపాటు లాకప్ గదులను పరిశీలించారు. సీసీ కెమెరాలను పని చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఉన్న రెండు సీసీ కెమెరాల్లో రిపేరు చేయించినా పనిచేయడం లేదని ఇంచార్జి ఎస్సై చెప్పినట్టుగా తెలుస్తోంది.. ఇక మరోవైపు మరియమ్మ లాకప్‌డెత్‌ను హైకోర్టు కూడా సీరియస్‌గా తీసుకోవడంతో పాటు జుడిషియల్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆలేరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎం. మణికంఠం సైతం అడ్డగూడురు పోలీసు స్టేషన్‌కు వెళ్లి విచారణ జరిపారు. అనంతరం నివేదికను హైకోర్టుకు అందజేయనున్నారు.
అడ్డగూడురు పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి చిత్రహింసలకు గురి చేయడం వల్లే మరియమ్మ మృతిచెందిందని మరియమ్మ కొడుకు ఆరోపించాడు. దీంతో విషయం సీరియస్ అయింది.ప్రతిపక్షాలు లాకప్‌డెత్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు న్యాయపోరాటం చేశారు. దీంతో ఏకంగా సీఎం దిగివచ్చి భాదిత కుటుంబాన్ని ఆదుకునేందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మరియమ్మ కుమారుడికి ఉద్యోగంతో పాటు, ఇళ్లు, పదిహేను లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. మరోవైపు మరియమ్మ ఇద్దరు కూతుళ్లకు కూడా పది లక్షల రూపాలయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
సో.. మొత్తం మీద మరియమ్మ లాకప్‌డెత్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు రాజకీయంగా కూడా ప్రకంపనలు రేపుతోంది. మరియమ్మ కేసులో పోరాటం చేస్తున్న కాంగ్రేస్ పార్టీ నేతలను సీఎం పిలిచి చర్చలు జరపడం,అనంతరం దళిత అభివృద్ది కోసం ప్రత్యేక నిధులను కేటాయించడం లాంటీ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nalgonda police, Telangana